తిరుమల శ్రీవారికి తిరుప్పావై సేవలు

Sharing is Caring...

డిసెంబర్ 17 వ తేదీ నుంచి ధనుర్మాసం లోకి ప్రవేశించబోతున్నాం.సౌరమాన ప్రకారం సూర్యుడు ధనుస్సురాశిలో ప్రవేశించిన రోజు నుండి మకరరాశిలోకి ప్రవేశించే వరకు గల మధ్య రోజులను .. అనగా సంక్రాంతికి ముందు ముప్పది రోజులను ధనుర్మాసమని అంటారు. ఈ నెల రోజుల పాటు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుప్రభాతం కాకుండా తిరుప్పావై సేవ జరగనుంది.

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 17 తెల్లవారుజామున 12.34 గంటలకు ప్రారంభం కానుండగా టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. డిసెంబరు 17 ఉదయం నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై పారాయణం జరుగుతుంది. ఈ తిరుప్పావై సేవలు ధనుర్మాస ఘడియలు 2024 జనవరి 14న ముగియనున్నాయి.

పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి గంటన్నర ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారట. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉండగా నెలరోజులు ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం జరుగుతుంది. 12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌ లేదా గోదాదేవి ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు.

శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు.
ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం కాగా తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకొకటి చొప్పున పాశురాన్ని అర్చకులు నివేదిస్తారు.

ఈ సమయంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.   ఈ ధనుర్మాసంలో బాలికలు, మహిళలు తమ ఇళ్ల ముందు ప్రతి రోజూ అందమైన సంక్రాతి ముగ్గులు వేసి ఆవుపేడతో గొబ్బెమ్మలు చేసి ఆ ముగ్గుల మధ్యలో పెట్టి గొబ్బెమ్మల రూపంలో లక్ష్మీదేవి ని  పూలతో, పసుపు కుంకుమలతో పూజిస్తారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!