It remains a mystery………………………………..
పదమూడేళ్ల క్రితం ఆ ఆరో నంబర్ గది గురించి దేశవ్యాప్తంగా చర్చలు జరిగాయి.ఇప్పటికి అందులో ఏముందో ఎవరికి తెలియదు. అందులో నిధులు..నిక్షేపాలున్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.ఆ గదిని తెరిస్తే అరిష్టమని .. విపత్తు సంభవిస్తుందని పెద్ద ఎత్తున వాదనలు జరిగాయి. అయితే అంతా ట్రాష్ అని కొన్ని వర్గాలు కొట్టిపడేశాయి.
అయినప్పటికీ ఆ మిస్టరీ వీడలేదు. ఇక భవిష్యత్తులో కూడా తేలదేమో. ఎందుకంటే ఆలయ నిర్వహణ బాధ్యతలు.. ఆరో గది తెరిచే నిర్ణయం ట్రావెన్కోర్ రాజ వంశీయులే తీసుకుంటారని సుప్రీం 2020 లో తీర్పుచెప్పింది. దీంతో ఆరోగది లో ఏముందో తెలుసుకునే అవకాశాలు పూర్తిగా మూసుకు పోయాయి.
కేరళ రాజధాని తిరువనంతపురం లో అనంత పద్మనాభ స్వామి ఆలయం ఉన్న విషయం తెలిసిందే. 2011 లో ఈ ఆలయం లోని నేలమాళిగల్లో గుప్త నిధులు బయటపడ్డాయి. దీంతో ఈ ఆలయం ఒక్కసారిగా వార్తల్లో కెక్కింది. నేల మాళిగల్లోని అయిదు తలుపులు తెరిచి చూసారు. దాదాపు లక్షకోట్ల విలువైన సంపద బయటపడింది.
ఈ క్రమంలో ఆరోగది తీయాలని కొందరు వాదించగా, రాజకుటుంబీకులు ఒప్పుకోలేదు. దీంతో ఆరో గది తలుపులు మాత్రం తీయలేదు. ఆ తలుపులు తీయడం వలన ప్రళయం వస్తుందని ఆలయ పూజారులు హెచ్చరించారు. ఆరోగది తలుపులకు నాగ బంధం ఉందని .. దానిని తెరవడానికి ప్రయత్నిస్తే ఏదైనా జరగవచ్చని కొందరు వాదించారు.
16 శతాబ్దంలో రాజా మార్తాండవర్మ ఆరోగదిని సిద్ధపురుషులు మాత్రమే తెరవగలరని చెప్పినట్టు కూడా ప్రచారం జరిగింది.ఈ ఆలయం క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో నిర్మితమైంది. 16 శతాబ్దం నుంచి ట్రావెన్కోర్ రాజుల చేతుల్లోకి వెళ్ళింది. ఆలయాన్ని ఈ రాజులే పునరుద్ధరించారు.డచ్, బ్రిటిషర్లు, టిప్పుసుల్తాన్ నుంచి ముప్పు ఉందని భావించి అప్పటి రాజు మార్తాండవర్మ సంపదంతా ఆలయం నేలమాళిగల్లో పదిలపర్చారు. ఈ సంపద బయట పడినపుడే ఆరోగదిలో అంతకంటే ఎక్కువ ఉండొచ్చనే వాదన వచ్చింది. ఈ అంశంపై కొందరు హైకోర్టు కెళ్లారు
1991 లో ట్రావెన్కోర్ చివరి పాలకుడు చనిపోయారు. రాజ కుటుంబహక్కులు నిలిచిపోయాయని కేరళ హైకోర్టు 2011 లో తీర్పు ఇచ్చింది. ఆరోగది తలుపులు తెరవాలని స్పష్టం చేసింది.అయితే రాజ వంశీయులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత గత ఏడాది సుప్రీం తీర్పు ప్రకటించింది.తీర్పు రాజవంశీయులకే అనుకూలంగా రావడంతో ఆరోగది తెరిచే అంశం మరుగున పడి పోయింది. రాజ వంశీయులు తమ వాదనపైనే నిలబడి ఆరో గది తలుపులు తెరవలేదు.
ఇదిలా ఉంటే 1930 లో కొందరు దుండగులు ఆరో గదిని తెరిచే ప్రయత్నం చేయగా పెద్ద నాగుపాములు బుసలు కొడుతూ వారిని తరిమి కొట్టాయని ఒక కథనం కూడా ప్రచారంలో ఉంది. అప్పటినుంచే ఆ గదికి నాగబంధం ఉందని ఆ నోటా ఈ నోటాబడి ప్రపంచానికి తెల్సింది. అసలు వాస్తవమేమిటో రాజ వంశీయులకే తెలియాలి.
అలాగే అంతకు ముందు తీవ్రకరువు సంభవించినపుడు ఆరో గదిని తెరిచే యత్నం జరిగిందట. అప్పుడు ఆ గది తలుపులు వెనుకనుంచి సముద్రపు హోరు వినిపించిందట. దాంతో ఆప్రయత్నాన్ని విరమించున్నారని స్థానికులు చెబుతుంటారు. ఈ ఆలయానికి సరిగ్గా మూడు కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరం ఉంది. ఆ హోరు ఆ సముద్రానిదే అంటారు.మొత్తం మీద ఆ ఆరోగదిలో ఏముందో ఎవరికి తెలియని మిస్టరీ గా నే మిగిలిపోయింది.రాజ వంశీయులకు కూడా పూర్తిగా తెలుసో లేదో కూడా మిస్టరీనే.
————– K.N.MURTHY