ఇదే నా చివరి గుడ్ మార్నింగ్ !

Sharing is Caring...

“అందరికి ఇదే నా చివరి గుడ్ మార్నింగ్ .. రేపు నేను మిమ్మల్నిఇక్కడ మళ్ళీ కలవక పోవచ్చు.నా శరీరం ప్రాణాలు కోల్పోవచ్చు. కానీ ఆత్మ శాశ్వతం. అందరూ జాగ్రత్తగా ఉండండి “అంటూ ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టిన ఆమె కొద్దీ గంటల్లోనే మరణించారు. మరణాన్ని ఆమె ముందే ఊహించారు. ఆమె చెప్పినట్టుగా మరుసటి రోజు ఉదయాన్ని ఆమె చూడలేదు. కరోనా కాటుకి బలై పోయారు. ఆమె పేరు డాక్టర్ మనీషా జాదవ్. క్షయవ్యాధి నిపుణురాలు.
ముంబాయిలోని  సేవ్రి టీబీ ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు. 51 ఏళ్ళ ఆ డాక్టర్ కి కొద్దిరోజుల క్రితమే కరోనా సోకింది. దీంతో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. అది గ్రహించిన ఆమె ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది. పోస్ట్ పెట్టిన కొద్దీ గంటల్లోనే మనీషా చనిపోయింది. అయితే మనీషా ట్రీట్మెంట్ తీసుకున్నదా ?లేదా ? వివరాలు తెలియరాలేదు. ఆమె మరణవార్త మూడు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. మనీషా డాక్టర్ కాబట్టి ట్రీట్మెంట్ తీసుకునే ఉండొచ్చు. కానీ అప్పటికే పరిస్థితి విషమించి ఉండొచ్చు అని భావిస్తున్నారు.  
ఇంకా అనేక మంది డాక్టర్లు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు సోషల్ మీడియాలో సందేశాలు పెడుతున్నారు. తమ ఆవేదన ను  వ్యక్తం చేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో హెచ్చరికలు చేస్తున్నారు.  “మేము నిస్సహాయంగా ఉన్నాము … ఇంతకు ముందు ఇలాంటి పరిస్థితిని చూడలేదు … ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు …” అని ముంబైకి చెందిన మరో వైద్యుడు డాక్టర్ తృప్తి గిలాడా నెట్లో పెట్టిన  వీడియో సందేశం కూడా  వైరల్ అయ్యింది.
మొత్తం మీద పరిస్థితి ప్రమాదకరంగా మారుతోంది. అందరూ అప్రమత్తం కావాల్సిన పరిస్థితి ఇది. దేశంలో కరోనా రోజు రోజుకి చాప కింద నీరులా విస్తరిస్తోంది.దానికి పేదా .. గొప్పా తేడా లేదు. అందరూ సమానమే. అందరి ఉసురు తీస్తున్నది. జాగ్రత్తలు పాటించడం మినహా చేయగలిగిందేమీ లేదు. ధైర్యంతో ఉండటమే కావాల్సింది. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!