స్టాక్ మార్కెట్ ప్రస్తుతం అప్ ట్రెండ్ లో నడుస్తోంది. సెన్సెక్స్ మంగళవారం 261 పాయింట్లు జంప్‌చేసి 48,438 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 67 పాయింట్లు పెరిగి 14,200 వద్ద ముగిసింది. ఈ రెండు కూడా సరికొత్త రికార్డులు. కోవిడ్-19 కట్టడికి ఒకేసారి రెండు వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో సోమవారం సెన్సెక్స్ 48,000 పాయింట్ల మైలురాయిని అధిగమించిన సంగతి తెలిసిందే. మంగళ వారం అదే ఊపు కొనసాగింది. ఈ ర్యాలీ ఇదే విధంగా ఇంకెన్ని రోజులు కొనసాగుతుందనేది చెప్పడం కష్టమే.
ఈ దశలో షేర్లను కొనుగోలు చేయవచ్చా అని చాలామంది అడుగుతుంటారు. ఇపుడు కొనుగోలు చేస్తే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. చాలా షేర్ల ధరలు వృద్ధి ని సాధించాయి. ఈ సమయంలో అధిక ధరల వద్ద షేర్లను కొంటే … ఒక వేళ వాటి ధర పెరగకపోతే ఇబ్బంది పడాలి. మార్కెట్ లో కరెక్షన్ కి అవకాశం ఉంది. కరెక్షన్ వస్తే మటుకు మార్కెట్ పతనం ఎందాకా అనేది ఎవరూ చెప్పలేరు. షేర్ల ధరలు కుప్ప కూలుతాయి. అపుడు నష్ట పోవాల్సి ఉంటుంది.
కాబట్టి ఈ తరుణం లో కొనుగోలు చేయడం చాలా రిస్క్ కూడిన వ్యవహారం. చిన్న ఇన్వెస్టర్లు అసలు అలాంటి ప్రయత్నం చేయకూడదు. ప్రస్తుతం విదేశీ ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు చేస్తున్న కారణంగా మార్కెట్ పరుగులు దీస్తోంది.కొనుగోళ్లు ఆగిన నాడు సెంటిమెంట్ బలహీనమై డౌన్ ట్రెండ్ మొదలు కావచ్చు. ర్యాలీ లు ఎప్పుడు ఎక్కువ కాలం కొనసాగవు. మార్కెట్లో ర్యాలీ రావడమంటే అమ్మకాలకు అవకాశం వచ్చిందని అర్ధం చేసుకోవాలి. అదను చూసి మన వద్ద ధరలు పెరిగిన షేర్లు ఉంటే వెంటనే అమ్మేసుకుని లాభాలు స్వీకరించాలి.
మార్కెట్ తగ్గుముఖం పట్టక ముందే షేర్ ధరలు ఎలా పెరుగుతున్నాయి ? ట్రెండ్ ఎలా ఉందొ గమనించి వేగవంతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఈ దశలో లాభాలను స్వీకరించక పోతే చాలాకాలం ఆగాల్సి ఉంటుంది. ఇదే అమ్మకాలకు అదను అని గ్రహించాలి. ఇంకా పెరుగుతుందని అత్యాశ కు పోకుండా లాభాలను స్వీకరించడం మంచి వ్యూహం.
————— KNM