Pardha Saradhi Upadrasta
కొండపల్లి… ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఉన్న గ్రామం ఇది. ఏళ్ల తరబడి మావోయిస్ట్ ప్రభావం వల్ల ప్రపంచం నుండి వేరు పడి పోయిన ఈ ఊరికి మొదటిసారి గా మొబైల్ నెట్‌వర్క్ సేవలు అందాయి. ఆనందంతో గ్రామస్తులు సాంప్రదాయ నృత్యాలతో, సంబరాలు జరుపుకున్నారు.
దశాబ్దాల పాటు మూతపడిపోయిన కలలు — ఆశలు — అవకాశాలు ఇప్పుడు మళ్లీ రెక్కలు తొడుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాయి. నియాద్ నెల్నార్ యోజన (Niyad Nellanar Yojana) పధకం ద్వారా అన్ని సదుపాయాలు అందనున్నాయి.ఈ పధకాన్ని ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2024లో ప్రారంభించింది.
రాష్ట్రంలోని నక్సల్స్ ప్రభావిత, వెనుకబడిన ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ పధకం లక్ష్యం. దీని ద్వారా గిరిజనులకు ఉచిత విద్యుత్, గ్యాస్, రేషన్, నీటి పంపులు, అంగన్‌వాడీ సేవలు ప్రభుత్వ సౌకర్యాలను అందిస్తారు.. అటవీ హక్కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇస్తారు .
ఈ క్రమంలో ఇప్పుడీ గ్రామానికి బ్యాంకింగ్ .. విద్య .. అత్యవసర సేవలు అందబోతున్నాయి. బయటి ప్రపంచంతో కనెక్టివిటీ ఏర్పడటంతో అన్నీ ఆ గ్రామం చేరుకునే మార్గం తెరుచుకుంది.ఇది ఒక నెట్‌వర్క్ ప్రారంభం కాదు.. ఇది ఒంటరితనానికి ముగింపు. ఇది అంధకారంపై అభివృద్ధి విజయ నర్తనం.
నక్సలిజం — ఒకప్పుడు ప్రజల కోసం… ఆ తరువాత ప్రజలకు అడ్డుగా నిలిచింది. మొదట్లో నక్సలిజం ఉద్యమం సామాజిక న్యాయం కోసం, భూమి హక్కుల కోసం, బాధపడుతున్న వాళ్ల కోసం అంటే మంచి ఉద్దేశ్యంతో మొదలైంది.
కానీ కాలక్రమేణా — అది ప్రజల అభివృద్ధిని అడ్డుకునే, అవకాశాలను నిలిపివేసే శక్తిగా మారిపోయింది. నా చిన్నప్పుడు మా మండలంలో గ్రామాలకు నక్సలిజం అంటే ఏమిటో — ఎందుకు వచ్చారో, వారి మాట ఏంటో ఎవరికి స్పష్టంగా తెలియదు. కానీ ఒక స్పష్టమైన విషయం మాత్రం కనిపించేది..
మా ఊర్లో ఒకసారి మొబైల్ టవర్ రావడానికి పనులు మొదలుపెట్టారు… కానీ నక్సలైట్‌లు దాన్ని పేల్చేశారు. రోడ్లు వేయాలనుకున్న కాంట్రాక్టర్లు వస్తే —“పనులు చేయొద్దు… వెనక్కి వెళ్లండి” అని బెదిరించేవారు. గ్రామాల్లోకి హెల్త్ వర్కర్లు, టీచర్లు, ప్రభుత్వ సిబ్బంది వస్తే — “మీరు ఇన్ఫార్మర్లు అవుతారు” అని పంపించేవారు.
ఏ చిన్న అభివృద్ధి కూడా దారి లోపలే నిలిచిపోతుండేది. కొంత కాలం తరువాత — మరొకసారి ఆలోచిస్తే… వాళ్లు ఏ లక్ష్యాల మీద పోరాటం మొదలు పెట్టారో, ఆ లక్ష్యాలు ఎంత దూరం పక్కదోవ పట్టాయో ప్రజలే అర్థం చేసుకున్నారు. అభివృద్ధిని అడ్డుకునే సిద్ధాంతం కాదు, అభివృద్ధిని నిర్మించే చేతులే శక్తి… నిజమైన రివల్యూషన్ పేలుళ్లతో రాదు.
స్కూల్ నిర్మాణంలో, రోడ్లు విస్తారంగా వేసినప్పుడు , స్కూల్ లకు ఉపాధ్యాయులు భయం లేకుండా వచ్చి చదువు చెప్పినప్పుడు, ప్రజలకు హాస్పిటల్స్ , ప్రభుత్వ పథకాలు అందుబాటులో వచ్చినప్పుడు వస్తుంది.
అసలు విప్లవం అంటే భయం పోవడం. సంబంధాలు ఏర్పడడం. అవకాశాలు రావడం. ఈ అవకాశాలను ఈ ప్రజలు దశాబ్ధాలుగా కోల్పోయారు.
నక్సలిజం మొదట్లో ఒక ఆశ… తరువాత అది అడ్డంకి… ఇప్పుడు ప్రజలు అభివృద్ధిని ఎంచుకున్నారు
పుస్తకాల్లో రాసిన సిద్ధాంతాలు కాదు. ప్రజల హృదయాల్లో రాసుకున్న వాస్తవాలే శాశ్వతం.

