“నా పేరు మల్లిక నా ప్రమేయం లేకుండానే అన్ని జరిగిపోయాయి. కానీ శిక్ష మాత్రం నేను అనుభవిస్తున్నా. అందరూ నన్ను కావాలని చెడిపోయిన దాన్నట్టు చూస్తున్నారు. అమ్మకొట్టిందని అలిగి ఇంటి నుంచి వెళ్ళాను. బస్ స్టాండ్ వద్ద తిరుగుతుంటే ఒక ఆంటీ నన్ను వాళ్ళింటికి తీసుకెళ్ళింది.అపుడు నావయసు పదమూడు. అయితే వయసుకి మించి ఎదిగాను. అదికూడా నా తప్పు కాదు. అదే ఒక విధంగా శాపం గా మారింది.
మొదట్లో కేవలం తన పనులే చేయించుకున్న ఆంటీ మెల్లగా నన్ను ముగ్గులోకి దింపింది.చెప్పినట్టు వింటే బాగా డబ్బులోస్తాయి.. రోజుకో సినిమా చూడొచ్చు అంటే ఆశ పడ్డాను. నాకు సినిమాల పిచ్చి. హీరో ప్రభాస్ అంటే భలే ఇష్టం. ప్రభాస్ ను కూడా చూపిస్తా అంటూ అంటీ కధలు చెప్పింది . నిజమే కాబోలు అనుకున్నా. ఏమీ చేయాలో అసలు విషయం చెప్పేసరికి గుండె ఆగినంత పని అయింది.
భయపడాల్సిన అవసరం లేదంది. సరే అని ఒప్పుకున్నా .. మొదట్లో ఒకరే అంది మెల్లమెల్లగా సంఖ్య పెరిగింది. రోజుకి 10 మంది వరకు వచ్చేవారు. ఆంటీ సీడీలు తెప్పించి సినిమాలు చూపించేది. రోజు బిర్యానీ పెట్టేది. ఇంకా మందు, గంజాయి, ఐస్ క్రీంలు,చిరు తిండ్లు సరేసరి. మంచి బట్టలు కూడా తెప్పించేది. నా దగ్గరికి వచ్చేవారంతా నువ్వు అచ్చం సినీమా హీరొయిన్ లాగా ఉన్నవని పొగిడే వాళ్ళు. వాళ్ళ పొగడ్తలకు పొంగిపోయే దాన్ని.
వాళ్ళు కోరినట్టు నడుచుకునేదాన్ని. కొన్నాళ్ళు పోయాక ఆంటీ నన్ను తిరుపతి పంపింది. అక్కడ కెళ్ళిన తర్వాత తెల్సింది అంటీ నన్ను అమ్మేసిందని… ఇంత కాలం అక్కడ ఉన్నందుకు నాకు పైసా ఇవ్వలేదు. ఎంత మోసం చేసింది? ఇక్కడ పరిస్థితి మరీ ఘోరం గా ఉంది. ఇక్కడ ఓనర్ నికృష్టుడు. అన్నం కూడా పెట్టడు. ఒకటే డబ్బు దాహం.వాడి దగ్గరనుంచి తప్పించుకోవాలని ప్రయత్నించాను.
ఈలోగానే పోలీసులకు దొరికి పోయాం. హోం కొచ్చాను. అమ్మ నాన్న నేను హోం లో ఉన్నానని తెలుసుకుని వచ్చారు. నీకెంత కర్మ పట్టిందని మొత్తుకున్నారు. తర్వాత ఇంటికి వచ్చాను .. కానీ అందరూ చిన్న చూపు చూసారు . చెడిపోయిన దానివని సూటి పోటి మాటలు అనే వారు. ఈ లోగానే వేరొకరు దగ్గరయ్యారు. ప్రేమించానన్నాడు. పెళ్లి చేసుకుందామన్నాడు. అతనితో వెళ్ళిపోయాను. అక్కడ మళ్ళీ మోసపోయాను. మళ్ళీ హోం కొచ్చా.. ”
ఆ తర్వాత …… నిరాశ నిస్పృహల్లో ఉన్న మల్లికకు హోం లో కౌన్సిలింగ్ ఇచ్చారు. బేకరీ కోర్సులో శిక్షణ తీసుకుంది. ఆమె ప్రవర్తన మారడానికి మరికొంత కాలం పట్టింది. తర్వాత ఆమెకు ఒక ఎన్జీవో ఉద్యోగం ఇచ్చింది. మల్లిక ప్రస్తుతం కుదురుగా జాబ్ చేసుకుంటోంది.