మరో సినతల్లి ఈ సోని సోరి !!

Sharing is Caring...

Subbu Rv……………………………………….

Adivasi Sivangi ………………………………

ఒక మహిళ హక్కులను, ఆత్మగౌరవాన్ని కాపాడుతూ …ఆమెకు రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే హింసకు పాల్పడితే .. దుర్భాషలాడితే తన గోడు ఎవరికి చెప్పుకుంటుంది ? ఒకడు ఆడపిల్లపై అత్యాచారం చేశాడని ఎన్కౌంటర్ చేస్తే .. ఖాకీలకు జేజేలు కొడతాం. అదే ఖాకీలు ఒక మహిళను వివస్త్రని చేసి మర్మాంగాలలో రాళ్ళు చొప్పిస్తే ఏమని అనాలి..? అందరూ ఒకేలాగా వుండరు, న్యాయం అన్నిచోట్లా నాలుగు పాదాలతో నడవదు.

జై భీమ్ సినిమాలో సినతల్లి పాత్రని చూసి కన్నీరు పెట్టిన మనకు లాకప్పులో లాక్ అయిన ఎంతోమంది అమాయక సినతల్లుల రోదనలు వినబడవు. ఆ కథలు మన దాకా రావు. అక్కడే సమాధి అవుతాయి.తప్పిదారి ఒకటి అరా వస్తుంటాయి. అటు వంటి ఓ సినతల్లి సోనీ సోరి కథే ఇది. ఎందరో సినతల్లుల తరపున పోరాడుతున్న ఆదివాసీ సివంగి .. గిరిజన హక్కుల కార్యకర్త ఆమె.

పోరాటం ఎప్పుడూ హంగులు ఆర్భాటాలివ్వదు, వ్యధలు, బాధలు, హింసను తప్ప. పరిస్థితులు,హింసకు గురైన దేహం తిరిగి పోరాడమంటుంది. కోల్పోయిన బంధాలు కసితీరా అధికార హింసకు ఎదురు నిలబడమంటాయి. అలా మొదలయ్యిందే సోనీ సోరి జీవితం.

ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ లోని దంతెవాడ ప్రాంతానికి చెందిన ‘సోనీ సోరి’ జాబేలిలో పాఠశాల టీచర్ గా చేసేది. గిరిజనుల్లో చైతన్యం తీసుకురావడానికి కృషి చేస్తున్నది. పోలీసులు ఇన్‌ఫార్మర్‌గా మారమని అడిగారు. అందుకు ఆమె నిరాకరించింది. దీంతో మావోయిస్టులకు సహకరిస్తుందనే ఆరోపణతో ఛత్తీస్ గడ్  పోలీసులు సోరి ని అదుపులోకి తీసుకున్నారు.

ఆమెను చిత్ర హింసలకు గురిచేశారు. కరెంటు షాక్ ఇచ్చారు. మగ పోలీసులంతా కలిసి వివస్త్రను చేసి ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారు. అది చాలదన్నట్టు ఆమె మర్మాంగాలలో రాళ్లు ..లాఠీలు జొప్పించి  నరక యాతనకు గురి చేసారు. తీవ్రమైన నొప్పి … రక్త స్రావానికి తట్టుకోలేకపోయింది. హాస్పిటల్ కు తీసుకెళ్లమని పోలీసులను ప్రాధేయపడింది.

పరిస్థితి విషమించేలా ఉందని పోలీసులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. “కోల్ కతా మెడికల్ కాలేజీ ఆసుపత్రి వారు ఆమె రహస్యాంగాల నుండి రాళ్ళు వెలికి తీశారు. ఈ విషయాలు బయటకు పొక్కడంతో .. పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అమ్నెస్టీ ఇంటర్నేషనల్, హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థలు రంగంలోకి దిగాయి.

పోలీసుల దారుణాలపై విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. 2011 లో అరెస్టయిన ఆమెకు 2013 లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో బెయిల్ మంజూరు అయింది. పోలీసులు ఆమె పై ఎనిమిది కేసులు పెట్టారు. ఆరింటిలో నిర్దోషి అని తేలింది.

