వణికిస్తోన్న ఓమిక్రాన్ వైరస్ !!

Sharing is Caring...

New Fears ……………..

కొత్త కరోనా వైరస్ ఓమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా భయం తగ్గిందిలే అని జనం రిలాక్స్ అయిన నేపథ్యంలో ఈ ఓమిక్రాన్ వెలుగులో కొచ్చి కొత్త భయాలను కలిగిస్తోంది. సౌత్ ఆఫ్రికాలోని నెట్‌వర్క్ ఫర్ జెనోమిక్స్ సర్వైలెన్స్ (NGS SA) సంస్థ కొద్దీ రోజుల క్రితం  వేరియంట్‌ను గుర్తించింది.

కరోనా వైరస్ కొత్త రూపాంతరమే ‘ఓమిక్రాన్’.. దీనిని B.1.1529 అని పిలుస్తారని  శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. దీనికే WHO ఓమిక్రాన్ అని పేరు పెట్టింది. ఇది దక్షిణాఫ్రికాలో వేగంగా వ్యాప్తి చెందుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.ఈ వైరస్ ఆందోళనకరమైన వేరియంట్ అని ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

ఇప్పుడు బెల్జియం, హాంకాంగ్, ఇజ్రాయెల్‌తో పాటు దక్షిణాఫ్రికా నుండి వచ్చే ప్రయాణికులలో ఈ కొత్త వైరస్ ఓమిక్రాన్ కేసులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఓమిక్రాన్ వేగంతో వ్యాపించే వైరస్ అని ప్రస్తుత వ్యాక్సిన్‌ల ప్రభావం ఈ వైరస్ పై అంతగా ఉండకపోవచ్చని అంటున్నారు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమౌతోంది.

ప్రపంచ దేశాలు అప్రమత్తమైనాయి. విదేశీ ప్రయాణాలపై పలు ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నాయి.  అమెరికా, కెనడాతో పాటు కొన్ని యూరోపియన్ దేశాల్లో ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఆఫ్రికా దేశాల నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రకటించింది. జర్మనీ, ఇటలీ, సింగపూర్‌, జపాన్‌లు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాయి.

దక్షిణాఫ్రికాలోని  గౌటెంగ్‌లో ఇటీవల అంటువ్యాధి కేసులు పెరగడానికి రూపాంతరం చెందిన ఈ కొత్త వేరియంట్ కారణమని అక్కడి శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొత్త వేరియంట్ ఓమిక్రాన్ ఎక్కడ నుండి వచ్చిందన్న విషయంపై స్పష్టత లేదు. ఈ వేరియంట్ వల్ల కలిగే నష్టాలను తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు సమావేశాలను నిర్వహిస్తున్నారు.

డెల్టా వేరియంట్ కంటే ఓమిక్రాన్ ఎక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని …ఇన్ఫెక్షన్ వేగంగా సోకుతుందని అంటున్నారు.కరోనా వైరస్ సోకి కోలుకున్న వ్యక్తులు ఈ వేరియంట్ బారిన పడవచ్చని నిపుణులు అంటున్నారు.ఈ కొత్త ఓమిక్రాన్ వేరియంట్‌ నియంత్రణ కోసం బూస్టర్ డోసు అభివృద్ధి చేస్తున్నట్టు యుఎస్ ఫార్మాస్యూటికల్ కంపెనీ మోడర్నా ప్రకటించింది.

కొత్త ముప్పును పరిష్కరించడానికి కంపెనీ ప్రస్తుత వ్యాక్సిన్ ను ఎక్కువ మోతాదుతో అందుబాటులోకి తెస్తున్నట్టు ఆ కంపెనీ చెబుతోంది. ఇతర కంపెనీలు కూడా వ్యాక్సిన్ అభివృద్ధికి సమాయత్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఆందోళన చెందకుండా.. ప్రస్తుత తరుణంలో ప్రజలు  కొన్నాళ్ళు జాగ్రత్తలు తీసుకోడమే ఏకైక మార్గం.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!