స్టాక్ మార్కెట్ దూసుకెళుతోంది.సెన్సెక్స్ 59,460 పాయింట్ల వద్ద కదలాడుతుండగా నిఫ్టీ 17,725 పాయింట్ల ను దాటింది.ఈ నెల 3న తొలిసారి సెన్సెక్స్ 58 వేల మార్కును అందుకోగా.. రెండు వారాల వ్యవధిలోనే మరో మైలురాయిని అధిగమించింది. బీఎస్‌ఈలో సుమారు 400 స్టాక్స్ అప్పర్ సర్క్యూట్‌ను తాకగా.. 280 స్టాక్స్ 52 వారాల గరిష్ఠాలను చేరుకున్నాయి. మార్కెట్ పండితుల అంచనాల ప్రకారం ఒకటి రెండు రోజుల్లో సెన్సెక్స్ 60000 పాయింట్లకు కు చేరుకోవచ్చు.
గత కొంత కాలంగా క్రమంగా పెరుగుతున్న మార్కెట్ 60 వేల పాయింట్లు దాటాక కరెక్షన్ కు గురయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.ఈ సమయంలో ఇన్వెస్టర్లు కొంత అప్రమత్తత తో వ్యవహరించాలి. కాగా ప్రస్తుతానికి మార్కెట్ సెంటిమెంట్ బాగానే ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ప్రతి కూల వార్తలు వెలువడితే మటుకు సెంటిమెంట్ బలహీన పడవచ్చు. ప్రస్తుతానికి ఎఫ్ఐఐల పెట్టుబడులే కీలకం. మార్కెట్లలో కొన్నిరోజులుగా విదేశీ ఇన్వెస్టర్లు డాలర్లు గుమ్మరిస్తున్నారు. తదనుగుణంగా మార్కెట్లూ లాభపడుతున్నాయి. వీరు గనక ప్రతికూలంగా స్పందిస్తే.. మార్కెట్ తీవ్ర కరెక్షన్‌కు గురికావచ్చు.
మార్కెట్లో కరెక్షన్ రాకముందే ఇన్వెస్టర్లు వ్యూహాత్మకంగా వ్యవహరించాలి.కొనుగోలు చేసిన షేర్ల ధరలు పెరిగి ఉంటే లాభాలు స్వీకరించడం మంచిది. మార్కెట్ తగ్గినపుడు కావాలంటే మళ్ళీ కొనుగోళ్ళు చేయవచ్చు.మార్కెట్ ఓవర్ బాట్ పొజిషన్ కి చేరుకుంది కాబట్టి లాభాల స్వీకరించడమే మేలైన వ్యుహమని నిపుణులు అంటున్నారు.
ప్రస్తుతం మార్కెట్ పీక్ పొజిషన్ లో వుంది కాబట్టి కొత్త లేదా చిన్న ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దూరంగా ఉండటమే మేలు. మళ్ళీ కొనుగోళ్లకు అవకాశం వచ్చే వరకు ఓపిక పట్టక తప్పదు. కరెక్షన్ దశలో మార్కెట్ గమనాన్ని పరిశీలిస్తుండాలి. ఇన్వెస్ట్ మెంట్ వ్యూహాలను రూపొందించుకోవాలికరెక్షన్ పూర్తి అయ్యాక పని తీరు, ఫలితాలు బాగున్న కంపెనీల షేర్లను ఎంపిక చేసి మదుపు చేయాలి .కరెక్షన్ అంటే అది ఇన్వెస్ట్ మెంట్ కి అవకాశం దొరకడమే అని భావించాలి.