ఇది ఇంకో ట్రిపుల్ ఆర్!!

Sharing is Caring...

మంగు రాజగోపాల్…………………………………….. 

నేనిప్పుడు RRR గురించి రాయబోతున్నాను.ఇది రాజమౌళి RRR కాదు. R అంటే రామ్ నాథ్ గోయెంకా..R అంటే రామోజీ రావు..R అంటే రీడర్స్. ఈనాడు పత్రికాధిపతి రామోజీరావు గారి మనవరాలి వివాహ విశేషాల గురించి ఇవాళ ఈనాడు, ఈటీవీలో కళ్లు బైర్లు కమ్మేలాగా వచ్చిన కవరేజ్ చూడగానే నా మనసు నలభై ఏళ్ల వెనక్కి వెళ్లిపోయింది. పాత జ్ఞాపకాలు రింగులు రింగులుగా గిర్రుమని తిరిగాయి.

నేను ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపుకి చెందిన ఆంధ్రప్రభ, హైదరాబాద్ ఎడిషన్ లో సబ్ ఎడిటర్ గా ఉద్యోగం చేస్తున్న రోజులవి. 1978లోనో, 1979లోనో సరిగ్గా గుర్తు లేదు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రికల యజమాని రామ్ నాథ్ గోయెంకా మనవరాలు కవితా గోయెంకాకి పెళ్లి కుదిరింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎక్స్ ప్రెస్, ఆ గ్రూపులో ఉన్న భాషా పత్రికల సిబ్బంది అందరికి పెళ్లి శుభలేఖలు అందాయి.

గోయెంకా గారు సిబ్బంది ప్రతి ఒక్కరికీ పంచెలు నీట్ గా ప్యాక్ చేసి కానుకగా పంపించారు.సరే..పెళ్లి రోజు రానే వచ్చింది. మద్రాసులో పెళ్లి జరిగింది. పెళ్లి ఫోటోలు, వార్తలు, విశేషాల కోసం అందరం వెయిట్ చేస్తున్నాం. ఇంతకీ రావు. అంతకీ రావు. అవతల ఎడిషన్ డెడ్ లైన్ ముంచుకు వస్తోంది. రెసిడెంట్ ఎడిటర్ పొత్తూరి వెంకటేశ్వర రావు గారు హడావిడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు. మా డెస్కు దగ్గరికి వచ్చి ఏమైనా మెసేజ్ వచ్చిందా అని ఆరా తీస్తున్నారు.

టెలిప్రింటర్ రూములోకి వెళ్లి అడుగుతున్నారు. మధ్య మధ్యలో పక్కనే ఉన్న ఎక్స్ ప్రెస్ న్యూస్ ఎడిటర్ క్యాబిన్ లోకి వెళ్లి వస్తున్నారు. ఆయన కంగారంతా అప్పటికీ రాని కవితా గోయెంకా పెళ్లి ఫోటోలు, వార్తల గురించే అని డెస్కులో మాకు అర్ధమవుతూనే ఉంది. ఫోర్మన్ వచ్చి “సార్, టైమవుతుండాది, పేజీ పెట్టడానికి రండి సామీ” అని తొందర చేస్తున్నాడు. నేను బితుకు బితుకుమంటూనే పొత్తూరి వారి క్యాబిన్ లోకి దూరి ” సార్, ఎడిషన్ లేటయిపోతోంది. ఫస్ట్ ఎడిషన్ ఇచ్చేద్దాం. కావాలంటే సిటీకి మార్చుకుందాం” అన్నాను.

అవతల యజమాని గారి మనవరాలి పెళ్లి. దాని గురించి ఒక్క ముక్క కూడా లేకుండా పేపరు వెళ్తే యాజమాన్యం ఏమనుకుంటుంది? పాఠకులు ఏమనుకుంటారు? ఇలా ఆలోచిస్తున్న పొత్తూరి గారు ఆ మాటే అని, “సరే, ఫైనల్ గా మెడ్రాస్ వాళ్లనే అడుగుదాం” అని ఫోన్ తీశారు. నేను బయటికి వచ్చేశాను. అందరం పొత్తూరి గారి క్యాబిన్ వైపే చూస్తున్నాం. కాస్సేపయాకా పొత్తూరి గారు నవ్వు మొహంతో బయటికి వచ్చారు.

వస్తూనే అన్నారు. ” మీరు ఎడిషన్ ఇచ్చెయ్యండి. దేని కోసం వెయిట్ చెయ్యక్కర్లేదు” “ఏమయింది సార్!” అని సస్పెన్స్ భరించలేక అడిగాం. అప్పుడు పొత్తూరి గారు ఏం చెప్పారంటే.. మెడ్రాస్ లో ఓఎస్ డీ గారు పెళ్లి మంటపంలో ఉన్న రామ్ నాథ్ గోయెంకా గారి దగ్గరికి వెళ్లి, “సార్, అన్ని ఎడిషన్ల వాళ్లు పెళ్లి న్యూస్, ఫోటోల కోసం వెయిట్ చేస్తున్నారు” అని చెప్పారు.

దానికి రామ్ నాథ్ గోయెంకా గారు చెప్పింది ఇదీ. “చూడండీ..నా మనవరాలి పెళ్లి మా కుటుంబ వ్యవహారం. మన పాఠకులికి ఇందులో న్యూస్ ఇంట్రస్టు ఏమీ లేదు. న్యూసూ లేదు, గీసూ లేదు. ఎడిషన్లు ఆపొద్దని వెంటనే అందరికీ చెప్పండి.” అందుకే మరి. గోయెంకా? మజాకా?

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!