Taadi Prakash ……………………………………………….
TELANGANA ROCKSTAR – GORATI VENKANNA…………… రేపు రేపను తీపికలలకు రూపమిచ్చును గానం … చింత బాపును గానం .. ‘పులకించని మది పులకించు ‘ పాటలో ఆత్రేయ ఈ మాటలన్నది . గోరటి వెంకన్న గురించేనా? కొన్ని శ్రావ్యమైన గొంతులు మధురంగా పాడుతున్నపుడు -పున్నాగ పూలు వొయ్యారంగా రాలి పడుతున్నట్టు..చలికాలం రాత్రులు పంటపొలాల మీద వెన్నెల పరుచుకుంటున్నట్టు.. ఒక తెలియని తియ్యని బాధ మనసుని మెలిపెడుతున్నట్టు…ఎలాగో వుంటుంది కదా!
గోరటి వెంకన్న జీర గొంతు వేరు! భగవంతుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున -కొన్ని వయొలిన్ తీగల్నీ, డప్పునీ, దరువునీ …ఒకచోట చేర్చి… కొంచెం నిప్పునీ, కాసిని కన్నీళ్ళనీ కలిపి, దాన్ని పేద జనం చెమటతో తడిపి..ఈ మిశ్రమాన్నొక పాలపుంతలో పెట్టి, ఇంద్రధనస్సుతో వెంకన్నకి కానుకగా పంపించాడేమో! దేవుడెందుకో కొందరు వెర్రివాళ్ళనే ఎంచుకుంటాడు. అన్నమయ్య, బడే గులాం అలీఖాన్, కుందన్ లాల్ సైగల్, షంషాద్ బేగం, చీమకుర్తి నాగేశ్వరరావు, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, సుబ్బారావు పాణిగ్రాహి… ఇలాంటి వాళ్ళే … పాల్ రాబ్సన్, మెహిదీ హసన్, భూపేన్ హజారికా, బాబ్ మార్లే… ఈ కోవలోని వాడే…పాలమూరు రోడ్ల మీద పాడుకుంటూ వెళిపోయే పిచ్చివాడే గోరటి వెంకన్న.
ఎలా రాస్తాడో ఆ పంటకాల్వ లాంటి కవిత్వం! అందులోనే తలవంచని తత్వం. వొట్టి తిరుగుబాటు కవి కాదు. ఒక పారిస్ కమ్యూన్! పాటా కాదది…పెరల్ హార్బర్ మీద యుద్ధ విమానాల మెరుపు దాడి….జర్మన్ రీచ్ స్టాగ్ మీద 1945 లోనే ఎగిరిన జెండా… అతను. పాతికేళ్ళుగా వెంకన్న తెలుసు నాకు. అతని స్నేహితుణ్ణి అనికూడా క్లెయిమ్ చేసుకోగలను. మా అన్నయ్య మోహన్ దగ్గరికి వచ్చేవాడు. కుర్చీలోనే కూర్చోవాలనీ, చుట్టూ జనం వుండాలనీ అనుకునే మనిషి కాదు. ఏ మూలనో చతికిలబడేవాడు. రాసుకుంటూ వుండేవాడు. కొన్ని మాటలు చెప్పేవాడు.
సరదా పాటలు పాడేవాడు. ‘ఏకునాదం మోత ‘ కో, ‘రేలపూతల’ కో బొమ్మ వేయమని అడిగేవాడు. గ్లాసులో ఏం పోసినా తాగేవాడు. కంచంలో ఏం పెట్టినా తినేవాడు. నో కంప్లయింట్స్. బావుందా సార్ పాట? అంటాడు. నీ పాట చాలా బావుంది .. అని ఎలా చెప్పటం గోరటి వెంకన్నతో, సిగ్గు లేకుండా! మరో పాట – అని అడిగేవాళ్ళం. ఖాళీ గ్లాసుని కాస్త ముందుకి జరిపేవాడు. ఎప్పుడూ డిజప్పాయింట్ చేయడు. హృదయాన్ని పాటతో నింపేవాడి గ్లాసు మాత్రమే నింపగల నిమిత్తమాత్రున్ని నేను.
కుదురుగా కూర్చుని బుద్ధిగా బొమ్మలేసుకుంటున్న ఆర్టిస్ట్ మోహన్, తలెత్తి చూస్తే గుమ్మంలో గోరటి వెంకన్న. ” న్యూసెన్స్ రా.. పరమబోరు వీడు ” అనేవాడు మోహన్. వెంకన్న వచ్చి కుర్చీలో సెటిలయ్యి పద్యం అందుకునేవాడు…. ఆరున్నొక్క రాగం… అలా వారాలు, నెలలు, సంవత్సరాలు – వో రెండు దశాబ్దాలు మేం పాలమూరు పాటల వెన్నెల పూలతోటల్లో తిరిగాము. మేం! అంటే …. ఆర్టిస్టులు శ్రీరాం కారంకి, సాక్షి శంకర్, అన్వర్, లెల్లె సురేష్, పైడి తేరేష్, మా చెల్లెళ్ళు శకుంతల, సరళ, శుభ, మా ఆవిడ నళిని, దళిత కార్యకర్త వెంకటేశ్వరరావు, మా కంప్యూటర్ ఆపరేటర్లు మస్తాన్, బిజిన్ బాబు, గుడికందుల భిక్షు, … మోహన్ కోసం వచ్చే ఎందరో, ఎవరెవరో .
