అరుణాచలేశ్వరుని ఆలయంలో అద్భుత శిల్పసంపద!

Sharing is Caring...

Many kings participated in the construction of the temple…………………

అరుణాచలేశ్వరుని ఆలయం ఇప్పటిది కాదు.తొమ్మిది, పది శతాబ్దాల మధ్య ఈ ఆలయం నిర్మితమైంది. చోళ మహారాజులు ఈ ఆలయ నిర్మాణానికి నాంది పలికారు. తర్వాత పల్లవులు,విజయనగర రాజులు , కన్నడ రాజులు ఆలయ విస్తరణకు కృషి చేశారు.

ఈ ఆలయ ప్రాంగణం చాలా సు విశాలమైనది. 25 ఎకరాల స్ధలంలో విస్తరించి వుంది. నాలుగు దిక్కులా పెద్ద గోపురాలతో ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది.ఆలయ గోపురాలు వాస్తు, శిల్ప,నిర్మాణ శాస్త్రాలపరంగా అపురూపమైనవి. ఆలయంలో మొత్తం 6 ప్రాకారాలు, 9 గోపురాలు వున్నాయి.ఆలయ ప్రాంగణంలో ఎన్నో మండపాలు, ఉపాలయాలు  దర్శనమిస్తాయి.

ఆలయ గోపురాలలో తూర్పువైపున వున్నదానిని రాజగోపురమంటారు.ఇదే ప్రధాన ద్వారము. ఒక్కోసారి ఇతర ద్వారాల నుంచి కూడా లోపలకు పంపుతారు. తంజావూరు బృహదీశ్వరాలయానికన్నా ఎత్తయిన గోపురం నిర్మించాలని ఆ నాటి శిల్పులు నిర్ణయించారు. వారు అనుకున్న విధంగానే ఒక అడుగు ఎత్తుగా, అంటే 217 అడుగుల ఎత్తయిన గోపురాన్ని అప్పట్లో నిర్మించారు.

శ్రీకృష్ణదేవరాయలు హయాంలో ఈ రాజగోపురం నిర్మితమైందని అంటారు. ఇక కర్ణాటక లోని మురుడేశ్వరుడి ఆలయ గోపురం ఎత్తు 249 అడుగులు. శ్రీరంగం లోని రంగనాథ స్వామి ఆలయ గోపురం ఎత్తు  240 అడుగులు. ఈ రెండు తర్వాత కాలంలో నిర్మితమైనవి.

అరుణాచల ఆలయ రాజ గోపురానికి 11అంతస్తులున్నాయి. ఇక మిగతా మూడు గోపురాలను అమ్మణి అమ్మాళ్ గోపురం, తిరుమంజరం గోపురం, పేయి గోపురం అని పిలుస్తారు.ఇవి 171, 157, 144 అడుగుల ఎత్తులో వున్నాయి. ఈ గోపురాలపై శిల్ప కళ అద్భుతంగా ఉంటుంది. ఓపికతో చూడాలి. రాజ గోపురం పై  శివ లీలలు, ఇతర  పురాణ ఘట్టాల ను తెలిపే సుందర శిల్పాలు కొలువు దీరి కనువిందు చేస్తుంటాయి.

అలాగే గోపుర ద్వారానికి రెండువైపులా అనేక నాట్య భంగిమల శిల్పాలను అద్భుతంగా  చెక్కారు.  ఆలయానికి సంబంధించిన మొదటి, రెండవ ప్రాకారాలు అతి పురాతనమైనవి.మూడవ ప్రాకారాన్ని కులోత్తుంగ చోళరాజు నిర్మించారని చెబుతారు.

ఈ రాజు శివ భక్తుడు. వైష్ణవ ద్వేషి అంటారు. ఈయనే  చిదంబరం లోని ఆలయం పునర్నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశారు. మిగిలిన వెలుపలి నిర్మాణాలు పదునాలుగు … పదిహేను శతాబ్దాల కాలంలో జరిగినట్టుగా శాసనాలు చెబుతున్నాయి. ఇక 4,5, 6 ప్రాకారాలు, వేయి స్థంభాల మండపం, పెద్ద నంది, శివ గంగ కోనేరు  16వ శతాబ్దానికి చెందినవి.ఈ కట్టడాల వివరాలను తెలిపే అనేక శాసనాలు ఆలయంలో వున్నాయి.

ఆలయం వెలుపల ప్రాకారం గ్రానైట్ రాతితో 30అడుగుల ఎత్తులో దృఢంగా నిర్మించారు.ఎందరో రాజులు ..మరెందరో  శిల్పులు ఇంకెందరో భక్తులు ఆలయ అభివృధ్దిలో పాలుపంచుకున్నారు. భక్తులు కోట్ల రూపాయలు ఖరీదు చేసే బంగారు ఆభరణాలను కానుకలు గా ఇచ్చారని చరిత్ర చెబుతోంది. 

ఆలయంలోకి సెల్ ఫోన్లను అనుమతిస్తున్నారు కాబట్టి సుందర శిల్పాలను ..గోపురాలను కెమెరాలో బంధించవచ్చు. ఆలయ ప్రాంగణంలో ఓపిగ్గా తిరిగితే తెలుసుకోవాల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. ఇక్కడి ప్రసాదాలు కూడా మంచి రుచిగా ఉంటాయి. పులిహోర గురించి చెప్పనక్కర లేదు.

అరుణాచలం వెళ్లాలని మనం అనుకోగానే సరికాదు. ఆ స్వామి పిలిస్తే కానీ వెళ్లలేం.  ఇది చాలామందికి అనుభవమే.

————- KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!