రజనీ తో పోలిస్తే సూపర్ స్టార్ తక్కువేంకాదు !

Sharing is Caring...

నీల్ కొలికపూడి ……………………………………… 

దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి సూపర్ స్టార్ రజనీ కాంత్ ని ఎంపికజేయడం సంతోషమే. కానీ రజనీకాంత్ కంటే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సేవలు అందించిన నటులు ఎందరో ఉన్నారు. వాళ్లలో తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు.

రజనీ కాంత్ తో పోలిస్తే కృష్ణ కూడా తక్కువేమి కాదు. రజనీ కంటే పరిశ్రమలో సీనియర్ నటుడు. తన కెరీర్ లో సుమారు 350 సినిమాలలో హీరో గా నటించి పరిశ్రమలో తన సత్తా చాటుకున్నాడు. నిర్మాత, దర్శకుడిగా కూడా కృష్ణ తనదైన శైలిలో చిత్రాలు నిర్మించి రికార్డులు సృష్టించారు.

ఇవికాక కృష్ణ సినీ జీవితంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి.తెలుగు సినీ రంగాన్ని సాంకేతికంగా ముందుకు తీసుకెళ్ళే విషయాల్లో మొట్టమొదటి అడుగులెన్నో కృష్ణవే.  పలు హాలీవుడ్ తరహా జోనర్ సినిమాలను తొలిసారిగా తెలుగు సినిమా తెరకు కృష్ణ పరిచయం చేశారు. తెలుగులో తొలి జేమ్స్‌బాండ్ చిత్రం, హీరోగా కృష్ణ నటించిన మూడవ చిత్రం గూఢచారి 116. ఆ రోజుల్లో ఈ సినిమా గొప్ప హిట్.

తర్వాత అలాంటి సినిమాలు ఎన్నో వచ్చాయి. అలాగే క్రైమ్ జోనర్ లో ఎన్నో సినిమాలు సంచలన విజయాలు సాధించాయి.ఎందరో  దర్శకులను పరిశ్రమకు పరిచయం చేశాయి. కృష్ణ స్వంత నిర్మాణ సంస్థ పద్మాలయా మూవీస్ రెండో సినిమాగా నిర్మించిన మోసగాళ్ళకు మోసగాడు తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం. ఈ సినిమా స్పూర్తితో మరెన్నో కౌబాయ్ తెలుగులో వచ్చాయి. తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కించాయి. వీటన్నింటి వెనుక కృష్ణ పరోక్ష,ప్రత్యక్ష ప్రమేయం ఉంది. 

కొల్లేటి కాపురంతో తెలుగులో ఆర్.ఓ. సాంకేతికతను  పరిచయం చేశాడు. మొదటి ఓఆర్‌డబ్ల్యు కలర్ సాంకేతికతతో తీసిన సినిమా గూడుపుఠాణి. తొలి తెలుగు ఫ్యూజీ కలర్ చిత్రం భలే దొంగలు. తెలుగులో 70 ఎంఎం టెక్నాలజీని ఉపయోగించిన తొలి సినిమా సింహాసనం. సింహాసనం సినిమా స్టీరియోఫోనిక్ 6 ట్రాక్ సాంకేతికతతో సౌండ్ టెక్నాలజీ వాడిన తొలి తెలుగు సినిమా.

అల్లూరి సీతారామరాజు తెలుగులో ఫుల్‌స్కోప్ సినిమాల్లో మొదటిది. ఇక పద్మాలయా స్టూడియో నిర్మించి వందలాది మంది కార్మికులకు ఉపాధి కల్పించాడు. అలాగే క్రిష్ణా, గుంటూరు జిల్లాలలో థియేటర్లు నిర్మించి మరెందరికో ఉపాధి అందించాడు. ఇక పద్మాలయ బ్యానర్ పై 1980 నుంచి 2004 వరకు 16 హిందీ సినిమాలు, 3 తమిళ సినిమాలు 1 కన్నడ సినిమాను నిర్మించారు. ఆల్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటాడు.

బాలీవుడ్ కి  బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఇచ్చారు. హిమ్మత్ వాలా , పాతాళభైరవి  వంటి సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. హిందీ నిర్మాతలే కృష్ణ ను చూసి హడలి పోయేవారు. శ్రీదేవి బాలీవుడ్  హీరోయిన్ గా నిలదొక్కుకోవడానికి హిమ్మత్ వాలా దోహద పడింది. దర్శకులు బాపయ్య, కె. రాఘవేంద్రరావులను బాలీవుడ్ కి పరిచయం చేసింది కృష్ణనే.

జితేంద్ర సెకండ్ ఇన్నింగ్స్ చేయడానికి కారణం కూడా కృష్ణనే . హిట్స్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా  ఏడాదికి పది సినిమాలు కృష్ణ చేసాడు. పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి కల్పించాడు.  కృష్ణ అద్భుతమైన నటుడు అని ఎవరూ అనరు  కానీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు .. చిత్రపరిశ్రమ అభివృద్ధికి కృష్ణ చేసిన కృషి మరువలేనివి.

ఎందరో నిర్మాతలను .. నటులను,దర్శకులను ఆదుకున్న ఖ్యాతి కృష్ణదే.  ఫాల్కే అవార్డు పరిశ్రమకు చేసిన సేవను గుర్తించేది కాబట్టి కృష్ణ నూరు శాతం అర్హులు. కానీ ఆయన సేవలను కేంద్ర ప్రభుత్వం విస్మరించడం శోచనీయం. కృష్ణ కు రాజకీయాలతో సంబంధాలున్నాయనే కారణంగానే ఆయన  పేరు పక్కన బెట్టి ఉండొచ్చు.

1989 లో  కాంగ్రెస్ అగ్రనేత రాజీవ్ గాంధీ తో ఉన్న పరిచయాలను బట్టి ఆనాడు  కృష్ణ రాజకీయాల్లోకి వచ్చారు. ఏలూరు నుంచి పోటీ ఎంపీ అయ్యారు. రెండో సారి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. రాజకీయాలతో సంబంధమున్న రామానాయుడికి ఫాల్కే అవార్డు ఇవ్వగా లేనిది కృష్ణ కిస్తే తప్పేమి లేదు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!