వారి సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే !

Sharing is Caring...

Great success………………………………………. ఎనిమిది మంది వికలాంగుల బృందం సియాచిన్ హిమశిఖరాన్ని అధిరోహించి  ప్రపంచ రికార్డు సృష్టించింది. సియాచిన్ హిమనీనదం వద్ద 15,632 అడుగుల ఎత్తులో ఉన్న కుమార్ పోస్ట్‌కు రెండురోజుల క్రితం ఈ బృందం చేరుకుంది. వికలాంగుల బృందం ఈ సాహసం చేయడం ఇదే ప్రధమం.  ప్రపంచంలోనే క్లిష్టమైన హిమనీనదాల్లో సియాచిన్‌ హిమనీనదం ఒకటి.

భారత సైన్యం కాంకర్‌ ల్యాండ్‌ వాటర్‌ ఎయిర్‌(క్లావ్‌)ని ట్రెక్కింగ్‌ చేయడానికీ సూత్రప్రాయంగా అనుమతి ఇచ్చింది. దీంతో క్లావ్‌, మాజీ ఆర్మీ అధికారులు ఏప్రిల్‌ నెలలో ఈ ట్రెక్కింగ్‌లో  వికలాంగులు పాల్గొనేలా దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. అందుకు స్పందించి ముందుకు వచ్చిన  వారిలో 20 మందికి శిక్షణ ఇచ్చి ఎనిమిది మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేశారు. మాజీ  మేజర్‌ వివేక్‌ జాకబ్‌ నేతృత్వంలో వీరికి శిక్షణ ఇచ్చారు. 

స్వాతంత్ర్య దినోత్సవం నాడు సియాచిన్ బేస్ క్యాంప్‌లో “ఆపరేషన్ బ్లూ ఫ్రీడమ్” పేరిట ఈ యాత్ర మొదలైంది. దీన్ని క్లావ్‌ టీమ్‌, భారతసైనిక దళాలు  వికాంగుల సాధికారతను  ప్రోత్సహించే దిశగా ఈ ఆపరేషన్‌ని నిర్వహించారు. వారి ప్రయత్నం ఫలించి ఆపరేషన్‌ బ్లూ విజయవంతమైంది. వికలాంగుల బృందం ప్రపంచ రికార్డు సృష్టించారంటూ …భారత సైన్యం ట్వీట్‌ చేసింది.

కొందరు అన్ని సక్రమంగా ఉండి .. ఏం సాధించలేక నిరాశ నిస్పృహలకు గురవుతుంటారు. అలాంటి వారికి ఈ వికలాంగుల బృందం సాధించిన విజయం  స్ఫూర్తి దాయకం అనుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరింత మందికి స్ఫూర్తిని అందిస్తాయి అనడం లో సందేహం లేదు. 

భారత్ పాకిస్థాన్ దేశాల మధ్య సరిహద్దుగా ఉన్న సియాచిన్  ప్రాంతంలో మన సైనికులు రాత్రింబవళ్ళు కాపలా కాస్తుంటారు. మైనస్ 45 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రత, రక్తం గడ్డ కట్టుకుపోయే చలి, తరచుగా మంచు తుపాన్లు వస్తుంటాయి. ప్రతినెలా మంచు కొండ చరియలు విరిగి పడటం లేదా హిమపాతాలు ఏర్పడి ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. నెలలో ఇద్దరు ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోతుంటారు.

సియాచిన్ లో వాతావరణ పరిస్థితులు ఏ క్షణంలో ఎలా ఉంటాయో అంచనా వేయలేరు. కొండల నడుమ మంచు కరిగి ప్రవహిస్తుంటుంది. ఈ కొండ నుంచి ఆ కొండ పైకి వెళ్లాలంటే అటు ఇటు స్థంబాలు పాతి తీగలపై పాక్కుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఆక్సిజన్ తక్కువగా లభిస్తుంది. అలాంటి ప్రతికూల వాతావరణాన్ని లెక్కచేయకుండా  వికలాంగుల బృందం  కుమార్ పోస్ట్ వరకు వెళ్లడం అంటే మామూలు విషయం కాదు. ఆ బృందం ఆత్మ స్థైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే.  

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!