ఆద్యంతం ఆసక్తికరం పహున ! (ది లిటిల్ విజిటర్స్)

Sharing is Caring...

పూదోట శౌరీలు  ………….. 

చిన్నపిల్లల ముందు పెద్దవాళ్ళు అనాలోచితంగా మాట్లాడే మాటలు .. అసందర్భ ప్రేలాపనల మూలంగా పిల్లలు ఎలాంటి చిక్కుల్లో పడతారు,వారి లేత మనసుల్లో ఎలాంటి విష బీజాలు నాటుకుంటాయో ? ఫలితంగా పిల్లలు ఎదుర్కొనే ఆపదలు,మానసిక సంఘర్షణ,మున్ముందు ఆ పిల్లలు ఎలాంటి భావజాలంతో పెరుగుతారు,సమాజం అలాంటి భావాలతో పెరిగిన పిల్లల వల్ల ఎంతగా నష్టపోతుందనే కథాంశం తో ఈ సినిమా నిర్మితమైంది.

నేపాల్ లోని ఓ కుగ్రామంలోని ప్రజలు మావోయిస్టుల దాడులకు,తుపాకీ మోతలకు భయపడి,తమకున్న కొద్దిపాటి ఆహారం,కొద్ది సామాను మోసుకుంటూ,నేపాల్ వదిలి,సిక్కిం లో తల దాచుకోవటానికి,ఒక గుంపుగా బయలు దేరుతారు.
తల్లి (మంజు చెత్రి)తండ్రి(సరన్ రాయ్)తమ ఎనిమిదేళ్ళ కొడుకు ప్రణయ్ (అన్మల్ లింబూ) కూతురు అమృత(ఇషిక గురుంగ్) ఎనిమిది నెలల బిషోల్ తో కలిసి గ్రామస్తుల వెంట బయలుదేరుతారు.

ఈ లోగా మావోయిస్టుల తుపాకీ మోతలు విన్న తండ్రి కోపంతో “నేను అమాయకులైన మన వూరి వారి మీద ఎందుకు కాల్పులు జరుపుతున్నారో తెలుసుకుని వస్తాను.మీరు వెళ్తూ వుండండి”.అని వెనక్కి వెళతాడు. ఎంతకీ భర్త రాకపోవటంతో పిల్లల్నితన సోదరికి అప్పగించి పిల్లలతో”మీరు గుంపును వదిలి పక్కకు వెళ్ళవద్దు.పొట్లాడుకోవద్దు.. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోండి.నేను వెళ్ళి మీ నాన్నను తీసుకుని వస్తాను” అని చెప్పి వెనక్కి వెళుతుంది. 

పిల్లలు ఆ గుంపులో కలిసి కొండలెక్కుతూ … దిగుతూ ఆ అడవుల్లో నడుస్తూ వుంటారు. ఒక రాత్రివేళ అడవిలో ఆగి వంట చేసుకుని తిని విశ్రాంతి తీసుకుంటారు.గుంపులో ఈ ముగ్గురే పిల్లలు.తక్కిన వాళ్లంతా పెద్దలే. ఆ నిశి రాత్రి వేళ ముసలి వాడైన రాయ్ అంకుల్ హిమాలయాల్లో సంచరించే యతిని గురించి భయంకరంగా వర్ణిస్తాడు.పిల్లలు ఆ మాటలు వింటూ వాళ్ళ ఎనిమిది నెలల చిన్ని తమ్ముడిని కరుసుకుని పడుకుంటారు.

గుంపులోని యువకులు” మనం పొద్దున్నే లేచి సిక్కిం లోని పెల్లింగ్ అనే వూరిలో తలదాచు కోవటానికి వెళ్తున్నాం.అక్కడి చర్చ్ లోని ఫాదర్స్ శరణార్థులకు ఆశ్రయమిచ్చి ఆదుకుంటున్నారు.ఈ పరిస్థితుల్లో మనం అక్కడికి వెళ్ళటమే మంచిది.”అంటారు.ఈ మాటలన్నీ పిల్లలు వింటూనే ఉంటారు.