వెంకన్న పాట కచేరీ… పూర్తిగా ఉచితం. అప్పటికి ఏదితోస్తే అది పాడేవాడు. అందులోనే ఒక అలవిమాలిన అందం వుండేది. జాషువా అనో, రజనీబాయి చింతామణి అనో… పద్యంలోకి జారిపోవడం, తానే పద్యంగా మారిపోవడం – వెంకన్నకి ఎంత ఇష్టమో . ‘ చింతామణీ ‘ అని భలే అంటాడు. అత్తవారిచ్చిన అంటుమామిడి తోట – ఏంటో ఆ తోట వెంకన్నకే రాసిచ్చినంత సంబరంతో పాడతాడు.
***
మోహన్ అస్సలు తిన్నమైనవాడు కాదు. మొహమ్మీదే అనేస్తాడు… జోవియల్ గా. “నువ్వు బాగా బోరు అబ్బా” అని – వెంకన్నని పట్టుకుని! పాడి, వెంకన్న వెళ్లిపోయాక, ఒకరోజు అడిగాను. ‘ ఎలా? ఆ గొంతు ఎలా సాధ్యం? ‘ అని మోహన్ని.” అది భగవదత్తంరా, సంప్రదాయం తెలిసినవాడు వెంకన్న” అన్నాడు. మోహనూ, నేనూ ఏనాడూ దేవుణ్ణి నమ్మిందీ లేదు.సరదాకి కూడా దణ్ణం పెట్టుకున్న పాపానపోలేదు. వెంకన్న కవిత్వం అంటే ఎంతో ప్రేమతో, శ్రద్ధగా బొమ్మ వేసేవాడు. గడగడా మాట్లాడి, గది కంపించిపోయేలా పాడే వెంకన్న కూడా, మోహన్ మాట్లాడుతుంటే చెవులప్పగించి వినేవాడు. ఆ ఇద్దరు అరుదైన ఆర్టిస్టుల స్నేహాన్ని ఈ తుచ్చమైన కళ్ళతో ఏళ్ళతరబడి చూసి తరించినవాణ్ణి నేను.
మోహన్ దగ్గరికి రెగ్యులర్ గా వచ్చేవాళ్లు : కే ఎన్ వై పతంజలి, తల్లావఝుల శివాజీ, శ్రీరాం కారంకి, గోరటి వెంకన్న, కలేకూరి ప్రసాద్, లెల్లె సురేష్ ఆర్టిస్టులు మృత్యుంజయ, రాజు, పాండు… మేమంతా ఒక ముఠా. కొవ్వెక్కిన సృజనాత్మక గుంపు. ప్రతిదీ వేళాకోళమే. ఏ ఒక్క విషయమూ తిన్నగా మాట్లాడరు. రెటమతం. వంకర మాటలు, క్విక్ రిపార్టీలు, చటుక్కున వో మహాకవినో, రచయితనో కోట్ చేయటం, అరుదైన పద్యాలు అప్పజెప్పటం, వో చరణమో, పల్లవో పాడటం, దాని జ్ఞాపకం చెప్పటం.. ఏమి సాయంత్రాలవి! కన్నీళ్లు వచ్చేలా నవ్విన సందర్భాలెన్నో!
ఎప్పుడన్నా నిజామాబాద్ నించి వచ్చే రచయిత కేశవరెడ్డి, కవి నున్నా నరేష్, జర్నలిస్టు పాశం యాదగిరి, విశాఖ నుంచి డాక్టర్ చందు సుబ్బారావు, పర్స్పెక్టివ్స్ ఆర్కే, కవులు జీవీ రమణ, సిద్దార్థ, ఎమ్మెస్ నాయుడు, అనంత్.. మా గుంపులో కలిసేవారు. కూనపరాజు కుమార్, ప్రసాదమూర్తి, శిఖామణి, వేముల ఎల్లయ్య, దేవులపల్లి కృష్ణమూర్తి, తిప్పర్తి వూదరి వెంకన్న మా పాటకచేరీ సభ్యులు… అలా ఎందరెందరో వున్నా అక్కడ ప్రత్యేకమైంది వెంకన్న పాటే!
నా నల్లని గుండె, రెక్కలల్లార్చే తెల్లని కొంగయి… దుందుభి నదికి అడ్డంపడి ఎగిరిపోతున్నట్టు పాడటం ఎవరికి సాధ్యం?గోరటి వెంకన్న గొంతు వింటున్నప్పుడు …ఏటి వొడ్డున తడి ఇసకలో వొట్టి పాదాలతో నడుస్తున్నట్టు..వేంకటేశ్వరుని దర్శనం కోసం ఏడుకొండలూ ఎక్కి వెళుతున్నట్టు..సున్నిపిండితో నలుగు పెట్టుకుని, కుంకుడు రసంతో వేడినీళ్ళ స్నానం చేస్తున్నట్టు ..ప్రియురాలి చనుమొనలు ఛాతీని తాకి, ఒక గరుకుగరుకు పులకింత నరాల్లో ప్రవహించినట్టు.. కరీంనగర్ అడవి వీచే ఆకుపచ్చని సంగీతాన్ని గుండెల్లో వొంపుకుంటున్నట్టు..తరతరాల దళిత జనం వేదనల దుఃఖాశ్రువులు ముంచెత్తుతున్నట్టు … ఎండలో ఎర్రజెండాల వూరేగింపులో… కూటికి లేని కూలిజనంతో కలిసి నడుస్తున్నట్టు …
శ్రీశ్రీ విన్న నక్షత్రాంతర్నిబిడ నిఖిలగానాన్ని దోసిళ్ళతో పట్టుకుని ఆత్మని నింపుకుంటున్నట్టు .. ఎంత అదృష్టం ఈ జన్మకి!
Read Also ……………………………. నివురులేని నిప్పుకణిక ! (2)