తండ్రిని ద్వేషించిన తనయుడు !

Sharing is Caring...

why muthu hated karunanidhi ……………………….

రాజకీయాల్లో అపుడపుడు తమాషాలు జరుగుతుంటాయి. దివంగత నేత కరుణానిధి కొడుకుల్లో ఇద్దరు తండ్రిని వ్యతిరేకించి వార్తల్లో కెక్కారు. వాళ్లలో ఎంకే ముత్తు ఒకరు కాగా మరొకరు అళగిరి. పై ఫొటోలో తమిళనాడు సీఎం స్టాలిన్ పక్కన ఉన్నది కరుణానిధి పెద్ద కొడుకు ఎంకే ముత్తు.

ఈయన కరుణ మొదటి భార్య పద్మావతి కుమారుడు. ముత్తు ను రాజకీయాల్లోకి తన వారసుడిగా తెద్దామని కరుణ నిధి గట్టి ప్రయత్నాలే చేసారు. కానీ అవేవి ఫలించలేదు. పైగా తండ్రితో గొడవ పడి వేరుగా వెళ్లారు. మీడియా పెద్దగా ఫోకస్ పెట్టక పోవడంతో ఇతగాడి గురించి జనాలకు అంతగా తెలియదు.

కరుణానిధి 70 దశకం మొదట్లో తన రాజకీయ వారసుడిగా ముత్తును ప్రకటించాలనుకున్నారు. సినీ హీరో గా ఉన్న ఎంజీ రామచంద్రన్ కు పోటీ గా ముత్తు ను ప్రమోట్ చేసాడు. ముత్తు కూడా సినీ హీరో లా ఉండేవాడు. పార్టీ సమావేశాలకు అచ్చం ఎంజీఆర్ లాగా డ్రెస్ లు వేసుకుని వెళ్ళేవాడు. ముత్తు  పిళ్ళయ్యో పిళ్ళై, సమయల్కరన్ , అనయవిలకు …  మరికొన్ని సినిమాలలో నటించాడు.

ఆ సినిమాలకు కరుణానిధే స్క్రిప్ట్ కూడా రాశారు.  ఫైనాన్స్ కూడా అందించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ప్రేక్షకులు అతగాడిని ఆదరించలేదు. ముత్తు స్వయం గా ఎంజీఆర్ వీరాభిమాని. ఎంజీఆర్ ను వ్యతిరేకించే పనులు చేసేందుకు ఇష్టపడేవాడు కాదు. పార్టీ ప్రచారంలో తండ్రికి అంతగా సహకరించేవాడు కాదు. 

ఎంజీఆర్ విషయం లో తండ్రి వైఖరిని వ్యతిరేకించాడు. కరుణానిధితో గొడవపడ్డాడు. తండ్రికి దూరంగా వెళ్ళాడు. మధ్యలో కొన్నిసార్లు తండ్రికి డబ్బుల కోసం కబురు పంపితే కరుణానిధి అంతగా స్పందించలేదని కూడా అంటారు. దీంతో  ముత్తు తండ్రి పై తీవ్రంగా ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే మత్తుకు బానిస అయ్యాడు.

80 దశకం చివరిలో ముత్తు అప్పటి అన్నాడీఎంకే అధినేత జయలలితను కలిశారు. అంతకుముందే  జయలలితతో ముత్తు కి పరిచయం ఉంది. తన పరిస్థితి చెప్పుకోగా ఆమె 5 లక్షల ఆర్థిక సహాయం కూడా చేశారని అంటారు. ఆ తర్వాత ముత్తు అన్నాడిఎంకే లో కూడా చేరారు. 2008 వరకు తండ్రి కరుణానిధి కి వ్యతిరేకంగా ప్రచారం చేసేవాడు. అన్నాడీఎంకే కార్యాలయం ముందు కూర్చుని కరుణానిధిని తిట్టి పోసేవాడట.

2009 లో ముత్తు ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చేరినపుడు కరుణానిధే వచ్చి కుమారుడిని పరామర్శించాడు. అపుడు కొందరు మధ్యవర్తుల ద్వారా తండ్రి కొడుకుల మధ్య రాజీ జరిగింది. కుమారుడి కుటుంబాన్ని ఆదుకోవడానికి కరుణానిధి హామీ ఇచ్చారట. ఆ మేరకు ముత్తుకు కొన్ని ఆస్తులు బదలాయించారని అంటారు.

రెండు దశాబ్దాల పాటు తండ్రితో ఉన్న వైరాన్ని అప్పటితో ముత్తు వదిలేశారు. నాటి నుంచి కరుణానిధి దగ్గరకు ముత్తు వస్తుండేవాడు. ఆ సందర్భంగానే స్టాలిన్ ను కలుస్తుండేవాడు. ముత్తు రాజకీయాలకు దూరంగా ఉండటం తో స్టాలిన్ కూడా అతని రాకపోకలను పట్టించుకునే వాడు కాదు.

2015 తర్వాత ముత్తు  వయసు రీత్యా ఇంటికి పరిమితమైనారు. అతని కుమారుడు అరివునిధి కూడా గాయకుడిగా, నటుడిగా కొన్ని సినిమాలు చేశారు.కాగా ఆ మధ్య అరివు నిధి తమను బెదిరిస్తున్నాడని… ఆస్తుల కోసం  వేధిస్తున్నాడని అతగాడి తల్లి శివ కామ సుందరి  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

—————-KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!