Bharadwaja Rangavajhala …………………………..
ఏ పాత్ర అయినా అందులోకి పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకుల మన్ననలు పొందిన సాటి లేని మేటి నటుడు ఎస్వీ రంగారావు. దర్శకుడు చెప్పిన రీతిలో నటించి అందరిని మెప్పించిన నటుడు ఆయన. కీచకుడిగా,రావణుడిగా,ఘటోత్కచుడిగా, హిరణ్యకశపుడిగా, కంసుడిగా,దుర్యోధనుడిగా, నరకాసురుడిగా ఇలా ఏ పౌరాణిక పాత్ర చేసినా తనదైన శైలిలో .. కేవలం పాత్ర మాత్రమే కనబడేలా ప్రాణ ప్రతిష్ట చేశారు ఎస్వీఆర్.
స్వరం లో గాంభీర్యం, మాటలో స్పష్టత, డైలాగు విరిచి చెప్పడం లో విభిన్న శైలి … ఎస్వీఆర్ ది ఒక యూనిక్ స్టైల్. అందుకే ఆయన చేసిన పాత్రలన్నీ అజరామరంగా నిలిచి పోయాయి. ఆయన మన మధ్య నుంచి వెళ్ళిపోయి దాదాపు 47 ఏళ్ళు అవుతున్నా ఈనాటికి ఆయన గురించి చెప్పుకుంటున్నామంటే .. అది ఎస్వీఆర్ ప్రేక్షకులపై వేసిన ముద్ర.
పాత్రకు న్యాయం చేసేందుకు ఎస్వీఆర్ ఎంత కష్ట పడతారో ఒక ఉదాహరణ చెప్పుకుందాం. సంపూర్ణ రామాయణం సినిమా షూటింగ్ జరుగుతున్న రోజుల నాటి మాట. రావణ పాత్రలో ఎస్వీఆర్ మీద శివస్త్రోత్రమ్ చిత్రీకరిస్తున్నారు. క్లోజప్పులున్నాయి. మీరు లిప్ మూమెంట్ కరక్ట్ గా ఇవ్వాల్సి ఉంటుందని సహకార దర్శకుడు రావు గారు ఎస్వీఆర్ గారికి చెప్పారట.
మాధవపెద్ది పాడిన …
జటాకటాహసంభ్రమభ్రమన్ని లింపనిర్ఝరీ-
-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వ లల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతి: ప్రతిక్షణం మమ అన్న శివతాండవ స్తుతిలోని బిట్ ను నాలుగైదు సార్లు వినిపించారట … అయినా ఎస్వీఆర్ కు కుదరడం లేదు.
లాభం లేదని … కెమేరాకు కనిపించకుండా క్లోజప్పులు వచ్చే దగ్గర నేను అనాల్సిన మాటలను ఓ బల్లమీద రాసి పెట్టొచ్చు కదా అన్నారట ఎస్వీఆర్.ఓకే అని రావు గారు రాసి పెట్టారట … అలా రెండు మూడు రిహార్సల్స్ అయ్యాయి. బావుంది అనుకుని షాట్ పెట్టేయమన్నారట.
సరిగ్గా అప్పుడు బాపుగారు … రావణాసురుడు కళ్లజోడు పెట్టుకున్నట్టు నేనెక్కడా చూళ్లేదు అన్నారట …
కళ్లజోడు తీస్తే … గురువుగారికి బోర్డు మీద రాసిన అక్షరాలు కనిపించవు …అందుకని ఇలా అంటూ నసిగారట రావుగారు . విషయం అర్ధమై దాంతో ఎస్వీఆర్ క్లోజప్ లైన్లు ఒకటికి రెండు సార్లు మనసులో అనుకుని రావు గారికే ఒప్పచెప్పి మరీ షాట్ చేసి ఓకే అనిపించారట . ఒక పత్రికలో కె.వి.రావు ఈ విషయం స్వయం గా రాశారు. ఎస్వీఆర్ అసమాన నటన వైభవానికి సంపూర్ణ రామాయణం దర్పణం పడుతుంది.