Sudarshan .T………………………Insulin has saved many lives…………………
ఆరోజు .. జూలై 28, 1922 వ సంవత్సరం … కెనడా లోని టొరంటో సిటీలో .. అది Hospital for Sick Children, అందులోనే డయాబెటిస్ వార్డు….. అక్కడ వాతావరణం అంతా శోక పూరితంగా ఉంది. అక్కడ కూర్చుని ఉన్న తల్లిదండ్రుల మొహాల్లో విషాదం తాండవిస్తోంది.
ఏ క్షణంలో ఏ చెడు వార్త వినాల్సి వస్తుందో అన్న ఆందోళనతో వారంతా భయం భయంగా ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు వైద్యులు ఆ వార్డు లోకి వచ్చారు. ఆ ఇద్దరు కొత్తగా శాస్త్రీయ పద్ధతిలో రూపొందించిన హార్మోన్ ను పేషంట్లకు సూది మందుగా వేయడానికి వచ్చారు. ఈ హార్మోన్ ను పేషెంట్లకు వేయడం చరిత్రలో ఇదే మొదటిసారి.
పేషంట్లు అందరూ చిన్న పిల్లలే. శరీరంలో షుగర్ శాతం విపరీతంగా పెరిగి కోమాలోకి వెళ్లిపోయారు.డాక్టర్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకపోయింది. ఏ వైద్యమూ పనిచేయడం లేదు… ఫలితాలు ఇవ్వడం లేదు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఈ ఆసుపత్రిలో చేర్చడం తమ కళ్ల ముందే పిల్లలు చనిపోతుంటే … శోక వదనం తో వారి డెడ్ బాడీస్ తీసుకెళ్ళడం మాత్రమే జరుగుతోంది.
ఆసుపత్రి డాక్టర్స్ వివిధ ప్రయత్నాలు చేసినా పిల్లలు కోమా నుండి బయటకు రావడం లేదు.
ఈ క్రమంలోనే అక్కడకు చేరిన ఆ ఇద్దరు డాక్టర్లు పిల్లలకు సూది మందు వేయడం మొదలు పెట్టారు. అలా వేసుకుంటూ చివరి పేషంట్ వద్దకు వచ్చారు. అంతలో సూది మందు వేసిన మొదటి పాపలో చలనం వచ్చింది. కదులుతోంది .. అలా ఒక్కో పాప .. బాబు లో చలనం వచ్చింది.
అంతవరకూ నిరాశ, నిస్పృహ, మౌన రోదనలతో భీతిల్లిన ఆ వార్డులో ఒక్కసారిగా సంతోషం వెల్లివిరిసింది. ఆ వార్డులో ఉన్న పేరెంట్స్, డాక్టర్లు .. నర్సులు ..ఇతర సిబ్బంది కేరింతలతో వాతావరణం హోరెత్తింది. ఆ డాక్టర్ల ప్రయత్నం ఫలించింది. పిల్లలు అంతా మెల్లగా కోలుకుంటున్నారు. అందరూ ఆ డాక్టర్లను అభినందించారు. చేతులెత్తి నమస్కరించారు.
ఆ ఇద్దరు డాక్టర్లే .. సర్ ఫ్రెడరిక్ బాంటింగ్, సర్ చార్లెస్ బెస్ట్. వారిద్దరూ సైంటిస్టులు కూడా .. ఆ ఇద్దరు ఎంతో కష్టపడి కనుగొన్న ఆ సూది మందు పేరే ఇన్సులిన్ హార్మోన్… ఇన్సులిన్ వైద్య ఆవిష్కరణలలో చాలా కీలకమైనది. ఇది టైప్ 1 మధుమేహంతో జీవిస్తున్న అనేకమంది జీవితాలను మార్చివేసింది. ఎంతో మంది ప్రాణాలను కాపాడింది.
ఇన్సులిన్ లేని ఈ ప్రపంచం ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకుంటే ఎవరికైనా గుండె జల్లు మంటుంది. మానవాళి ఎన్నటికీ వారిద్దరికీ రుణపడి ఉంటుంది.. వైద్యరంగంలో ఆ ఇద్దరు చేసిన కృషికి తర్వాత రోజుల్లో నోబుల్ బహుమతి కూడా లభించింది.