ఈ సారా ఒబామా సామాన్యురాలు కాదు !

Sharing is Caring...

పై ఫొటోలో బరాక్ ఒబామా పక్కన ఉన్న పెద్దావిడ  ఆయనకు చిన్న నాయనమ్మ అవుతుంది. ఒబామా తాత గారి రెండోభార్య. సారా ఒబామా గా ఆవిడకు కెన్యాలో చాలా గుర్తింపు ఉంది. చూడటానికి సామాన్య మహిళగా కనిపించే సారా ఒబామా అనాథలను , బాలికలను అక్కున చేర్చుకుని ..వారి అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసారు.

సంఘ సేవకురాలిగా గుర్తింపు పొందారు. ఆమె ఒక ఫౌండేషన్ ను స్థాపించి కెన్యాలోని కిసుము ప్రాంతంలో అనాధల కోసం , బాలికల కోసం పనిచేసేవారు. దశాబ్దాలుగా సారా ఒబామా అనాథలకు సహాయం చేశారు.కొంతమందిని స్వయంగా తన ఇంటిలో పెంచుకున్నారు.సారా ఒబామా ఫౌండేషన్ తరపున తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు ఆహారం అందించేవారు.

అనాథలను పాఠశాలల్లో చేర్పించే వారు. పాఠశాల సామాగ్రి, పిల్లలకు యూనిఫాం, ప్రాథమిక వైద్య సదుపాయాలను సమకూర్చేవారు. పిల్లలకు పాఠశాల ఫీజులను కూడా కట్టేవారు.ఎందరో అనాధల జీవితాల్లో అక్షర జ్యోతులు వెలిగించారు.

ఒబామా తండ్రి సీనియర్ ఒబామాను సైకిల్ పై ఎక్కించుకుని కొగే గ్రామం నుంచి ఎంజీయా పట్టణానికి తీసుకెళ్ళేది. అలా రోజూ 9 కిలోమీటర్లు సైకిల్ తొక్కేవారట. సారా ఒబామా కు చిన్నప్పటినుంచే సేవాకార్యక్రమాలు అంటే ఆసక్తి ఉండేదట. పెద్దయ్యాక కూడా ఆ ఆసక్తిని కొనసాగించింది. అనాథలకు పాఠశాల ఫీజు చెల్లించడానికి నిధులను ఫౌండేషన్ తరపున సమీకరించేవారు.

ఒక మహిళ చదువుకుంటే ఆమె కుటుంబం మాత్రమే చదువుకున్నట్టు కాదని, యావత్ గ్రామం చదువుకున్నట్టని సారా చెప్పేవారు. ఎవరైతే విద్యావకాశాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారో.. వాళ్లు చదువుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పేవారు.

చదువు అంటే ఆమెకు ప్రాణం. చిన్నతనం లో పెద్దగా చదువుకోలేదు. విద్యారంగంలో ఆమె చేసిన కృషికి  2014 లో ఐక్యరాజ్యసమితి సారాను సత్కరించింది.పయనీర్ అవార్డును ప్రదానం చేసింది. ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినపుడు సారా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు.

అలాగే 2014 లో ఐక్యరాజ్యసమితి లో ఒబామా ప్రసంగించినపుడు ఆమె ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఒబామా ఆమె ను అమెరికా ప్రెసిడెంట్ హోదాలో ఒకసారి నైరోబి వెళ్లి కలిశారు. పదవీ విరమణ చేసాక 2018లో మరొక సారి కలిశారు. అంతకు ముందు సంగతి చెప్పనక్కర్లేదు. సారా ఒబామా సొంత గ్రామంలోనే ఉంటూ చివరి వరకు  సేవాకార్యక్రమాల్లో నిమగ్నం కావడం చెప్పుకోదగిన విషయం. 99 సంవత్సరాల వయసులో సారా ఒబామా  కన్నుమూసారు.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!