Rare Grand ma ………………………………ఫొటోలో కనిపించే కోయంబత్తూరు బామ్మ పేరు ఆర్ పప్పమ్మాళ్. రంగమ్మ అని కూడా పిలుస్తారు. వయసు 105 సంవత్సారాలు. అయినా ఉత్సాహంగా పొలం పనులు చేస్తుంటుంది. సేంద్రీయ వ్యవసాయ పద్దతిలో వ్యవసాయం చేస్తూ ఎందరికో స్ఫూర్తి నిచ్చిన పప్పమ్మాళ్ కి పద్మశ్రీ పురస్కారం లభించింది.కోయంబత్తూరు దగ్గర్లోని దేవలాపురం లో ఆమె పుట్టారు.
చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవడంతో ఆమె తన అమ్మమ్మతో కలిసి తేక్కంపట్టి కొచ్చేసింది. అక్కడే పెరిగింది. పెళ్లి అయినప్పటికీ పిల్లలు లేరు . తన భర్తకు చెల్లెలును ఇచ్చి పెళ్లి చేసింది.తేక్కంపట్టిలో కొన్నాళ్ళు టీ దుకాణాన్నినడిపింది. దాన్నికిరాణా షాపు గా మార్చింది. మెల్లగా 2.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.ఆభూమిలోనే వ్యవసాయం మొదలు పెట్టింది.
నీలగిరి పర్వతాల నుండి ప్రవహించే భవానీ నది ఆమె పొలానికి దాదాపు 2 కి.మీ దూరంలో పారుతుంది. అయినా పొలానికి నీరందే పరిస్థితి లేదు. పప్పమ్మాళ్ అది గమనించి ఎక్కువగా మినుములు, పప్పులు వంటి వర్షాధార పంటలను పండించింది. గత పదేళ్లుగా ఆమె సాంప్రదాయ రైడ్ ఫీడ్ పంటలతో పాటు మైక్రో ఇరిగేషన్ కింద అరటి తోటలను పెంచుతోంది.
కొన్నేళ్లుగా పప్పమ్మాళ్ తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీతో కలిసి పనిచేస్తోంది. తన అనుభవాలను రైతులకు వివరించేది. రైతుల సమావేశాలకు ఒంటరిగా వెళ్లి వచ్చేది. పెద్ద వయసులో కూడా అంత హుషారుగా ఉండటానికి కారణం ఏమిటని అందరూ అడిగే వారు. దానికామె “జొన్నలు, సజ్జలు, కొర్రలు, రాగులు, సామలు, అరికెలు, ఊదలు, అవిసెలు వంటి తృణ ధాన్యాలను కుండలో ఉడికించి పెరుగు లేదా మజ్జిగ తో కలుపుకుని తింటాను.
అందులోకి ఉల్లిపాయలు .. పచ్చి మిరపకాయలు మధ్యలో నంచుకుంటాను” అని చెప్పేవారు. అందుకే ఆంత వయసు వచ్చినా పప్పమ్మాళ్ ఆరోగ్యంగా.. చురుగ్గా తిరుగుతున్నారు. ఇప్పటికి తెల్లవారు జామున 4 గంటలకు లేచి ఆమె పొలాలకు వెళ్లే ముందు తీసుకునే అల్పాహారం అదే. వేప పుల్లలతో పళ్ళు తోముకుంటుంది. ఇప్పటి వరకు ఏ టూత్ పేస్టులు వాడలేదట. సబ్బుకు బదులుగా రాయితో ఒళ్ళు కడుక్కుంటారట.
పొలం పని లేని రోజుల్లో ముఖం కడుక్కొని, ఒకసారి గ్రామం చుట్టూ తిరిగి వస్తుందట. తాను వ్యవసాయం చేస్తూనే గ్రామంలోని మహిళలను కూడా పప్పమ్మాళ్ ప్రోత్సాహించింది. ఆమెను చూసి స్ఫూర్తి ని పొందిన మహిళలు చుట్టుపక్కల గ్రామాల్లో చాలా మంది ఉన్నారు. ఒక రోల్ మోడల్ గా ఎదిగారు. మహిళలకు వ్యవసాయ విస్తరణ కార్యక్రమాల గురించి చిన్న సమావేశాలు పెట్టి వివరించేది.
విన్నూత విధానాల గురించి చెప్పేది. ఆధునిక సాంకేతిక విధానాల గురించి తెలుసుకుని అమలు చేసేది. కరోనా సమయంలో కూడా అన్ని పనుల్లో పప్పమ్మాళ్ చురుగ్గా పాల్గొనేది. వ్యవసాయం పట్ల ఆమె కున్న అంకిత భావానికి ఇవన్నీ నిదర్శనం గా చెప్పుకోవచ్చు. కొంచెం కొంచెం అభివృద్ధి సాధించాక పప్పమ్మాళ్ మరో 7.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసింది.
తన అక్క నలుగురు కుమార్తెలకు ఆ 7.5 ఎకరాల భూమిని ఇచ్చింది, వారిని దత్తత తీసుకుని చదివించింది. 1962లో స్థానిక సంస్థల ఎన్నికలలో పంచాయతీ వార్డు మెంబర్‌గా గెలిచి, ఆ తర్వాత పంచాయతీ వైస్ ఛైర్మన్ కూడా కూడా కొన్నాళ్ళు పని చేసింది.
92 సంవత్సరాల వయస్సులో పప్పమ్మాళ్ శిక్షణ పొందిన తరువాత ఆధునిక వ్యవసాయ యంత్రాల నిర్వహణలో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి సత్తా చాటుకుంది. పాఠశాలలో ఎప్పుడూ అడుగు పెట్టని వ్యక్తి. (తర్వాత కాలంలో కొంచెం చదువు నేర్చుకుంది ) సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ లో సభ్యురాలు అయింది. ప్రాక్టికల్ ఫార్మ్ సైంటిస్ట్‌గా ఆమె తన సామర్థ్యాన్ని పెంపొందించుకుంది.నిపుణులతో ఎక్కువగా మాట్లాడేది. ఎంతో విద్యార్థులు పప్పమ్మాళ్ పొలాలను సందర్శించేవారు.
ఎనిమిదేళ్ల క్రితం కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా కోయంబత్తూరుకు వచ్చినప్పుడు పప్పమ్మాళ్ గురించి తెలుసుకుని ఆమె పొలాన్ని సందర్శించారు. గంటకు పైగా ఆమె తో మాట్లాడి వెళ్లారు. ఒకసారి పంజాబ్‌కు చెందిన 80 మంది రైతులకు ఆమె ఆతిథ్యమిచ్చింది. తన పొలంలో పండించిన ధాన్యాలతో వండిన ఆహారాన్ని వారికి వడ్డించింది. వాటి రుచి కి పప్పమ్మాళ్ ఆదరణకు వారంతా ముగ్దులయ్యారు. ఇలా చెప్పుకుంటే పోతే చాలా విషయాలే ఉన్నాయి. నిజంగా నూటికి నూరు శాతం పద్మశ్రీకి ఆమె అర్హురాలే.
—–KNM