ఏడిపిస్తున్నఐదు చేపల కథ !

Sharing is Caring...

The story of five cruel fishes………………………………………………………దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎవరికి ఏం చెప్పుకోవాలో ?ఎవరు ఆదుకుంటారో ? ఎవరు చేదుకుంటారో ? జనాలకు తెలియడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో సీరియస్ నెస్ లేదనే విమర్శలు పెరుగుతున్నాయి. కోర్టులు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి. అయినా పట్టించుకునే వారు లేరు.  వ్యవస్థలను కరోనా ముంచెత్తుతోంది. ఈ క్రమంలో ఇక సామాన్యుల పరిస్థితి చెప్పనక్కర్లేదు. అందరూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ప్రాణాలకు భరోసా ఇచ్చేవారు లేక దేవుడే దిక్కని బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. తమను పీక్కుతింటూ … ఏడిపిస్తున్న ఆ ఐదు చేపలను తిట్టిపోస్తున్నారు. చివరికి కథ ఏ మలుపు తిరుగుతుందో?

1. ఆసుపత్రులు ……..  ఇప్పుడవి సామాన్యులకు అందుబాటులో లేవు.పొరపాటున బెడ్లు దొరికినా …బతికి బయటకొచ్చేసరికి ఆసుపత్రి యాజమాన్యం ఇచ్చే బిల్లులు చూసి గుండెలాగిపోతున్నాయి. ఆసుపత్రులు సామాన్యుడి అవసరాన్ని దోపిడీ గా మలుచుకుంటున్నాయి. ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయి. బిల్లులు కట్టలేని వారు తమ వారి మృత దేహాలను వదిలేసి పారిపోతున్నారు. లేదంటే ఆసుపత్రి సిబ్బందితో గొడవలు పడుతున్నారు. 

2. టీకా … ఇప్పుడది అమృతపు చుక్కలా మారింది. వేయించుకుందామంటే దొరకదు. ప్రభుత్వ వైద్య శాలల్లో టీకా కోసం వెళ్లి అక్కడి జనాలను చూసి భయపడి వెనక్కి వచ్చిన వారు బోలెడు మంది.అక్కడి జనాల్లో కలసి కరోనా ను అంటించుకున్నవారు ఇంకొందరు. ఇపుడు ఫస్ట్ డోస్ ఆపేశారు.ఎపుడు వేస్తారో ఎవరికి తెలీదు .. చెప్పేవారే లేరు. 60 ఏళ్లకు పైబడిన వారు ఎందరో ఇంకా ఫస్ట్ డోస్ వేయించుకోలేదు. వారి బాధలు వర్ణనాతీతం. సరిపడా ఉత్పత్తి లేదు. ఒక పక్క భయం .. మరోవైపు అగమ్యగోచరం. కాసేపు కోవిన్ యాప్ లో రిజిస్టర్ చేయించుకోవాలంటారు. చేస్తే క్యాన్సిల్ చేస్తుంటారు. పక్కా ప్రణాళిక లేకపోవడం తో నానా ఇబ్బంది పడుతున్నారు.

3. ఆక్సిజన్ …….   దీనికి అమృతం కంటే డిమాండ్ ఎక్కువగా ఉంది..డబ్బు ఉన్నవారికి కూడా దొరకడం లేదు. ఇక సామాన్యుల దాకా  ఎక్కడొస్తుంది ?      ఇపుడున్న పరిస్థితుల్లో ఆక్సిజన్ అవసరమంటే ప్రాణాలు వదులుకోవాల్సిందే.

4. శ్మశానాలు …….   కుప్పలు తెప్పలుగా వస్తున్న మృత దేహాలను ఎక్కడ దహనం చేయాలో అర్ధంకాక … ఖాళీ దొరక్క .. దొరికినా కొన్ని చోట్ల వేలల్లో డబ్బు కట్టలేక నదుల్లో శవాలను పడవేసి పోతున్న సంస్కృతి మొదలైంది. గంగా నదిలో శవాలు తేలిన వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. ఇంకా మనదాకా ఈ కల్చర్ రాలేదు.

5. అమానవీయత …..   వైద్యం అవసరమైతే దేశంలో ఎక్కడికైనా వెళ్లి చేయించుకునే హక్కు పౌరులకు ఉంది. కానీ రాష్ట్ర సరిహద్దులోనే అంబులెన్సులను ఆపేస్తున్నారు. ఆసుపత్రి దృవీకరణ పత్రాలు .. ఈ పాస్ లు ఉంటేనే సరిహద్దు దాటాలంటూ రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నారు. రోగి సొంత డబ్బు తో  వైద్యం చేయించుకుంటామంటే  ప్రభుత్వాలకు ఏమిటో ఇబ్బంది అనే విమర్శలు వస్తున్నాయి. కోర్టులు జోక్యం  చేసుకోవాల్సిన దుస్థితి లో పడిపోయాం. మానవత్వం మాయమైపోతుంది. ఇక అంబులెన్సు వాళ్ళు .. ఆటోల వాళ్ళు .. శ్మశాన సిబ్బంది డిమాండ్లు మామూలుగా లేవు. అక్కడక్కడా మంచివాళ్ళు లేకపోలేదు.  
పైన చెప్పినవన్నీ ఒకప్పుడు చిన్న చేపలే … ఇపుడు అందులో కొన్ని ప్రజలను మింగేసే తిమింగలాలు మాదిరి మారాయి. చివరాఖరికి వీటి ఆకలికి ఎందరు మిగులుతారో ?

—————KNMURTHY

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!