 ఆమె భర్త అనిల్ ఫుటానే ను కూడా మావోయిస్టులకు సహకరిస్తున్నారనే నెపంతో అదే జైలులో పెట్టి చిత్ర హింసలకు గురిచేశారు. పోలీసుల హింస తట్టుకోలేక అనిల్ అనారోగ్యం పాలయ్యాడు. పక్షపాతం కూడా వచ్చింది. జైలు నుండి విడుదలైన నెలకు మరణించారు.

ఇలా మావోయిస్టులకు, ప్రభుత్వాలకు మధ్య ఘర్షణల్లో అన్యాయంగా ఇరికించబడిన గిరిజనుల హక్కుల కోసం, పోలీసుల చేతుల్లో హింసకు గురైన అమాయక ఆదివాసీల కోసం హక్కుల కార్యకర్తగా సోరి మారారు. ” నేను కార్యకర్తగా మారడానికి పుస్తకాలు చదవలేదు, జైలు జీవితం నన్నిలా మార్చింది నా లాగా అత్యాచారానికి, పోలిస్ వేధింపులకు  గురైన వారి తరపున పోరాటం చేసేందుకు ముందు కొచ్చాను.” అంటోంది సోరి. 

2014 లో సోరి అమ్ అధ్మీ పార్టీలో చేరారు.బస్తర్ నుంచి పోటీ చేసింది కానీ ఓడిపోయింది. అయినా ఆమె పోరాటం ఆపలేదు. 2016 లో ఆమెపై యాసిడ్ దాడి జరిగింది. ఆ దాడి చేసిన వ్యక్తులు ఫేక్ ఎన్కౌంటర్, పోలీస్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం ఆపకపోతే నీ కూతురు పై కూడా  యాసిడ్ పోస్తాం అని బెదిరించి వెళ్ళారు. అయినా సోరి వెనుకడుగు వేయలేదు. 

“ఆదివాసీ హక్కులకోసం పోరాడుతున్నందుకు మాపై నక్సల్స్ అనే ముద్రవేసి దేశద్రోహులుగా చిత్రీకరించాలని చూశారు, నన్ను ఎంత హింసిస్తే .. అంత బలోపేతమవుతాను..కానీ పోరాటం మాత్రం ఆపను” అని యాసిడ్ దాడి తరువాత సోరి మీడియాతో చెప్పింది. ఆమె పోరాటం ఆపలేదు. అందరూ ఆమెను మావోయిస్టులకు అనుకూలమైన వ్యక్తి అనుకుంటారు కానీ ఆమె వారికెపుడు సహకరించలేదు.

ఆమె తండ్రిని కూడా మావోయిస్టులు కాల్చి చంపారు. భూములు సాగు చేయవద్దని ఆమె బంధువులను హెచ్చరించిన ఉదాహరణలున్నాయి. ఆమె పోరాటం గిరిజన హక్కుల కోసమే. మానవ హక్కుల సంస్థ 2018 లో సోరికి  Front Line Defenders Award  ప్రకటించింది.ఆదివాసీ కమ్యూనిటీ హక్కులు, న్యాయం కోసం పోరాడుతున్నందుకు సోరికి ఈ అవార్డును బహుకరించారు.

భగభగ మండే నిప్పుల్లో కరగనిదే ఇనుము కత్తవ్వదు, బంగారానికి  విలువ రాదు.  సోరి కూడా అంతే. జైలు గోడల మధ్య టార్చర్ లో మగ్గి తానొక పోరాట యోధురాలయ్యింది. భయం, బెరకు లేని వీరనారిలా మారింది. న్యాయం ఎప్పుడూ సినిమాలో చూపించినట్లు ఉండదుగా. పోరాటం అంటే కోల్పోయేది ఎక్కువ. భరించలేని బాధలను ఎదుర్కొని, పోలీస్ వేధింపులకు భర్తని కోల్పోయినా ..  అనేక దాడులు జరిగినా నేటికి ఉద్యమ పంథాను వీడలేదు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!