అద్భుతం .. ఈ ‘వైష్ణవ అర్ధనారీశ్వరం’ !!

Sharing is Caring...

డా. వంగల రామకృష్ణ…………………………..

వైష్ణవ అర్ధనారీశ్వరం రాధాగోపాలం. కృష్ణుని అనురాగంలో అర్ధనారి రాధ. కృష్ణుని ప్రియునిగా ప్రేమించింది.. భర్తగా ఆరాధించింది. లోకానికి హోలీ పండుగను పంచిన ప్రేమ జంట రాధాకృష్ణులు. ప్రేమపై చెరగని ముద్ర రాధాకృష్ణులది.

రాధా వల్లభ సంప్రదాయం , నింబార్క సంప్రదాయం , గౌడీయ వైష్ణవం, పుష్టిమార్గం, మహానాం సంప్రదాయం, మణిపురి వైష్ణవం, స్వామినారాయణ సంప్రదాయం , వైష్ణవ-సహజియ , హరిదాసి సంప్రదాయాలు రాధను కృష్ణుని లలిత సుందర పార్శ్వంగా, అవిభాజ్యమైన అర్థనారిగా స్తోత్రం చేశాయి. ప్రేమకు,కరుణకు, భక్తికి మారుపేరుగా గుర్తించి ఆరాధిస్తున్నాయి.

రాధ శక్తి అవతారం. పురాణాలు రాధాదేవిని మహాలక్ష్మి పరిపూర్ణ అవతారంగా వర్ణించాయి. కృష్ణుడు గోకులంలో ద్విభుజుడిగా, వైకుంఠంలో చతుర్భుజ నారాయణునిగా ఉంటాడు. గోకుల కృష్ణుడికి రాధ భార్య కాగా వైకుంఠనారాయణునికి లక్ష్మీదేవి భార్య అంటోంది దేవీభాగవతం.

రాధ గోకులంలో వృషభానుడు, కళావతి దంపతులకు కుమార్తెగా జన్మించింది. వృషభానుడు ఒక యజ్ఞం చేయడానికి భూమిని సిద్ధం చేస్తున్నప్పుడు జనకుడుకి సీతలా భూమిజగా.. అయోనిజగా దొరికింది. బ్రహ్మ వివర్త పురాణం ప్రకారం రాధాకృష్ణులు బృందావనంలోని భండీర వనంలో వివాహం చేసుకున్నారు. వీళ్ళ వివాహానికి బ్రహ్మదేవుడు పెద్దరికం వహించాడు.

హోలీపండుగకు వీరే ఆద్యులు
లోకానికి అందమైన చిలిపి అల్లరికి ఆలవాలమైన రంగుల పండుగ హోలీని అందించిన ఘనత రాధాకృష్ణులది. దానికో చిలిపి కథ ఉంది. రాధ అందంగా ఉందని, తాను నల్లగా ఉన్నానని చిన్నప్పుడు కృష్ణుడు ఏడ్చాడు. అందుకు యశోద నవ్వేసి “నువ్వు ఏడవడమేంటిరా.. నీకు నచ్చిన రంగును రాధ ముఖాన పూసి ఏడిపించరా” అని కొంటె సలహా ఇచ్చింది యశోద.

అప్పుడు గోపీరంగును రాధ ముఖానికి పూసి వినోదించాడు కృష్ణుడు. ఆయన ఆనందం చూసి చిత్తయిన గోకులం గోపీ రంగును పులుముకుని, పరస్పరం జల్లుకుని కృష్ణుని మురిపించింది. ఈ విధంగా కూడా గోపి, గోపకులు గోపగణాలయ్యారు. కాలక్రమంలో ఈ వేడుక రంగుల పండుగగా మారింది. బాలకృష్ణుని మెప్పించే భక్తిమార్గమైంది.

ఆడా మగా తేడా లేకుండా ఆడడం వల్ల హోలీ మధుర, స్నేహ భక్తులకు కేంద్రబిందువైంది. అలా వ్రజభూమికి హోలీ పండుగ వచ్చింది. కొత్త శోభను తెచ్చింది. ప్రతి సంవత్సరం కృష్ణుడు రాధను చూడడానికి దొంగచాటుగా నందగావ్ వదిలి రాధ ఊరు బర్సానాకు వెళతాడు. కృష్ణుని ఏడ్పించడానికి అక్కడ రాధా, ఇతర గోపికలు కలిసి దొంగ కృష్ణుని చిలిపిగా చిరుదెబ్బలు కొడుతూ పరుగులెత్తించేవారు. తర్వాత కోలాటం ఆడేవారు. దీనికి కొనసాగింపుగా గోవర్ధనగిరి వద్ద రాసలీల కూడా ఆడేవారు.

పాలపిట్టలు రాధాకృష్ణులు
రాముడికి ధనురాబాణాలలాగ కృష్ణుడికి మురళి, నెమలిపింఛం కొండ గుర్తులు. కృష్ణుని రూప గుణాలను పుణికి పుచ్చుకున్న రాధకు గుర్తు పాలపిట్ట. ఈ పిట్టకు గోపీ అనే పేరు కూడా ఉండడం విశేషం. ఈ అందాల పిట్టకు పాలగుమ్మ, పూర్ణకూటము, సుపర్ణము, చిత్రవాజము, చిత్రవాలము, కిదివి, చాషము వంటి అనేక పేర్లున్నాయి.

కొన్ని ప్రాంతాల్లో పాలపిట్టను ‘నీలకంఠ’ అని పిలుస్తారు.నీలకంఠుడంటే శివుడు. అర్ధనారీశ్వర తత్త్వానికి అద్దంపట్టే ఉమామహేశ్వరులను, రాధాకృష్ణులను తలపించే పాలపిట్ట సిసలైన స్త్రీపుంస యోగానికి, హరిహరాద్వైతానికి సంకేతంగా నిలుస్తోంది.

మగ పాలపిట్ట ఆడ పాలపిట్ట చూడడానికి ఒకేలా ఉంటాయి. రాధ కూడా తననితాను కృష్ణుడిగా అలంకరించుకుని పరవశించిపోయేది. ఒకరిలో ఒకరుగా ఇమిడిపోయే రాధాకృష్ణుల ప్రేమతత్వాన్ని పాలపిట్టలు ప్రతిబింబిస్తాయి.

పాలపిట్టలు పంటపొలాలు ఉన్నచోట తరచుగా కనబడుతుంటాయి. కల్లాకపటంలేని అచ్చ తెనుగు పల్లె జంటను చూపించాలంటే పంట పొలాల వెంట, చేలగట్ల మీద పరుగులెత్తుతూ, హాయిగా పాడుతూ నాట్యమాడుతూ పరవశించే వారినే చూపుతారు కళాకారులు, సినిమావాళ్ళు. ఈ లక్షణాలన్నీ పాలపిట్టకు ఉన్నాయి.

పాలపిట్ట రోలర్ కుటుంబానికి చెందిన పక్షి. కనుక దీనికి ఇండియన్ రోలర్ అనే శాస్త్రీయ నామం కూడా ఉంది. పాలపిట్టకు బంధుప్రీతి, నూత్న ప్రదేశ సందర్శన కుతూహలం ఎక్కువ. ఇవి వలస పక్షులు కాకపోయినా దగ్గరిదాపున ఉన్న బంధువర్గ పక్షులను, పొరుగు ప్రాంతాలను చూడడానికి వెళ్తుంటాయి. రాధాకృష్ణులలో కూడా ఈ లక్షణాలు పుష్కలంగా కనిపిస్తాయి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!