Ganga Sagar Mela……………………………………..
పశ్చిమ బెంగాల్ లోని గంగాసాగర్‌లో ప్రతి ఏటా నిర్వహించే మేళా రెండు రోజుల క్రితం మొదలైంది. ప్రతి సంవత్సరం లాగానే ఈ సారి కూడా లక్షలాది మంది భక్తులు పాల్గొంటున్నారు, ఒక వైపు కరోనా మరోవైపు ఓమిక్రాన్ భయ పెడుతున్నప్పటికీ భక్తులు లెక్కచేయడం లేదు. పెద్ద ఎత్తున తరలి వచ్చిన దృశ్యాలను ఫోటోలలో చూడవచ్చు. బెంగాల్ లో కేసులు పెరుగుతున్నప్పటికీ ఈ మేళాకు అనుమతి ఇచ్చారు.
గంగాసాగర్ హిందువుల పుణ్యక్షేత్రం. ఇది సాగర్ ద్వీపంలో ఉంది. ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున (జనవరి 14), గంగా నది .. బంగాళాఖాతం సంగమం వద్ద పవిత్ర స్నానాలు చేయడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. తర్వాత అక్కడే ఉన్న కపిల్ ముని ఆలయంలో పూజలు చేస్తారు. ఇక్కడ స్నానం చేస్తే వంద అశ్వమేధ యాగాలు .. వెయ్యి ఆవులను దానం చేసిన పుణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం.
గంగోత్రి లో పుట్టిన గంగా నది ఇక్కడ సముద్రం లో కలుస్తుంది. అందుకే ఈ ప్రాంతాన్ని గంగా సాగర్ అని పిలుస్తారు. కొన్ని వేల ఏళ్ళ నుండి ఏటా ఇక్కడ మకర సంక్రాంతి నాడు మేళా జరుగుతుంది. కలకత్తా హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ మేళా నిర్వహణకు అనుమతి ఇచ్చింది. మొత్తం సాగర్ ద్వీపాన్ని నోటిఫైడ్ ప్రాంతంగా ప్రకటించారు.
కోవిడ్ నిబంధనలకు కట్టుబడి ఉండేలా మేళా ను పర్యవేక్షించేందుకు ఇద్దరు సభ్యుల కమిటీని కూడా ధర్మాసనం ఏర్పాటు చేసింది.72 గంటల్లోపు నెగిటివ్ RT-PCR రిపోర్ట్ ఉన్న భక్తులకు మాత్రమే ఉత్సవాల్లో పాల్గొనడానికి అనుమతి ఇస్తున్నారని అధికారులు చెబుతున్నారు.కానీ లెక్కలేనంత మంది యాత్రికులు తరలి వస్తున్నారు.
డ్రోన్ల ద్వారా పవిత్ర జలాన్ని చల్లేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ సాధువులు స్నానాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వారిని అడ్డుకోలేకపోతున్నామని స్వయంగా బెంగాల్ ఇన్‌ఛార్జ్ మంత్రి బంకిమ్ చంద్ర హజ్రా నే చెబుతున్నారు. ఈ గంగాసాగర్ మేళా “సూపర్ స్ప్రెడర్” ఈవెంట్‌గా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి మేళాలలో ఆంక్షలు పాటించడం కష్టమే.