తమరు వార్తలు భలే వండుతారు సారూ !!

Sharing is Caring...

photo courtesy…. skech face..blogger

అయ్యా ……..   గారూ నమస్కారం …   వార్తలు రాయడంలో .. రాయించడం లో మీకు మీరే సాటి. భూగోళం మొత్తం మీద తమరంతటి సమర్ధుడైన జర్నలిస్ట్  ఎవరూ లేరు సారూ . భలేగా వార్తలు అల్లుతారు … అవసరమైన మసాలా భలే కూర్చి , పేర్చి పెడతారు. అవసరం లేకపోయినా డబుల్ ధమాకా మసాలా వార్తలు వండించి వారుస్తుంటారు. ఏదైనా మీకు మీరే సాటి .. ఈ విషయం లో తమరు గోబెల్స్ ను మించి పోయారు. ఇది నిజంగా పొగడ్తే సార్ … నమ్మండి సారూ.  గోబెల్స్ సామాన్యుడు కాదుకదా సారూ. గోబెల్స్ ఇపుడు ఉన్నట్టయితే తమరి దగ్గరి కొలువులో చేరే వారు సారూ. తమరు ఆయన స్థాయిని దాటి పోయారు . నిజ్జంగా నిజం సార్ .. మా ఆవిడ మీద ఒట్టు.

అసలు ఇది నేను అంటున్న మాట కాదండోయ్ …  మా నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. నిజం చెప్పాలంటే రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు అంటున్నారండోయ్. ఒకవేళ గోబెల్స్ అంటూ ఎవరైనా కొలువు కోసం  వచ్చినా చేర్చుకోవద్దు సారూ.  తమరే అర డజను గోబెల్స్ కి మించినోరు కదా సారు.
ఇక అసలు విషయంలోకి వస్తాను సారు. జగన్ కి అమిత్ షా క్లాస్ పీకారంటూ తమరు రాసిన వార్త పేలిపోయిందట  సార్.  ఆ వార్త పేపర్ లో రాగానే అమరావతిలో పొద్దునే భూకంపనాలు వచ్చాయట  సారూ. పులివెందులలో అయితే జనాలు రోడ్లమీద కళ్ళు తిరిగి పడిపోయారట. పెనుగాలులు వీచాయట .. చెట్ల కొమ్మలు , ఆకులు రాలి పడ్డాయట.  మన పార్టీ వాళ్ళకి  ఆ వార్త రాత్రే లీకయింది. అప్పటినుంచి  నాన్ స్టాప్ గా సంబరాలు చేసుకుంటున్నారు.

అయినా నాకో విషయం అర్ధంకాక తల బద్దలు కొట్టుకుంటున్నా సారూ.
మూడో వ్యక్తి లేని ఇద్దరి మీటింగ్ లో ఏమి జరిగింది తమరికే ఎలా తెలుస్తుంది సారూ. ఎవరిని అడిగినా సరిగ్గా జవాబే చెప్పడం లేదు. జగన్ భయపడిపోయి ఏం రాయొద్దు అని తమరినే బతిమాలాడు అని కొందరు .  కాదు కాదు అమిత్ షా కావాలనే లీక్ చేసాడని ఇంకొందరు  అంటున్నారు. నేనయితే ఆ మాటలు నమ్మడం లేదు  సారు .

ఎందుకంటె అసలు ఆళ్ళిద్దరికి తమరితో మాట్లాడే ధైర్యం ఉందా ? అని నాకు డౌట్ అనుమానం.  ఈ డౌట్ అనుమానం … నా ఒక్కడిదే కాదు తెలుగు రాష్ట్రాల ప్రజలందరిది సారూ.   రాత్రే మా ఆవిడను అడిగితే తమరు ఏదో మాయ చేసుంటారు అంది. ఇది నిజమేనా ? సారు ..  ఏం మాయ చేశారు ? ఏం మంత్రం వేశారు ? అమిత్ షా ఇంటి /పేషీ గోడకో  ఎవరికి కనబడని  మాయదారి చెవులు అంటించేరా ఏమిటి ? తమరు ఆమాత్రం సమర్దులే సారూ .   మొత్తానికి  ఏదో చేసి ఉంటారు కదా.

ఇక అసలు విషయం చెప్పడం మర్చిపోయాను సారు పొద్దునే పేపర్ కొనుక్కొని ఇంటికొస్తూ టీ తాగుదామని షాప్ దగ్గర ఆగాను. అక్కడ అందరూ తెగ  నవ్వుకుంటున్నారు. ఏంట్రా బాబు అంటే … ఆ వార్త  చూపించి  నవ్వుతున్నారు. ఎందుకో ఇప్పటికి నాకు అర్ధం కావడం లేదు సారూ. అందుకే తమరికి ఈ ఉత్తరం రాసుకుంటున్నా.

ఇట్లు

పుకార్ల పిచ్చేశ్వరరావు
మీ  వీరాభిమాని

 

 

Sharing is Caring...
Support Tharjani

Comments (2)

  1. రాయుడు September 23, 2020
  2. DRKREDDY September 23, 2020
error: Content is protected !!