పై ఫొటోలో కనిపించే వ్యక్తి పేరు ..రుహాల్లా జామ్. జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు. ఇరాన్ ప్రభుత్వం అతగాడిని నిర్దాక్షిణ్యంగా ఉరి తీసింది. అతను ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడన్నది ప్రధాన అభియోగం. అమద్ న్యూస్ పేరిట అతను ఒక న్యూస్ ఛానల్ ను స్థాపించారు .
ఇరాన్ సుప్రీంకోర్టు ఈ ఏడాది (2020)జూన్ లో మరణశిక్ష విధించగా,దాన్ని అమలు చేశారు. 2017-18లో ధరల పెరుగుదలపై ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనలకు సంబంధించిన వీడియోలను , వార్తా కథనాలను తన ఛానల్ ద్వారా జామ్ ప్రజల ముందుకు తీసుకెళ్లారు.
దీంతో ఆగ్రహించిన ప్రభుత్వం జామ్ పై ఇరాన్ చట్టం లోనే అత్యంత తీవ్ర నేరమైన అవినీతి కేసు పెట్టింది.అంతేగాక పలు దేశాల నిఘా సంస్థలు జామ్‌కు రక్షణ కల్పిస్తున్నాయని ఇరాన్ ఆరోపించింది. దేశ భద్రతను పణంగా పెట్టి ఫ్రాన్స్, మరికొన్ని దేశాల కోసం జామ్ గూఢచర్యం చేస్తున్నాడని అతడిపై కేసులు పెట్టారు. ధరల పెరుగుదల ఆందోళనల వెనుక జామ్ ఉన్నాడని ప్రభుత్వం ఆరోపించింది.
కాగా 2009 ఇరాన్ అధ్యక్ష ఎన్నికల తర్వాత ఫ్రాన్స్‌కు పారిపోయిన జామ్ అక్కడే ఉంటూ అమద్ న్యూస్ ఛానల్,వెబ్సైట్ ను పెట్టుకున్నారు. టెలిగ్రామ్ యాప్ వేదికగా న్యూస్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు. ఫ్రాన్స్‌లో ఉంటున్న జామ్ ను అత్యంత చాకచక్యంగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అధికారులు స్వదేశానికి పిలిపించారు. వాళ్ళ మాటలు నమ్మి అతను ఇరాన్ వచ్చాడు . అదే అతడు చేసిన తప్పు . దాంతో అతడిని అరెస్ట్ చేశారు.
2019 అక్టోబరులో జామ్ ను అరెస్టు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కోర్టు విచారణలో అతగాడు తనపై మోపిన అభియోగాలను ఖండించారు. వాటితో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసారు. తాను మీడియా వర్క్ లోనే నిమగ్నమైనట్టు కోర్టుకి విన్నవించుకున్నాడు.అయినా కోర్టు అతని మొర ఆలకించలేదు.
2020 జూన్‌లో జామ్‌కు మరణశిక్ష విధిస్తూ ఇరాన్ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు తర్వాత జామ్ తండ్రి మహమ్మద్ ఆలీ జామ్ జుడీషియరీ చీఫ్ కు లేఖ రాసారు. తీర్పుఇస్లామిక్ జస్టిస్ కి వ్యతిరేకంగా ఉందని లేఖలో పేర్కొన్నాడు.కోర్టు ఆ లేఖను పట్టించుకోలేదు. శిక్ష అమలు చేస్తూ జామ్‌ను ఉరితీశారు.
————– KNM