Daring Woman ………………………………………….
అంగారకుడిపై మనిషి మనుగడ సాధ్యమేనా?.. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేందుకే నాసా ఏళ్ల తరబడి పరిశోధనలు చేస్తున్నది. అయితే.. అందుకు మరో దశాబ్దం దాకా పట్టవచ్చనే శాస్త్రవేత్తలు అంటున్నారు.
అంగారకుడిపై ఉండే వాతావరణాన్ని భూమ్మీద సృష్టించి.. అందులోకి మనుషులను పంపి ప్రయోగాలు నిర్వహించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకు కెనడియన్ జీవ శాస్త్రవేత్త 52 ఏళ్ల కెల్లీ హాస్టన్ ధైర్యం చేసి ముందుకొచ్చింది. ఈమె ఏడాదిపాటు అంగారకుడి వాతావరణంలో గడపనుంది.
మార్స్ పై జీవించడం అనేది ఆమె చిన్ననాటి కల. అది ఇప్పుడు అనుకోని విధంగా నెరవేరనుంది. ప్రస్తుతం హాస్టన్ అందుకోసం రెడీ అవుతోంది. అంగారక గ్రహంపై వాతావరణాన్ని తట్టుకునేందుకు శిక్షణ తీసుకుంటోంది. జూన్ చివరి వారంలో టెక్సాస్ లోని హ్యూస్టన్ లో మార్టిన్ నివాస స్థలంలోకి ఆమె వెళుతుంది. అంగారకుడిపై ఉండే వాతావరణ పరిస్థితులే అక్కడ ఉంటాయి.ఆమెతో కూడా నలుగురు వాలంటీర్లు కూడా అక్కడికి వెళ్తున్నారు.
భవిష్యత్తులో వివిధ వైవిధ్య పరిమిత వాతావరణంలో ప్రత్యేకించి అంతరిక్షంలో మానవుడి జీవనం గురిచి అధ్యయనం చేసేందుకు ఈ మిషన్ ప్రయోగాన్ని నాసా నిర్వహిస్తున్నది. ఇందులో గడిపే వారు అనేక రకాల సవాళ్ల ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా బయట ప్రపంచంతో కమ్యూనికేషన్ ఉండదు. భూమి, అంగారక గ్రహం మధ్య జీవన వ్యత్యాసం తెలియడమే గాక పరిస్థితులను తట్టుకుని జీవించగలమా లేదన్నది అవగతమవుతుందని నాసా భావిస్తోంది.
మార్స్ డ్యూన్ అల్ఫాగా పిలిచే ఒక నివాస స్థలం ఉంటుంది. మార్స్ డ్యూన్ ఆల్ఫాగా పిలిచే త్రీడీ ప్రింటెడ్ 1700 చదరపు అడుగుల నివాస స్థలంలో బెడ్ రూమ్ లు .. వ్యాయామశాల తదితర సౌకర్యాలు ఉంటాయి. ఈ మిషన్ లో ఆమె తోపాటు నలుగురు సభ్యులు ఆహారాన్ని పండించుకునేలా పొలం అన్ని ఉంటాయి.
ఎయిర్ లాక్ చేయబడిన గదిలో అంతరిక్షంపై నడిచే విధానాన్ని ప్రాక్టీస్ చేయడమే గాక, సూట్ ధరించగలిగి ఉండేలా శిక్షణ తీసుకుంటున్నారు. ఆమె తో పాటు అక్కడ ఒక ఇంజనీర్, ఎమర్జెన్సీ డాక్టర్, నర్సు ఉంటారు. నాసా ఎంపిక చేసిన ఆయా వ్యక్తుల మధ్య పరిచయం లేదు. అయితే మార్స్ కోసం హ్యూస్టన్ నివాస స్థలంలో ఉండనున్న హౌస్ మేట్స్ మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొనడం అనేది అత్యంత కీలకం.
ముఖ్యంగా కుటుంబానికి దూరంగా వారు అన్ని రోజులు ఉండగలరా ? లేదా అనేది ఆందోళన కలిగించే అంశం. కేవలం ఈమెయిల్ తో నే తన కుటుంబసభ్యులతో టచ్ లో ఉండాలి.ఈ ప్రయోగాత్మక మిషన్ ను చాపే (క్రూ హెల్త్ అండ్ పెర్ఫార్మెన్స్ ఎక్స్‌ప్లోరేషన్ అనలాగ్) పేరుతో నాసా నిర్వహిస్తోంది.
అమెరికా 2030 చివరినాటి కల్లా అంగారక గ్రహంపై యాత్రకు సిద్ధం చేసే ప్రయోగంలో భాగంగా సుదీర్ఘకాలం అక్కడ ఎలా జీవించగలం అనే దానిపై మిషన్ ప్రయోగాలు నిర్వహిస్తోంది. అంతేగాదు మానవులను చంద్రునిపైకి పంపే యోచన కూడా చేస్తున్నది.