ప్రతీకారేచ్ఛతో రగులుతున్నతాలిబన్లు !

Sharing is Caring...

Talibans………………………………………..

ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ దళాలు మాజీ పోలీసు,ఇంటెలిజెన్స్,సైనిక అధికారులను టార్గెట్ చేస్తున్నాయి. వారి ఆచూకీ కనుగొని అంతమొందిస్తున్నాయి. కొందరిని రహస్య నిర్బంధంలో ఉంచుతున్నాయి. గతంలో తమను హింసించారని .. ఇబ్బందులు పెట్టారని అందుకు ప్రతీకారం తీర్చుకోవాలన్న ధోరణితో వ్యవహరిస్తున్నారు 2021 ఆగస్టు 15న దేశాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుండి నాలుగు ప్రావిన్సులలో 100 మందికి పైగా మాజీ అధికారులు అదృశ్యమైపోయారు.

తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్తల్లో గత ప్రభుత్వానికి మద్దతు పలికిన వారిని కూడా క్షమిస్తున్నామని ప్రకటించారు. అయితే అందుకు భిన్నంగా తాలిబన్లు వ్యవహరిస్తున్నారని  హ్యూమన్ రైట్స్ వాచ్ ఒక నివేదికలో స్పష్టం చేసింది.ఆగస్ట్ 15 —  అక్టోబర్ 31 మధ్య తాలిబాన్ దళాలకు లొంగిపోయిన లేదా పట్టుకున్నవారిలో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారని  హ్యూమన్ రైట్స్ వాచ్ ఆందోళన వ్యక్తం చేసింది. 

హత్యలు జరగకుండా చూడటం .. బాధ్యులను గుర్తించడం  బాధితుల కుటుంబాలకు పరిహారం చెల్లించడం తాలిబాన్ల బాధ్యత. కానీ ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం లేదు.  హ్యూమన్ రైట్స్ వాచ్ నాలుగు ప్రావిన్స్‌లలో వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులను ఫోన్ ద్వారా సంప్రదించింది.తాలిబన్ల కక్ష సాధింపు చర్యల గురించి సమాచారం సేకరించింది. తాలిబన్లు అధికారం లోకి వచ్చిన తర్వాత ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన మాజీ అధికారులంతా ప్రాణ భద్రతకు హామీ పత్రాలు పొందారు.

అందుకు సంబంధించిన  రికార్డుల లోని పేర్లు, చిరునామాల ఆధారంగా వారిని తాలిబన్లు వెంటాడుతున్నారని హ్యూమన్ రైట్స్ సంస్థ చెబుతోంది. మాజీ ఉద్యోగులందరినీ భయ కంపితులను చేసేలా తాలిబన్ల దారుణాలు సాగుతున్నాయని  హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ అంటోంది. అలా హామీ పత్రాల కోసం పేర్లను నమోదు చేసుకున్నవారిలో కూడా కొందరిని ఉరి తీశారు. మరి కొందరిని మాయం చేశారు. కొందరి  మృతదేహాలను వారి బంధువుల కోసం వదిలివేసారు.

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి రికార్డులను కూడా వెలికి తీసి .. వాటిలో ఉన్న చిరునామాల ద్వారా వ్యక్తులను గుర్తించి అరెస్ట్ చేస్తున్నారు. సెప్టెంబర్ చివర్లో కాందహార్ నగరంలో, మాజీ రాష్ట్ర గూఢచార సంస్థ నేషనల్ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ (NDS)లో ఉద్యోగం చేస్తున్న బాజ్ ముహమ్మద్ ఇంటికి తాలిబాన్ దళాలు వెళ్లి అతనిని అరెస్టు చేసి తీసుకువెళ్లాయి. తరువాత కొన్ని రోజులకు ఆయన మృతదేహం లభించింది. 

రాత్రి వేళ దాడులు చేసి లొంగి పోని సైనికులను పట్టుకుని తీసుకు వెళ్తున్నారు. వారు దొరకకపోతే కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారు. తాలిబన్లు ఏమి చేసినా ప్రజలు ప్రశ్నించ లేకపోతున్నారు.  ప్రాణ భయంతో తల్లడిల్లుతున్నారు. క్షమించామని  ప్రకటించి ఇలా చేయడం  ఏమిటని వాపోతున్నారు.

తాలిబన్ల అకృత్యాలు ప్రజలలో భయోత్పాన్ని కలిగిస్తున్నాయి. ఈ ప్రతీకార దాడులు గురించి ఎవరికి చెప్పుకోలేక .. ఏమి చేయలేక మధనపడుతున్నారు. అలాగే ప్రత్యేకించి నంగర్‌హర్ ప్రావిన్స్‌లో, తాలిబాన్లు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP, ఇస్లామిక్ స్టేట్ అనుబంధ సంస్థ, ISIS అని కూడా పిలుస్తారు)కు మద్దతు ఇస్తున్నారని భావిస్తున్న వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ISIS కి తాలిబన్లకు పడదు.

మానవ హక్కుల ఉల్లంఘన,ఇతర నేరాల విచారణకు ఒక కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సెప్టెంబర్ 21న తాలిబాన్ ప్రకటించింది.కమీషన్ దృష్టికి చాల విషయాలు వెళ్లినప్పటికీ ఎటువంటి దర్యాప్తును ప్రకటించలేదని అంటున్నారు. మొత్తం మీద తాలిబన్లు అధికారం చేపట్టాక ప్రజలు ఒక వైపు ఉపాధి, తిండి దొరకక నానా ఇబ్బంది పడుతున్నారు.  మరోవైపు మరి కొంతమంది  ప్రతీకార దాడులు తట్టుకోలేక..పట్టించుకునే నాధుడు లేక లబోదిబో అంటున్నారు.  ఇక మీడియాపై కూడా ఒత్తిడి.. ఆంక్షలు పెరిగాయి. గతంలో మాదిరిగా ఉన్నది ఉన్నట్టు రాయలేకపోతున్నారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!