దానికి పెద్దాయన రాయ్ అంకుల్ ” చర్చ్ కి వద్దు.ఆ ఫాదర్ లు పొడుగు గౌన్లు వేసుకుని,నడుము కు పట్టీ కట్టుకుని,మెడలో సిలువ ధరించి వుంటారు.వాళ్ళు మనల్నివాళ్ళ మతంలోకి మారుస్తారు.మన మతాన్ని.. మన సంస్కృతిని నాశనం చేస్తారు.పైగా వాళ్ళు చిన్న పిల్లల్ని పట్టుకుని తీసుకెళ్ళి బానిసలుగా మారుస్తారు.పిల్లల్ని హింసిస్తారు.చిన్న పిల్లల్ని అయితే పీక్కుని తింటారు.కాబట్టి ఆ వూరికి వద్దు” అంటాడు.

ఈ మాటలు వింటున్న ప్రణయ్,అమృత విపరీతంగా భయపడతారు.తెల్లారి సిక్కిం లోని పెల్లింగ్ వైపుగా కదులుతున్న గుంపును వదిలి వాళ్ళను ఏమార్చి… పిల్లలిద్దరూ తమ్ముడితో సహ అడ్డదారిన అడవుల్లోకి పారిపోతారు. పోగా… పొగా అక్కడ ఒక పాడైపోయిన ఒక వాన్ కనిపిస్తుంది. ఆ వాన్ ని  వుండటానికి వీలుగా చేసుకుని వాళ్ళ దగ్గర వున్న ఆహార పదార్థాలు తింటూ దగ్గరలో వున్న జల పాతం లోని నీళ్ళు వాడుకుంటూ తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ గడుపుతుంటారు.

ఒకరోజు వాన్ కి కాస్త దగ్గరలో వెళ్తూ ఒక చర్చ్ ఫాదర్ కనిపిస్తారు.రాయ్ అంకుల్ మాటలు మదిలో మెదిలి పిల్లలు విపరీతమైన ఆందోళనకు గురవుతారు.ఆయన కంట పడకుండా ఉండటానికి నానా అగచాట్లు పడతారు. అలా రెండు,మూడు సార్లు ఆ దారిన వెళ్తున్న ఫాదర్ కనిపిస్తాడు.

ఒకరోజు ఒక గొర్రెల కాపరి కలిసి,ప్రణయ్ కి తన గొర్రెలు కాసే పని ఇస్తాడు.దాంతో అతడిచ్చే పాలు,రొట్టె లతో ఆకలి తీర్చుకుంటూ వుంటారు.అలాగే అమృతకు దగ్గర్లో వున్న గ్రామంలోని ఒక గర్భిణీ స్రీ తనకు తోడుగా వుండటానికి అమృతను పనికి పెట్టుకుంటుంది. పిల్లలిద్దరూ వంతుల వారీగా తమ్ముడిని చూసుకుంటూ  తల్లి తమని ఎలాగైనా కలుస్తుంది అని ఆశతో ఎదురు చూస్తుంటారు..

పిల్లలిద్దరూ కాసేపు పొట్లాడుకోవటం… ఏడవటం… తమ్ముడి ఏడుపుని ఆపలేక సతమత మవుతుంటారు. అప్పుడప్పుడు ఆ దారిన వెళ్తున్న చర్చ్ ఫాదర్ ని  చూసి.. భయపడి దాక్కోవటం ఇలా జరుగుతూ వుంటుంది.ఒకరోజు అమృత పని నుండి రావటం లేట్ అవుతుంది.తమ్ముడు నిద్ర పోతున్నాడు,ఈలోగా అమృత వచ్చేస్తుంది లే,అనుకుని,వాన్లో నిద్ర పోతున్న తమ్ముడిని వదిలి ప్రణయ్ పనికి వెళ్తాడు.

ఈ లోగా పాడైపోయిన వాన్ ని సొంత దారులు ఇంకో లారీకి కట్టుకుని తీసుకుని వెళ్తారు.ప్రణయ్ కి దారిలో ఈ వాన్ కనిపిస్తుంది.ప్రణయ్ అతి కష్టం మీద అడ్డదారిన పరుగెత్తుతూ వాన్ ని ఆపి అందులో వున్న తమ్ముడిని ఏమి  చేశారు అని అడుగుతాడు.ఇక్కడకు దగ్గరలో వున్న చర్చ్ ఫాదర్ కి మీ తమ్ముడిని అప్పగించాము,పోయి తెచ్చుకోమని చెప్తారు.. అడవికి తిరిగొచ్చిన ప్రణయ్ కి  తమ్ముడి కోసం ఏడుస్తూ అమృత కనిపిస్తుంది.

