Rare library ……………………………
ఈ సారస్వత నిలయం వయసు 107 ఏళ్ళు. ‘ వేటపాలెం’ లో ఉన్న ఈ గ్రంధాలయం ప్రస్తుతం బాపట్ల జిల్లా లో ఉంది. జిల్లాల విభజన తర్వాత ప్రకాశం నుంచి బాపట్ల జిల్లా లోకి వచ్చింది. ఈ వేటపాలెం’ గ్రంథాలయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది.
పెద్ద పెద్ద రచయితలు … రీసెర్చ్ స్కాలర్లు ఎందరో ఈ గ్రంధాలయం దర్శించినవారే. కేవలం వంద పుస్తకాలు, రెండు దినపత్రికలతో ఈ గ్రంథాలయం 1918 అక్టోబరు 15న ప్రారంభమైంది.‘సారస్వత నికేతనం’గా ప్రాచుర్యంలోకి వచ్చిన ఈ గ్రంథాలయంలో ప్రస్తుతం దాదాపు లక్ష గ్రంథాలు, తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికలు, వార, పక్ష, మాస పత్రికలు ఉన్నాయి.
హిందీ, తెలుగు, సంస్కృతం, ఇతర భారతీయ భాషలలో అరుదైన తాళపత్రాలు, కాగితపు రాతప్రతులు ఈ లైబ్రరీ లో ఉన్నాయి. వీటిని డిజిటలైజ్ చేస్తున్నారు. ‘వేటపాలెం’కు దేశవ్యాప్తంగా ఈ లైబ్రరీ ఖ్యాతి తెచ్చిపెట్టింది.
రాజమహేంద్రవరంలోని గౌతమి గ్రంథాలయం తరువాత అంతటి పెద్దది …విశిష్ట చరిత్ర కలిగిన ఏకైక గ్రంధాలయం ఇదే. వేటపాలెం వాస్తవ్యులైన వూటుకూరి సుబ్రాయశ్రేష్ఠి, కమలాంబ దంపతులు సమాజాన్ని, ప్రజలను చైతన్యవంతుల్ని చేయాలన్న సంకల్పంతో ఈ గ్రంథాలయం ఏర్పాటుచేశారు.
దీని నిర్వహణ కోసం అప్పట్లో హిందూ యువజన సంఘాన్ని ఏర్పాటుచేశారు. తొలుత ఈ గ్రంథాలయం ఆ సంఘం పేరుతోనే నడిచింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా పుస్తక పఠనం.. అక్కడి నుంచి పొద్దుపోయేదాకా జాతీయోద్యమ భజనలు, గీతాలతో గ్రంథాలయ ప్రాంగణం హోరెత్తిపోయేది.
ఆ తర్వాత అడుసుమల్లి శ్రీనివాసరావు పంతులు కూడా ఈ గ్రంధాలయ అభివృద్ధికి కృషి చేశారు. 1924లో గ్రంథాలయానికి ‘సారస్వత నికేతనం’ అనే పేరు ఖరారు చేశారు.ఇది స్థానిక సమాజానికి సాంస్కృతిక, మేధో కేంద్రంగా పనిచేసింది.
మహాత్మా గాంధీ ప్రధాన శిష్యులలో ఒకరైన సేఠ్ చమన్‌లాల్ గ్రంథాలయాన్ని ఒక పెంకుటింట్లో ప్రారంభించారు. నూతన భవనాలకు 1929 ఏప్రిల్ 18న గాంధీ స్వయంగా శంకుస్థాపన చేశారు. అలా పూర్తయిన భవనాన్ని టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు.1935లో బాబూ రాజేంద్ర ప్రసాద్ గ్రంథాలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి శంకుస్థాపన చేశారు.దీన్నొక జ్ఞానమందిరంగా వర్ణించారు
1936లో మరోసారి మహాత్మాగాంధీ సారస్వత నికేతనాన్ని సందర్శించారు. అప్పుడు ఆయన చేతికర్ర కింద పడి విరిగిపోగా, దానిని నిర్వాహకులు భద్రపరిచారు. గ్రంథాలయంలోకి అడుగుపెట్టినవారికి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన మహాత్ముడి మూర్తి..ఆయన చేతిలోని నాటి చేతికర్ర దర్శనమిస్తాయి.
తరవాత కాలంలో చిలకమర్తి లక్ష్మి నరసింహం ,కాశీనాధుని నాగేశ్వరావు,కట్టమంచి రామలింగారెడ్డి వంటి ప్రముఖులు ఈ గ్రంథాలయాన్ని సందర్శించారు. ఈ లైబ్రరీ లో అతి ప్రాచీన గ్రంథాలు ఎన్నో ఉన్నాయి. అరుదైన, పునఃముద్రణ జరగని విలువైన గ్రంథాలను జిరాక్స్ తీసుకొనే అవకాశం ఉంది.
ఈ గ్రంథాలయంలో లక్షకు పైగా పుస్తకాలు ఉన్నాయి. అందులో 60 వేలు తెలుగు, 29వేలు ఇంగ్లిష్, 5వేల హిందీ పుస్తకాలు ఉన్నాయి.అలాగే పురాతన తాళపత్ర గ్రంధాలు 121 వరకు ఉన్నాయి.ఈ సారస్వత నికేతనం కు 2018 లో అరుదైన గౌరవం దక్కింది.
ఈ గ్రంథాలయ భవనం చిత్రాన్ని పోస్టల్ కవర్‌పై ముద్రించారు.. గ్రంథాలయం ఏర్పాటు చేసి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం ఈ పోస్టల్ కవర్ ను ఆవిష్కరించింది. అటు పరిశోధకులకు … ఇటు సివిల్స్, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న పేద, మధ్యతరగతి యువతకు ఈ గ్రంథాలయం చక్కగా ఉపయోగపడుతోంది.
పుస్తక ప్రియులు తప్పనిసరిగా సందర్శించాల్సిన గ్రంధాలయం ఇది. అటు చీరాలకు ఇటు ఒంగోలుకి మధ్యలో ఉన్న ‘వేటపాలెం’ కు రైలు లేదా బస్ ద్వారా వెళ్ళవచ్చు.
————-KNM
post updated on 1-7-25