తైవాన్ పార్లమెంట్ రణరంగం గా మారింది. సభ్యులు పరస్పరం దాడులకు దిగారు. అమెరికా నుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. ఈ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. అంతటితో ఆగకుండా ఒకరిపై ఒకరు మాంసం ముద్దలు విసురుకుంటూ, పిడిగుద్దులకు దిగారు. దీంతో సభలో కొంత సేపటి వరకు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
KMT నేషనలిస్ట్ పార్టీకి చెందిన ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యులు పంది మాంసం సంచులను సభలోకి తెచ్చి మాట్లాడేందుకు ప్రయత్నించగా అధికార DPP సభ్యులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సభలో సభ్యులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అధికార డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీకి చెందిన సభ్యులు వారిని ఆపడానికి ప్రయత్నించారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం దరిమిలా పంది మాంసం దిగుమతిపై నిషేధం ఎత్తివేసింది. ఈ అంశం తాజాగా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష సభ్యులు పంది మాంసం బ్యాగులను సభలోకి తీసుకొచ్చి గందరగోళం సృష్టించారు. పంది, గొడ్డు మాంసం దిగుమతిపై తైవాన్ ప్రభుత్వం నిషేధం ఎత్తివేయడంపై దేశంలో పలు చోట్ల నిరసన లు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే పార్లమెంట్ లో ఈ అంశం చర్చకు వచ్చి గొడవకు దారి తీసింది.