Subramanyam Dogiparthi …………………..
ఎన్టీఆర్ దాసరి కాంబినేషన్ లో రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ బొబ్బిలి పులి. ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ కి పునాదులు వేసిన సినిమాల్లో ఇదొకటి.. దాసరితో ఇదే ఎన్టీఆర్ చేసిన చివరి సినిమా కూడా. బొబ్బిలి పులి’ సినిమాను విజయ మాధవి కంబైన్స్ పతాకంపై వడ్డే రమేష్ నిర్మించారు.
ఈ సినిమా కథ విషయానికొస్తే.. హీరో మేజర్ చక్రధర్ సమాజంలో అవినీతి, లంచగొండితనాన్ని భరించలేక నక్సలైట్ గా మారతాడు. సంఘానికి పట్టిన చీడ పురుగులను ఎలా ఏరివేసాడనేదే అసలు కథ. దాసరి ఈ సినిమాను తెరకెక్కించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది.
నటనా పరంగా ఎప్పటిలాగే అగ్ర తాంబూలం ఎన్టీఆర్ దే. దాసరి ఎన్టీఆర్ పాత్రను బ్రహ్మాండంగా మలిచారు.కోర్టు సీన్లో ఎన్టీఆర్ డైలాగులు , బొబ్బిలి పులి డెన్లో ఎన్టీఆర్-శ్రీదేవి , ఎన్టీఆర్-జగ్గయ్య డైలాగులు థియేటర్లలో ఎన్టీఆర్ అభిమానులకు పూనకం తెప్పించాయి.
దాసరి సినిమా అంటేనే డ్రామా , డైలాగులు , ఎమోషన్స్ ఫుల్. ఆ అగ్నికి ఎన్టీఆర్ లాంటి వాయువు తోడయితే చెప్పేదేముంది. ప్రభంజనం అవుతుంది. అదే జరిగింది.ఎన్టీఆర్ తర్వాత అద్భుతంగా నటించింది శ్రీదేవే.
గ్లామర్ బొమ్మగా, తన ప్రియుడి చెల్లెలి పెళ్లి కోసం తన ప్రేమను త్యాగం చేసే నాయకిగా , కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటరుగా , తన ప్రియుడి భార్యకు తోడుగా ఉండే స్నేహితురాలిగా ఎన్టీఆర్ తో పోటీ పడి నటించిందనే చెప్పాలి .
కోర్టు కోర్టుకి తీర్పు తీర్పుకి ఇంత మార్పుంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా యువరానర్.. ? శత్రుమూకలను చంపినందుకు ఇచ్చిన ‘పరమవీరచక్ర’ అవార్డు, నిజానికి దేశ అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్న వారిని చంపినందుకు ఇప్పుడు ఇస్తే బాగుండేది.. వంటి పవర్ఫుల్ డైలాగ్స్ తో నడిచే కోర్టు సన్నివేశం సినిమాలో హైలైట్ గా నిలుస్తుంది.
సినిమాలో పాటలన్నీ హిట్. ‘జననీ జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’ అనే దాసరి వ్రాసిన పాట తెలుగు దేశం పార్టీ కి ఐకానిక్ సాంగ్ గా నిలిచింది. ఓటర్లను ఉత్తేజపరచడానికి ఉపయోగపడింది. ఈ సినిమా టైంకే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ ప్రచారం ప్రభంజనంలాగా సాగుతుంది.
ఆ టైంలో ఈ పాట వేయకుండా ఆయన మీటింగే జరగలేదు. ఈ రోజుకీ TDP మీటింగుల్లో ఈ పాట వేయాల్సిందే. ‘సంభవం నీకే సంభవం ధర్మానికి నువ్వే రాజువై.. న్యాయానికి నువ్వే మూర్తివై’ పాట కూడా బాగుంటుంది. దీన్ని కూడా దాసరే వ్రాసారు.