ఇక పిల్లలిద్దరూ చర్చ్ దారిని అన్వేషిస్తూ బయలు దేరుతారు.చివరకు చర్చ్,సిస్టర్స్ నడుపుతున్న అనాధాశ్రమం కనిపిస్తాయి.మెల్లిగా చర్చ్ లో చొరబడతారు.కిటికీలో నుండి తొంగి చూస్తున్న ఆశ్రమం లోని పిల్లవాడిని చూసి వాళ్ళ తమ్ముడి వివరాలు అడుగుతారు..ఈ లోగా ఫాదర్ ఈ పిల్లల్ని చూస్తాడు.

తన గదిలోకి తీసుకుని వెళ్ళి వివరాలు అడుగుతుంటారు.పిల్లలిద్దరూ వెక్కివెక్కి ఏడుస్తూ,మా” తమ్ముడు ని ఏమి చేశావ్,పీక్కుని తినేశావా.? మమ్మల్ని గూడా చంపేస్తావా.? అంటూ ఇష్టం వచ్చినట్లుగా ఫాదర్ ని తిడతారు.. ‘మీరిక్క డే కూర్చోండి…  ఇప్పుడే వస్తాను’ అంటూ పిల్లలు పారిపోకుండా బయట గడేసి వెళ్తాడు ఫాదర్.

దాంతో ఇంకా భయపడతారు ప్రణయ్,అమృత. ఎలాగైనా ఫాదర్ ని చంపాలని పదునైన వస్తువుల కోసం ఆ గదిలో వెతుకుతారు. ఏమీ కనిపించవు.చివరకు మూలన వున్న రెండు గొడుగులు తీసుకుని సిద్దంగా వుంటారు. తలుపులు తెరచుకుంటాయి.

ఆశ్చర్యం.! అద్భుతం.!ఎదురుగా వాళ్ళ తల్లి..తల్లిని చూసి వాటేసుకుని ఏడుస్తూ అప్పటి వరకూ వాళ్ళు పడ్డ బాధల్ని ఏకరువు పెడతారు.,ఫాదర్ తమ్ముడిని దొంగలించాడని  చెప్తారు. తల్లి పిల్లల్ని దగ్గరకు తీసుకుని మందలించి ” మీకు ఇలాంటి తప్పుడు మాటలు ఎవరు చెప్పారు.ఇక్కడి చర్చ్ ఫాదర్,సిస్టర్స్ మానవత్వం తో మాకు ఆశ్రయమిచ్చి…  ప్రేమతో తిండి పెట్టీ .. వైద్యం చేసి,ఆదుకున్నారు.

మమ్మల్ని మతం మారమని గానీ,వాళ్ళ మతం గురించి గానీ మాకు చెప్పలేదు.మీకు మతాన్ని గురించి చెడుగా చెప్పిన రాయ్ అంకుల్ ఇక్కడే ఆనందంగా గడుపుతున్నాడు.మన వూరి వారంతా ఇక్కడే వున్నారు” అని చెబుతుండగానే రాయ్ అంకుల్   ఊరి జనం ..  తమ్ముడితో వాళ్ళ తండ్రి అందరూ వచ్చి సంతోషంతో పిల్లల్ని కలుసుకుంటారు..

పరమత సహనం లేకుండా, మత ద్వేషం రెచ్చగొడుతూ,మనం మాట్లాడుకునే మాటలు నేటి తరం పిల్లల మీద ఎలాంటి దుష్ప్రభావం  చూపిస్తుం దొ ఈ సినిమా లో చక్కగా చూపించారు..ఈ సినిమా సిక్కిం అడవుల్లో, గ్రామాల్లో చిత్రీకరించారు. హిమాలయ పర్వత పాదాల్లో వుండే అందమైన  కొండలు,లోయలు,గ్రామాలు,ప్రకృతి,యాక్ లు(జడల బర్రెలు) ఈ సినిమాలో మనకు కనిపిస్తాయి.

నేపాలి భాషలో 2017 లో తీసిన ఈ సినిమా ను  ప్రియాంక చోప్రా నిర్మించారు. కథ.. దర్శకత్వం పాఖి టైర్వాలా. సినిమాటోగ్రఫీ రగూల్ ధారు మాన్.జర్మనీలో జరిగిన ScHlINGL ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఈ చిత్రానికి ప్రత్యేక ప్రస్తావన లభించింది.  ఈ సినిమా netflix లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో వుంది. ఆసక్తిగలవారు చూడవచ్చు. 
  

Sharing is Caring...
Support Tharjani

One Response

  1. యూ.వి.రత్నం February 19, 2021
error: Content is protected !!