Govardhan Gande………………………………………..
ఎవరీ కొత్త దేవుడు? ఇంకెవరు రేవంత్ రెడ్డి! తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త సారథి. కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త దేవుడే అనాలి మరి. ఇది పార్టీ వారి మాట. నా మాట కాదు.ఎందుకంటే రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సారథి అయ్యాడు కనుక. దేవుడు అనే బిరుదు అతిశయోక్తి కాదా? వారి దృష్టిలో అదే మరి.ఈ సందర్భానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దేవుడిలాగే కనిపిస్తున్నాడాయన. ప్రభుత్వాన్ని,దాని విధానాలను పదునైన మాటలతో చీల్చి చెందాడగలడు అనే ప్రచారం పొందాడాయన. కొన్ని సార్లు అలా చేసి పేరుపొందాడు కూడా. విషయాన్ని విడమరిచి జనంలోకి తీసుకుపోగల నేర్పు కలిగి ఉన్నాడని పార్టీలో కొందరి విశ్వాసం.
ఎలాంటి వెరపు లేని వాడని పేరొందాడు. వారికి ఆయన “దేవుడి “లాగానే కనిపిస్తున్నాడు మరి. పార్టీకి పూర్వపు వైభవాన్ని తీసుకురాగల శక్తి కూడా ఆయనలో మాత్రమే ఉందని కూడా పార్టీలోని పలువురి విశ్వాసం. 40 ఏళ్లకు పైగా ఇక్కడ అధికారం చలాయించిన పార్టీకి సారథ్యం అంటే మాటలు కాదు.అది చిన్న పదవీ కాదు. బాధ్యత చాలా పెద్దది. ఈ సారథ్యం పూల బాట కాదు. పార్టీలో ఉన్న ఎన్నో వర్గాలను, అసంతృప్తి,అసమ్మతులను తెర వెనుక కుట్రలను నెగ్గుకురావడం, “హైకమాండ్” రిమోట్ అధికారం/ పెత్తనాన్ని భరిస్తూ నిలదొక్కుకోవడం అంత సులభమైన పనేమీ కాదు.
సుదీర్ఘ కాలం తరువాత ఓ యువకుడికి పార్టీ పగ్గాలను అప్పగించడం కూడా కాంగ్రెస్ చరిత్రలో కొత్త సంగతే మరి. ఇప్పటి స్థితిలో పార్టీని నడపడం అంత ఈజీ ఏమీ కాదు. ఎంతో ఆర్థిక బలం అవసరం.ఆ ఆర్థిక వనరులను సమీకరించడం, ప్రభుత్వంపై పోరాటానికి సద్వినియోగం చేయడం అంత సులభమైన లక్ష్యం కూడా కాదు. ఇప్పుడాయన పోరాడవలసింది ఎంతో ప్రజాబలం ఉన్న అధికార పార్టీపైన. దాన్ని ఎదుర్కోవడం అంటే కొండతో ఢీకొనడంతో సమానం.
వీటన్నిటినీ అధిగమిస్తూ పార్టీలోని నాయకులందరినీ సమన్వయం చేస్తూ సారథ్యం నిర్వహించడం సముద్రాన్ని ఈదడం లాంటిదే అని చెప్పాలి. ఇంతే కాక ఆయనపై “ఓటుకు కోట్లు” అనే అవినీతి/మచ్చ కేసు కూడా ఉన్నది.కేసులో ఈయనే ప్రధాన ముద్దాయి కూడా.ఈ అవినీతి మచ్చ అంత సులభంగా చేరిగిపోయేది కాదు.కోర్టులు ఏమి నిర్ణయిస్తాయనేది వేరే సంగతి.
కానీ జనం దాన్ని ఎలా చూస్తారనేదే ఇపుడిక్కడ విషయం. ఆయన పై ఇంకో ముద్ర కూడా ఉన్నది. చంద్రబాబు మనిషి అని. ఈటల ను బీజేపీలోకి పంపింది కేసీఆర్ అని రేవంత్ఎలాగైతే అంటున్నారో … ఈయనను కాంగ్రెస్ లోకి పంపింది చంద్రబాబే అని అంటారు. ఇప్పటికే తెలంగాణలో తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ చెందిన మనిషిగా పడిన ముద్ర ఇంకా తొలగిపోలేదు. అదలావుంటే మరోవైపు జాతీయ అధికార పార్టీ బీజీపీ దూకుడును కూడా ఆయన నిలువరించగలగాలి.ఇది సాధారణ సమయం కూడా కాదు.
పగ్గాలు చేపట్టగానే హుజూరాబాద్ ఉప ఎన్నిక కూడా ఈ “కొత్త కెప్టెన్ కి ” ఓ కీలకమైన పరీక్షే అని చెప్పాలి. ఈ పరీక్ష లో నెగ్గడం కూడా వీజీ కాదు. ఇన్ని పరీక్షలను నెగ్గుకొని 2023 సాధారణ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీని సమాయత్తం చేయవలసిన బాధ్యత రేవంత్ పై ఉన్నది.అయితే రేవంత్ తన దూకుడు తో హడావుడి చేయడం మాత్రం ఖాయం. రేవంత్ దూకుడు పెంచే కొద్దీ అటు బీజేపీ ఇటు తెరాస నేతలు దూకుడు పెంచుతారు. రోజూ కేసీఆర్ పై విమర్శలు వినిపిస్తూనే ఉంటాయి. అటు బీజేపీ , ఇటు కాంగ్రెస్ తో తెరాస నేతలు వాగ్యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. “ఓటుకు నోటు “వ్యవహారం తెరాస నోట తారక మంత్రం అవుతుంది.