He created history…………………………………
పై ఫొటోలో నాటి ప్రధాని ఇందిరా గాంధీ పక్క నున్న వ్యక్తి గురించి ఈ తరం పాఠకులకు అంతగా తెలియక పోవచ్చు. 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీ ని ఓడించిన ప్రముఖుడు ఈయనే. పేరు రాజ్ నారాయణ్. రాయబరేలి లోకసభ నియోజక వర్గంలో ఇందిరపై పోటీ చేసి 55202 ఓట్ల మెజారిటీ తో గెలిచారు. ఆ గెలుపుతో దేశం అంతటా రాజనారాయణ్ పేరు మారుమ్రోగిపోయింది.
ఇందిరపై ప్రజలు ఎంత కసిగా ఉన్నారో నాటి ఎన్నికల్లో ఓటర్లు తమ తీర్పు ద్వారా తేల్చి చెప్పారు. అపుడే ఇందిర కుమారుడు సంజయ్ గాంధీ కూడా అమేధీ నియోజకవర్గంలో జనతా పార్టీ అభ్యర్థి రవీంద్ర ప్రతాప్ సింగ్ చేతిలో 75844 ఓట్ల తేడాతో ఓడిపోయారు.తల్లి కొడుకులు ఇద్దరూ ఓటమిపాలైన నేపథ్యంలో “ఆవు పోయే .. దూడ పోయే” అంటూ ప్రజలు దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు.
ఇక రాజనారాయణ్ విషయానికొస్తే …. దేశంలో ఎమర్జెన్సీ రావడానికి ఒక రకంగా ఈయన కూడా కారణమే. 1971 లో రాయబరేలి నుంచి ఇందిర పైనే పోటీ చేసి రాజనారాయణ్ 111810 ఓట్ల తేడా తో ఓడిపోయారు. ఓడిపోయిన వాడు సైలెంట్ గా ఉన్నాడా అంటే లేడు. ఎన్నికల్లో ఇందిర సర్కార్ అధికార యంత్రాంగాన్ని ఉపయోగించిందని అలహాబాద్ హైకోర్టు లో కేసు వేసి గెలిచాడు.
దాంతో ఇందిర ఎన్నిక చెల్లదని 1975 జూన్ 12న కోర్టు తీర్పు ఇచ్చింది.ఇందిర సుప్రీం కు వెళ్లి హైకోర్టు ఆదేశాలను సవాల్ చేసారు. సుప్రీం కోర్టు షరతులతో కూడిన స్టే ను మంజూరు చేసింది. ఈ క్రమంలోనే ఇందిర ఎమర్జెన్సీ ప్రకటించారు. విపక్ష నేతలను అరెస్ట్ చేసి జైళ్లలో బంధించారు.
రాజనారాయణ్ మొదట సోషలిస్ట్ పార్టీలో ఉండే వారు. ప్రముఖ సోషలిస్ట్ రాంమనోహర్ లోహియా కు సన్నిహితుడు. 1952 లో యూపీ అసెంబ్లీ కి ఎన్నికయ్యాడు. యూపీ శాసనసభలో తొలి ప్రతిపక్ష నేత కూడా రాజ్ నారాయణ్ కావడం విశేషం. 1962 లో కూడా అసెంబ్లీ కి ఎన్నికయ్యారు. 1966 లో 1974 లో రాజ్యసభ సభ్యుడిగా చేశారు. ఇందిరను ఓడించాక మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వంలో ఆరోగ్యమంత్రి గా పనిచేశారు.
రాజనారాయణ్ కాశీ రాజకుటుంబానికి చెందినవాడు. బెనారస్ యూనివర్సిటీలో పీజీ చేశారు. తరువాత లా చేశారు. విద్యార్థి దశనుంచే చురుగ్గా ఉండేవారు. జయప్రకాష్ నారాయణ తో కలిసి స్వాతంత్ర్య పోరాటం లో పాల్గొన్నారు. లోహియా కు ముఖ్య అనుచరుడిగా కొనసాగారు. కొన్నాళ్ళు చరణ్ సింగ్ సారధ్యంలోని లోకదళ్ పార్టీలో కూడా ఉన్నారు.
రాజనారాయణ్ దాదాపు 80 సార్లు జైలుకెళ్లారు. 17 ఏళ్ళు జైల్లోనే మగ్గిపోయాడు. రాజ్ నారాయణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక వివాస్పద ప్రకటనలు చేసి జనంలో పలుచన అయ్యారు. తర్వాత కాలంలో జనతా పార్టీ విచ్చిన్నంలో ఈయన పాత్ర కూడా ఉందంటారు. 1986 లో రాజ్ నారాయణ్ కన్నుమూసారు. యూపీఏ ప్రభుత్వం ఆయన స్మారకంగా స్టాంపును విడుదల చేసింది.
—————KNM