ఈ బుల్లెట్ బాబా గురించి విన్నారా ?

Sharing is Caring...

ఇప్పటివరకు మనం పలువురు దేవుళ్ళు , దేవతలకు గుడులు కట్టినట్టు విన్నాం .. చూసాం. ఒక మోటార్ సైకిల్ కి గుడికట్టిన వైనం గురించి విన్నామా? చాలామంది విని ఉండరు. NH-62 జోధ్‌పూర్-పాలి ఎక్స్‌ప్రెస్‌వేలో ఒక మోటార్ సైకిల్ కి గుడికట్టి పూజిస్తున్నారు. రాజస్థాన్ లో ఈ దేవాలయం చాలా ఫేమస్.ఆ రోడ్డు పైన ప్రయాణం చేసే వారంతా తప్పనిసరిగా ఆ మోటార్ సైకిల్ ని దర్శించుకుని వెళతారు. అక్కడ అదొక సెంటిమెంట్ గా కూడా మారింది. 

కష్టాల్లో ఉన్న ప్రయాణికులకు ఇక్కడ ఉండే బుల్లెట్ బాబా సహాయం చేస్తాడని నమ్ముతారు. ఈ బుల్లెట్ గుడి .. అక్కడి బాబా గురించి ఆసక్తికరమైన విషయాలు ప్రచారంలో ఉన్నాయి. ఎక్కడా కూడా ఇలా మోటారు సైకిల్‌ను పూజించడాన్ని చూసి ఉండరు. ఈ గుడిని  ఓం బన్నాధామ్ లేదా బుల్లెట్ బాబా దేవాలయం అని పిలుస్తారు. ఈ గుడి జోధ్‌పూర్ నుండి 50 కిమీ దూరంలో .. పాలి నుండి 20 కిమీ దూరంలోని NH-62 ఎక్స్‌ప్రెస్‌వేలో ఉంది.

దాదాపు 31 సంవత్సరాల క్రితం ఓం సింగ్ రాథోడ్ అనే యువకుడు బంగ్డి నుండి రాజస్థాన్‌లోని పాలి సమీపంలోని చోటిలా గ్రామానికి వెళుతున్నాడు.మార్గమధ్యంలో ఓం సింగ్ రాథోడ్ నడుపుతున్న బైక్ పై  పట్టు కోల్పోయాడు. దీంతో ఆ బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్నది.ఆ ఘటనలో రాథోడ్ అక్కడికక్కడే మరణించాడు. సమాచారం అందగానే పోలీసులు వచ్చి బైక్ ను స్వాధీనం చేసుకున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం కు పంపారు. బైక్ ను తీసుకొచ్చి స్టేషన్ ముందు పెట్టారు.

మరుసటి రోజు బైక్ పార్క్ చేసిన చోట నుంచి అదృశ్యమైంది. పోలీసులు గాలించగా అది ప్రమాద స్థలంలో కనిపించింది. పోలీసులు ఎవరో తుంటరి కుర్రాళ్ళు ఈ పని చేసి ఉంటారని భావించారు. మళ్లీ బైక్‌ను తమ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఆ మరుసటి రోజు కూడా బైక్ మాయమై ప్రమాదం జరిగిన ప్రదేశంలో కనిపించింది. బైక్‌ను పోలీస్ స్టేషన్‌లో ఉంచడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి. ప్రతిసారీ తెల్లవారుజామున బైక్ దానంతటదే ప్రమాద స్థలానికి తిరిగి వెళ్ళేది.

ఓం సింగ్ రాథోడ్ ఆత్మ ఈ బైక్ ను అక్కడికి తీసుకెళ్తున్నదని ప్రచారం మొదలైంది. ఈ సంగతి దావానంలా చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. ఆరోజు నుంచి గ్రామస్థులు ‘బుల్లెట్ బైక్’ని పూజించడం మొదలు పెట్టారు. ఒక చిన్నషెడ్ నిర్మించి ఆలయంగా మార్చారు. బైక్ ను అందులో నిలబెట్టి పూజిస్తున్నారు. ఈ ఆలయానికి బుల్లెట్ బాబా లేదా ఓం బన్నా ధామ్ అని పేరు పెట్టారు.

ఈ గుడి నిర్మించిన తరువాత చోటిలా గ్రామం చుట్టు పక్కల రోడ్డు ప్రమాదాలు బాగా తగ్గాయి అని గ్రామస్తులు విశ్వసిస్తున్నారు. ఓం ఆత్మ ప్రయాణికులను సురక్షితంగా కాపాడుతున్నదని అక్కడి వారు నమ్ముతున్నారు. ఇక్కడి ఆగి నమస్కరించి వెళితే క్షేమంగా గమ్యం చేరుకుంటారని కూడా గ్రామస్థులు చెబుతుంటారు.

అలాగే ఆలయాన్ని పట్టించుకోకుండా … ఇక్కడ ఆగకుండా నేరుగా వెళ్తే ప్రమాదం తప్పదని గ్రామస్తులు అంటున్నారు. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ఆ రోడ్డు పై వెళ్లే ప్రయాణీకులు తప్పనిసరిగా బుల్లెట్ బాబా ను సందర్శించి ముందుకు సాగుతుంటారు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!