ఈ సినిమాలో జనాన్ని ఊపేసిన పాట’ ఓ సుబ్బారావో ఓ అప్పారావో’ పాట. రాజమౌళి దర్శకత్వం వహించిన యమదొంగ , బాహుబలి సినిమాలలో ముగ్గురు డాన్సర్లే . ఈ బొబ్బిలి పులి సినిమాలో ఈ పాటలో ఏకంగా నలుగురు విజయలలిత , జ్యోతిలక్ష్మి , జయమాలిని , సుభాషిణి నృత్యం చేశారు.ఈ పాటనూ దాసరే వ్రాసారు.
దాసరి వ్రాసిన మరో డ్యూయెట్ సాంగ్ ‘తెల్లా తెల్లని చీరెలోనా చందమామా’ కూడా చాలా బాగుంటుంది. ఆరు పాటల్లో మిగిలిన రెండు పాటల్ని వేటూరి వారు వ్రాసారు . అది ‘ఒకటో నంబరు బస్సు దాని యవ్వారం నాకు తెలుసు’ , ‘ఎడ్డేమంటె తెడ్డేమంటే నడ్డి విరిగిపోతుంది’ . రెండూ యన్టీఆర్, శ్రీదేవిల మీద తీసిన డ్యూయెట్లే. రెండూ హుషారుగానే ఉంటాయి . మొదటి పాటలో గొల్లపూడి , కంకిపాడు ప్రస్తావనలు కృష్ణా జిల్లా వాళ్ళకు బాగా హుషారును కలిగించాయి.
సినిమాలో మిగిలిన ప్రధాన పాత్రల్లో సత్యనారాయణ , రావు గోపాలరావు , అల్లు రామలింగయ్య , మురళీమోహన్ , ప్రభాకరరెడ్డి , రావి కొండలరావు , భీమరాజు , ప్రసాద్ బాబు , త్యాగరాజు , రాజనాల , ధూళిపాళ , రాజా , జయచిత్ర , అంబిక , పుష్పలత , జయవిజయ , ప్రభృతులు నటించారు.
విశేషం ఏమిటంటే సినిమాలో హాస్య నటీనటులు లేరనే విషయం కూడా ప్రేక్షకులు గమనించకుండా కట్టి పడేసే సినిమా. అందుకే 39 సెంటర్లలో వంద రోజులు , రెండు సెంటర్లలో 175 రోజులు ఆడి సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది .1993 లో హైదరాబాదులో రెండో సారి విడుదల కాగా మళ్ళీ 175 రోజులు ఆడింది.
దాసరి-ఎన్టీఆర్ కాంబినేషన్లో అయిదు సినిమాలు వస్తే మూడింటిలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం. అలా ద్విపాత్రాభినయం లేకుండా సూపర్ హిట్టయిందీ సినిమా. ఈ సినిమా సూపర్ విజయానికి మరో కారణం జె వి రాఘవులు అందించిన సంగీతం . పాటలకే కాదు .. బేక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది.
బాలసుబ్రమణ్యం , సుశీలమ్మల గురించి చెప్పేదేముంది. ఈ సినిమాకు ఐకానిక్ పాటలయిన రెండు పాటల్నీ బాలసుబ్రమణ్యం బ్రహ్మాండంగా పాడారు .హిందీలో ‘జఖ్మీ షేర్’ అనే టైటిలుతో దాసరే డైరెక్ట్ చేసారు. ఎన్టీఆర్ పాత్రను జితేంద్ర , శ్రీదేవి పాత్రను డింపుల్ కపాడియా, జయచిత్ర పాత్రను జయసుధ వేసారు.
బాబీ సినిమా తర్వాత ఈ సినిమా ద్వారానే డింపుల్ సినీ రంగంలోకి పునఃప్రవేశం చేసింది. శ్రీదేవితో అసలు పోల్చలేం. ఎన్టీఆర్ తో పోల్చాలంటే జితేంద్ర ఏం సరిపోతాడు !? మరో ఎన్టీఆర్ కావాల్సిందే .బహుశా ఈ సినిమా చూడనివారు అప్పట్లో ఎవరూ ఉండరు. సినిమా యూట్యూబ్ లో ఉంది .. చూడని వారు ,చూసిన వారు చూడవచ్చు.