సెక్స్ వర్కర్ల పై తాలిబన్ల కన్ను !

Sharing is Caring...

ఆఫ్ఘన్ లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయమని తాలిబన్లు మొదటి నుంచి చెబుతున్నప్పటికీ ఆ మాట నిలబడటం లేదు. దేశ భద్రత కోసం…  ప్రజల హక్కుల కోసం పాటు పడతామని అంటున్నప్పటికీ  అధికార పగ్గాలు చేపట్టిన ఉగ్రవాదులు అలా వ్యవహరించగలరా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. అమెరికా మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న మహమ్మద్‌ హసన్‌ అఖుంద్‌ ప్రధానిగా .. హక్కానీ నెట్‌వర్క్‌ చెందిన అబ్దుల్‌ సలామ్‌ హనీఫ్‌ మరో ఉప ప్రధానిగా నియమితులు కావడంతో ప్రజలు మరింత భయపడుతున్నారు.

ఇప్పటికే తాలిబన్లు తమ క్రూరవైఖరిని చాటుకున్నారు.షరియా చట్టాలను అడ్డం పెట్టుకుని మహిళల పట్ల అత్యంత దయనీయంగా వ్యవహరిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఒక మహిళా పోలీసు అధికారిని .. గర్భిణీ అని చూడకుండా.. పిల్లల ముందే కిరాతకం గా కాల్చివేశారు. ఈ ఘటనను బట్టే తాలిబన్ల మాటలకు చేతలకు పొంతన లేదని తెలిసిపోతున్నది. తాజాగా సెక్స్ వర్కర్లను టార్గెట్ గా చేసుకుని వారికి క్రూరమైన శిక్షలు వేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు ప్రచారం లో కొచ్చాయి.

ఇప్పటికే మహిళలపై ఆంక్షలు విధించిన తాలిబన్లు దేనికైనా తెగించే సాహసం చేస్తారనడంలో సందేహం లేదు. షరియా చట్టాలను అమలు చేసే ప్రక్రియలో భాగంగా ఆఫ్ఘన్ లోని  సెక్స్ వర్కర్ల జాబితాను తాలిబన్లు సిద్ధం చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. షరియా చట్టాల మేరకు సెక్స్ వర్కర్లకు బహిరంగ మరణశిక్ష విధించే యోచనలో తాలిబన్లు ఉన్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నిబంధన పురుషులకు .. తాలిబన్లకు వర్తించదు. కేవలం మహిళలను మాత్రమే బలిపశువులను చేస్తారని అంటున్నారు. 

1996 నుంచి 2001 వరకు తాలిబన్లు అధికారంలో ఉన్న సమయంలో పలువురు సెక్స్ వర్కర్లకు బహిరంగ ప్రదేశాల్లో మరణశిక్ష అమలు చేశారు. మళ్ళీ అదే బాటలో తాలిబన్లు నడిచే అవకాశాలు ఉన్నాయి. ఆఫ్ఘన్ లో అధికారం కోల్పోయాక కూడా తాలిబన్లు మహిళల పట్ల తమ క్రూరత్వాన్ని పలు సందర్భాల్లో చాటుకున్నారు. పర పురుషులతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళలను తాలిబన్లు అత్యంత కిరాతకంగా అంతమొందించారు. 

కానీ వేశ్యలతో సంబంధాలు పెట్టుకున్న పురుషులను మాత్రం వారు ఏమీ చేయలేదు. తాలిబన్లు తమ అవసరాలకు సెక్స్ వర్కర్లను ఉపయోగించుకుంటారు కానీ వారికి నిబంధనలు వర్తించవు అంటారు. ఈ విషయంలో తాలిబన్ల లోనే విభేదాలున్నాయి. అయితే ఉదారవాదుల మాట చెల్లదు. ఆఫ్ఘన్ లో వేశ్యా వృత్తి పై నిషేధం ఉంది.

కరువు దేశం కావడంతో ఏ పనీ దొరకదు. భర్తలు లేని .. వదిలేసిన మహిళలు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వృత్తిలోకి దిగి పిల్లలను పోషించుకుంటున్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఆఫ్ఘన్ దేశం మొత్తం మీద పెద్ద సంఖ్యలోనే సెక్స్వర్కర్లు ఉన్నారు. ప్రభుత్వ గణాంకాలు తక్కువగా చూపిస్తున్నాయి. విదేశీ మహిళలు ఇక్కడ కొచ్చిసెక్స్ వర్క్ చేస్తున్నారు. మహిళల అక్రమరవాణా కూడా ఇక్కడ జరుగుతోంది. 

————-KNM

 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!