పై ఫొటో చూస్తే పడవ గాలిలో తేలినట్టు కనిపిస్తుంది కదా. అది నిజం కాదు. వాస్తవానికి అది నీటిపైనే ఉంది. ఫొటోలో కనిపిస్తున్న నది పేరు ఉమ్‌గోట్. అత్యంత పరిశుభ్రమైన నది గా దీనికి పేరుంది. అలాగే పారదర్శకమైనది కూడా. నదీ అడుగు భాగాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. అది ఈ నది ప్రత్యేకత.
ఇండియాలో ఇంత క్లీన్ గా కనిపించే నదులు తక్కువే. ఈ నది కూడా మన దేశంలోనే ఉంది. మేఘాలయాలోని మారుమూల పట్టణం డాకీ వద్ద ఈ ఉమ్‌గోట్ నది ఉన్నది. దీన్నే డాకి నది అని కూడా అంటారు. షిల్లాంగ్ నుండి 100 కిలోమీటర్ల దూరం లోనే ఉంది. ఈశాన్య భారతంలో పర్యటించేటపుడు ఈ నదిని తప్పక చూడాలి. చుట్టూ పచ్చని ప్రకృతి మధ్యలో ఈ నది పర్యాటకులను బాగా ఆకట్టుకుంటుంది.
నదిలో బోటు షికారు చేసేటపుడు నదీ గర్భం మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది.ఎక్కడా చెత్త చెదారం మచ్చుకైనా కానరావు. నీరు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. నీటిలో తిరుగాడే జలచరాలు కూడా స్పష్టంగా గోచరిస్తాయి. ఈ నది జైంతియా.. ఖాసీ కొండల మధ్య గుండా ప్రవహిస్తుంది. మేఘాలయ సరిహద్దులనుంచి బంగ్లాదేశ్‌లోకి వెళుతుంది.
ఈ ఉమ్‌గోట్ నదిపై ప్రభుత్వం 210 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించాలని ప్రతిపాదించింది. ప్రజలు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి.ఆసియాలో అత్యంత పరిశుభ్రమైన గ్రామంగా పేరుపొందిన మావ్లిన్నోంగ్ ఇక్కడకు దగ్గర్లోనే ఉంది. ఇది తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఉంది.
పర్యాటకులను ఆకట్టుకునే మావ్లిన్నాంగ్ జలపాతం ఇక్కడే ఉంది. ఇక్కడకు సమీపంలోనే సెవెన్ సిస్టర్ ఫాల్స్ ( ఏడుపాయల జలపాతాలు ) ఉన్నాయి.1,033 ఎత్తు నుండి నీరు కిందకు జాలు వారుతుంది.చూసేందుకు అద్భుతంగా ఉంటుంది. ఇండియాలోని ఎత్తైన జలపాతాలలో ఇది ఒకటి.ప్లాన్ చేసుకుని వెళితే మేఘాలయాలో చూడాల్సిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి.