రాజకీయాలు అందరికి కలసి రావు. తమిళనాట శివాజీ గణేశన్ పెద్ద హీరో .. నటనలో ఆయనను మించిన వారు లేరు. కానీ రాజకీయాల్లో ఇసుమంత ప్రభావంకూడా చూప లేకపోయారు. తమిళనాట రాజకీయాలది సినిమాలది విడదీయలేని బంధం. ఎప్పటి నుంచో ఆ అనుబంధం కొనసాగుతోంది.
కరుణానిధి, ఎంజీఆర్ ల హవా కొనసాగుతున్న సమయం లోనే సుప్రసిద్ధ నటుడు శివాజీ గణేశన్ కూడా రాజకీయాల్లో తన సత్తా చూపాలని ప్రయత్నించారు. అయితే విజయం సాధించలేకపోయారు. కాలం కలసి రాక రాజకీయాల్లో డబ్బుకూడా పోగొట్టుకున్నారు.
మొదట్లో శివాజీగణేశన్ కూడా డి.ఎమ్.కె. పార్టీలోనే ఉండేవాడు. ఆయన తొలి చిత్రం ‘పరాశక్తి’ ఆ సినిమాకు రచయిత కరుణానిధి. డీఎంకే పార్టీ భావాలకు తగినట్టుగా సినిమాలకు కరుణానిధి డైలాగులు రాసేవారు. సినిమారంగంలో శివాజీ, ఎంజీఆర్ పోటీ పడేవారు. ఎమ్.జి.ఆర్. సూపర్ స్టార్ గా ఎదిగిన తరువాత మాస్ లో ఆయనకున్న ఫాలోయింగ్ ను చూసి కరుణానిధి ఎంజీఆర్ ను కూడా పార్టీ లోకి ఆహ్వానించారు.
ఇది నచ్చని శివాజీగణేశన్ బయటకొచ్చి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తరువాత ఎంజీఆర్ కూడా 1972 లో డి.ఎమ్.కె. నుండి బయటకొచ్చి సొంతంగా ‘అన్నా డి.ఎమ్.కె. పార్టీ’ పెట్టారు. 1977 అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎంజీఆర్ తో శివాజీగణేశన్ సారధ్యంలోని కాంగ్రెస్ పోటీపడింది. అయితే ఎంజీఆర్ విజేతగా నిలిచారు.
రాజ్యసభ ఎంపి నర్గిస్ దత్ 1981 లో కన్నుమూసారు. ఆ సీటు శివాజీకి దక్కింది. రాజ్యసభ సభ్యులు అయ్యారు. 1988 లో ఎఐఎడిఎంకె అంతర్గత గొడవలో జయలలిత,జానకి రామచంద్రన్‌లలోఎవరికి మద్దతు ఇవ్వాలా అనే అంశంపై తమిళ కాంగ్రెస్ రెండు ముక్కలైంది. దాంతో శివాజీ బయటికొచ్చారు.
‘తమిళగ మున్నేట్ర మున్నని’ పేరిట కొత్త పార్టీ పెట్టారు. తమిళనాట అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసిన ఆయన పార్టీ పరాజయం పాలైంది. తిరువయ్యారు బరిలో నిలిచిన శివాజీ గణేశన్ 10,643 ఓట్ల తేడాతో డిఎంకె అభ్యర్థి చంద్రశేఖరన్ దొరై చేతిలో ఓడిపోయారు.
ఆనాటి ఎన్నికల్లో శివాజీ ఎంజీఆర్ భార్య జానకీరామచంద్రన్ కి మద్దతు పలికారు. ఎవరినైతే వ్యతిరేకించారో ఆయన భార్య కే మద్దతు ఇవ్వడం విశేషం. ఆ విషయంలో రాంగ్ స్టెప్ వేశారు. ప్రజలు జయలలిత కు అనుకూలంగా ఓటింగ్ చేశారు.
ఫలితాలు వ్యతిరేకంగా రావడం తో శివాజీ పార్టీని వీపీ సింగ్ ఆధ్వర్యంలోని జనతాదళ్లో విలీనం చేసి కొన్నాళ్ళు తమిళనాడు జనతాదళ్ శాఖ అధ్యక్షులుగా చేశారు. ఆ తర్వాత రాజకీయాలను విడిచి పెట్టారు. కరుణానిధిని. ఎంజీఆర్ ను, జయలలితను రాజకీయంగా ఎదుర్కోలేకపోయారు. నటుడిగా ఆయనను ఆదరించిన ప్రజలు రాజకీయంగా తిరస్కరించారు.
————— KNM
No Responses