మన దేశంలో ఎన్నో సరోవరాలు ఉండగా, వాటిలో ఐదు ‘పంచ సరోవరాలు’ గా ప్రసిద్ధికెక్కాయి. వాటిలో మానస సరోవరం, పంపా సరోవరం, పుష్కర్ సరోవరం, నారాయణ సరోవరం, బిందు సరోవరం ఉన్నాయి. ముందుగా పంపా సరోవరం గురించి తెలుసుకుందాం.
పంపా సరోవరం కర్ణాటక రాష్ట్రంలోని హంపీకి దగ్గర్లో ఉంది. ఈ సరోవరం రామాయణకాలం నాటిదని ప్రతీతి. పంపా సరోవర్ కొండల నడుమ ఒక లోయలో ఉంది. హోస్పెట్ నుండి అనెగుండి వెళ్లే రహదారిపై ఉన్న కొండల మధ్య ఈ సరస్సు కనిపిస్తుంది.హనుమాన్ ఆలయ పర్వతాల నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంది.
సరస్సు కమలాలతో నిండి అవి పువ్వులు వికసించినప్పుడు సుందరంగా ఉంటుంది. ప్రశాంత వాతావరణం ..చుట్టూ కొండలు, పచ్చటి ప్రకృతి పర్యాటకులను ఆకట్టుకుంటుంది. ఇక్కడ లక్ష్మి ఆలయం, శివాలయం కూడా ఉన్నాయి.భక్తులు వీటిని కూడా దర్శిస్తుంటారు.
రామాయణ కాలంలో ఇక్కడ భక్త శబరి ఉండేదట. ఆమె రాముడిని ఇక్కడే కలిసిందనే కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఆ కథ ప్రకారం శబరి మతంగ మహర్షి శిష్యులకు సేవలు చేస్తుండేది. వారు శబరికి రామలక్ష్మణులు ఇక్కడకు వస్తారని చెప్పారు. అప్పటినుంచి శబరి అక్కడే నివశిస్తూ రాముని రాక కోసం ఎదురు చూస్తూండేది.
సీతాన్వేషణలో కబంధుని సూచననుసరించి రామలక్ష్మణులు పంపాసరోవర తీరానికి చేరుకున్నారు. రామలక్ష్మణులను చూసిన వెంటనే సంతోష పులకాంకితురాలైన శబరీ ఆయన పాదాలకు నమస్కరించింది. ఆ అన్నదమ్ములకు అర్ఘ్యపాద్యాదులతో మర్యాదలు చేసింది. వారి కోసం తాను సేకరించిన ఫలాలను అందించింది అంటారు.
అన్ని సీజన్ల లో ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. ఇక్కడికి చేరడానికి బెంగళూరు నుండి బస్సులు ఉన్నాయి. ప్రయివేట్ టాక్సీలు అందుబాటులో ఉంటాయి. హంపికి వెళ్ళాలనుకునేవారు గుంతకల్లు – హుబ్లీ రైలు మార్గంలోనున్న హోస్పేటలో దిగి హంపి చేరుకోవచ్చు.హోస్పేట నుంచి హంపికి బస్సు సౌకర్యం ఉంది. అదలాఉంటే రాముడికి పండ్లు పెట్టిన శబరి ప్రస్తావన భద్రాచలం వద్ద నున్న గోదావరి వద్ద కూడా వస్తుంది. అక్కడే భక్త శబరీ శబరీ నదిగా మారింది అంటారు. అలాగే కేరళ లో శబరీ కొండ ఉంది. అక్కడ కూడా శబరీ సీత అనే పేరుతో ఒక ప్రదేశం ఉంది. అయ్యప్ప భక్తులు ఎక్కువగా ఇక్కడికి వెళుతుంటారు.
గుజరాత్ లోని డాంగ్ జిల్లాలో మరో పంపా సరోవర్ ఉంది. అహ్వా-నవపూర్ రహదారిలోని సుబీర్ గ్రామం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘చమక్ దుంగర్’ కొండ ప్రాంతం లో ఈ సరస్సు ఉందట. రాముడు శబరిని కలిసిన ప్రదేశంలో శబరిమాత ఆలయం నిర్మించారట.
———– Theja