వర్మ కన్ను ఆ ‘దీవి’ పై పడినట్టు లేదే !

Sharing is Caring...

ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ దృష్టికి ఈ “దెయ్యాల దీవి” కథనం వచ్చినట్టు లేదు.  ఆమధ్య ఆ దీవి ని అమ్ముతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఆయన దృష్టికొచ్చి ఉంటే   ఖచ్చితంగా అక్కడ ఒక సినిమా ప్లాన్ చేసేవాడు. టీమ్ ను తీసుకుని ఆ దీవి లో సంచరించి అక్కడ పురాతన భవనాల మధ్య ఒక మంచి హారర్ సినిమా తీసి ఉండేవాడు. హారర్ మూవీకి తగినట్టు అక్కడ వాతావరణం ఉన్నట్టు కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి .
ఇంతకూ ఆ దీవి ఎక్కడ ఉంది ? అసలు కథేమిటో  చదవండి.
——-
దెయ్యాల గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నట్టే  ఆ దీవి గురించి కూడా పలు కథలు ప్రచారం లో ఉన్నాయి. ఆ దీవి లో దెయ్యాలు సంచరిస్తున్నాయని ప్రచారం జోరుగా సాగడం తో దాని పేరు ‘దెయ్యాల దీవి’ గా స్థిరపడిపోయింది. ఈ దీవి పేరు పోవెగ్లియా ఇటలీ లో ఉంది.  పోవెగ్లియా ద్వీపం వెనిస్ సమీపంలో ఉత్తర ఇటలీ తీరంలో ఉంది. అక్కడ అయిదారు శిధిల భవనాలు కూడా ఉన్నాయి. వేల ఏళ్ళ క్రితం కొన్ని తెగల వారు ఇక్కడ నివసించేవారు. తర్వాత ఆ తెగ అక్కడనుంచి తరలిపోయింది . 1348 లో ఇటలీలో ప్లేగ్ వ్యాధి విజృంభించిన నేపథ్యంలో  వ్యాధి  జనానికి సోకకుండా ప్లేగ్ బాధితులను  తీసుకెళ్లి పోవెగ్లియా దీవిలో వదిలేసేవారు.

అప్పటినుంచి ఆ దీవి ఒక డంప్ యార్డ్ లా మారిపోయింది. వ్యాధి బారిన పడి కొందరు అక్కడే చనిపోయారు . బతికిన కొద్దీ మంది కూడా అక్కడి నుంచి తప్పించుకు రాలేక అక్కడే కనుమూశారు. దిక్కుమొక్కు లేకుండా శవాల దిబ్బలా ఆ దీవి తయారైంది. ఎవరైనా ఎదురు తిరిగితే ఇటలీ సైనికులు వారిని మంటల్లోకి నెట్టి చంపేసేవారట. కాగా 1645 లో వెనిస్ ప్రభుత్వం  ఇక్కడ  అయిదు అష్టభుజి కోటలను నిర్మించింది. అక్కడ  సిబ్బందిని నియమించి  తీరప్రాంతాల్లోకి ఎవరూ రాకుండా కట్టడి చేసే ప్రయత్నాలు చేసింది. కొంత కాలం సరుకు రవాణా కేంద్రం గా వినియోగించింది. 1793  లో మరల ప్లేగ్ వ్యాధి రావడం తో ఇదొక క్వారంటైన్ కేంద్రంగా మారింది. అపుడు కూడా వేలల్లో బాధితులు మరణించారు. 

 అలా చనిపోయిన వారంతా దెయ్యాలుగా మారి కోపంతో తిరుగుతున్నాయని వార్తలు ప్రచారంలో కొచ్చాయి. అది నిజమనుకునేలా కొందరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మరణించారు.   అక్కడ అసలు ఏమి జరుగుతుందో తెలుసుకుందామని వెళ్లిన వారిలో చాలామంది  తిరిగి రాలేదు. ఈ దీవిలో 1922 లో ఒక మెంటల్ ఆసుపత్రి ని పెట్టారు. మానసిక క్షోభకు గురైనవారిని అక్కడకి తరలించేవారు. అక్కడి ఆసుపత్రి లో పని చేసే వైద్యుడు దెయ్యాల గురించి పరిశోధనలు చేసేవారట. అతను కూడా దెయ్యాల ఆగ్రహానికి గురై , మతి చలించి మేడపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడనే  కథనాలు ప్రచారంలో ఉన్నాయి. 1968 వరకు ఆసుపత్రి పనిచేసింది తర్వాత మూత పడింది.

 దెయ్యాల ఉనికి నిజమా ? లేక ఉత్తుత్తి ప్రచారమా అనుకునే రోజుల్లో ఒక అమెరికన్ టీవీ రిపోర్టర్ ఈ దీవికి వెళ్లి ఒక కార్యక్రమం చేశారు. అక్కడ దెయ్యాలు ఉన్నట్టు నిర్ధారించారు. ఘోస్ట్ అడ్వెంచర్స్ టీమ్ కూడా ఇక్కడ కెళ్ళి పరిశోధన చేసింది.
ఎక్కడ పడితే అస్థిపంజరాలు … నిప్పుల్లో కాలిపోయిన వారి బూడిద ఆ మట్టిలో కల్సిపోయాయట.  కొన్ని చోట్ల వింత శబ్దాలు వినిపించేవట. ఎవరో తమ వెనుక తిరుగుతున్నట్టు ఫీలయ్యారట. మొత్తం మీద కొన్ని అనుమానాలు ఉన్నాయని తేల్చారు. ఈ దీవి పై ఎన్నో పుస్తకాలు .. సినిమాలు కూడా వచ్చాయి. ఆమధ్య ఈ దీవిని అమ్ముతామని ఇటలీ ప్రకటించింది.  కొనటానికి  కొందరు ముందుకొచ్చారు కానీ డీల్ ఒకే కాలేదు. 

ప్రస్తుతం ఇటలీలో అత్యంత హాంటెడ్ ప్రదేశాలలో ఇది ఒకటిగా మారింది. అధికారికంగా ఈ దీవిని దర్శించడం చట్ట విరుద్ధం. అక్కడికి వెళ్ళడానికి పడవలు కూడా ఉండవు.  థ్రిల్ కోరుకునే అన్వేషకులు ఇక్కడికి రహస్యంగా  వెళుతుంటారు. అది క్లుప్తంగా ఆ దెయ్యాల దీవి కథ.
—-
వర్మ గారూ … ఇప్పటికి మించిపోయింది లేదు.  ఆ దెయ్యాల దీవి పై కన్నేయండి. ఓ మంచి సినిమా చేయవచ్చు. 

———- KNMURTHY

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!