ఇచ్చుటలో వున్న హాయీ!

Sharing is Caring...

భండారు శ్రీనివాసరావు……………………….

పాండవాగ్రజుడయిన యుధిష్ఠిరుడు ఓ రోజు జూదమాడుతూ ఆనందిస్తున్న వేళ ఓ భిక్షకుడు వచ్చి ధర్మం చేయమని కోరాడు. ధర్మరాజు జూదం ధ్యాసలో వుండి ‘చేయి ఖాళీ లేదు మర్నాడు రమ్మన్నాడ’ట. ఆ పక్కనే కూర్చుని తన గదకు మెరుగులు దిద్దుకుంటున్న భీముడు, అన్నయ్య ధర్మజుడు నుడివిన మాటవిని ఎంతో సంతోషించాడట. ఎందుకటా!

ఎందుకంటే, వాక్శుద్ధి కలిగిన ధర్మరాజు తన తొందరలో వుండి ఆ భిక్షకుడిని మరునాడు రమ్మని చెప్పాడంటే మరుసటి రోజువరకు అగ్రజుడు బతికే వుంటాడని ఆ కండల వీరుడు సంబరపడ్డాడట. ఈ క్షణంవరకు ప్రాణాలతో వున్న మనిషి మరునిమిషం దాకా జీవించివుంటాడో లేదో తెలియని అశాశ్వతమైన బతుకులు మానవులవి.

అలాటిది తక్షణం చేయదలచుకున్న దానాన్ని మరో క్షణం వరకు వాయిదా వేయడం మంచిది కాదన్న పెద్ద నీతి ఈ చిన్ని కధలో వుంది.ఒకరికి ఇవ్వడం, అది దానం అనండి మరోటి అనండి అది ఏమయినా సరే వాయిదా వేస్తే క్షణ భంగుర జీవితంలో అది నెరవేరే వీలుండక పోవచ్చు కూడా. అందుకే ఒకరికి ఏదయినా ఇవ్వాలన్న ఆలోచన కలగగానే దాన్ని వెంటనే ఆచరణలో పెట్టడం మంచిది.

ఇచ్చుటలో ఎంతో హాయి వుందని బాపూ రమణలు ఎన్నోసార్లు చెప్పారు. ఆ ఇవ్వడానికి కూడా ఓ తరీఖా వుందంటున్నారు ఇవ్వడం తెలిసినవాళ్ళు.‘నదుల్లో నీళ్ళు పుష్కలంగా వుంటాయి. కానీ నది దాహం వేసినప్పుడు తనలో పారే నీళ్ళను ఎప్పుడూ తాగదు.

అలాగే చెట్టుకు యెంత ఆకలేసినా తనకు కాసిన పళ్ళను తినదు. అంటే ఏమిటి. ఏదయినా, తనదయినా ఇతరులకి ఇవ్వడం అన్నదే ప్రకృతి ధర్మం.అయితే తనకు మాలిన ధర్మం కూడా పనికి రాదని అంటున్నారు ధర్మ సూక్ష్మాలు తెలిసిన వాళ్లు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!