సూపర్ హిట్ సైన్స్‌ఫిక్షన్‌ మూవీ !!

Sharing is Caring...

An entertaining sci-fi movie  …………………….

మాస్‌ మసాలా యాక్షన్‌ సినిమాలు నిర్మితమౌతున్నకాలమది.ఆ ధోరణికి పూర్తి భిన్నంగా టైమ్‌ మెషీన్‌ నేపథ్యంలో సైన్స్‌ఫిక్షన్‌ కథాంశంతో రూపొందిన సినిమా ఈ ఆదిత్య 369’. అప్పట్లో జనాదరణ పొంది సంచలనం సృష్టించిన చిత్రం ఇది.

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం బాలయ్య సినీ ప్రస్థానం లో మైలురాయిగా నిలిచింది. ఈ సినిమా విడుదలై (18 జూలై 1991న) ఇప్పటికి 33 ఏళ్ళు అవుతోంది.

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ కి ఎస్పీ బాలు సింగీతం వద్ద మంచి స్టోరీ లైన్ ఉంది వెళ్లి కలవమన్నారు. ఆయన సింగీతం గారిని కలవగానే ట్రైమ్‌ ట్రావెలింగ్‌ మీద ఓ లైన్ చెప్పారు. టైం మిషన్ అనే ఆంగ్ల నవల స్పూర్తితో సింగీతం ఈ కథ తయారు చేశారు. కృష్ణదేవరాయలు టైమ్‌ అనగానే నందమూరి బాలకృష్ణ తప్ప మరెవరూ చెయ్యలేరని అనుకున్నారు.

తర్వాత బాలకృష్ణ ను కలిసి కథ చెప్పగానే ఆయన వెంటనే చేద్దామని మాటిచ్చారు.వెంటనే ప్రాజెక్టు మొదలైంది. జంథ్యాల సంభాషణలు,ఇళయరాజా సంగీతం, వేటూరి,సిరివెన్నెల, వెన్నెలకంటి సాహిత్యం సమకూర్చారు.

ఈ సినిమా చిత్రీకరణకు 110 రోజులు పట్టింది. మొదట పి.సి.శ్రీరామ్‌ ఛాయగ్రాహకుడు. ఆయనకి సర్జరీ జరగడంతో VSR స్వామి,కబీర్‌లాల్‌ ఆ బాధ్యతలు స్వీకరించారు.కోటి ముప్పై లక్షల రూపాయిలు బడ్జెట్‌ అనుకుంటే.. మరో 30 లక్షల బడ్జెట్‌ పెరిగింది.ఎస్పీ బాలు కూడా ఈ సినిమాకు పెట్టుబడి పెట్టారు.

తొలుత ఈ సినిమాకు  ‘యుగపురుషుడు’, ‘ఆదిత్యుడు’ అనే టైటిళ్లు అనుకున్నారు. తర్వాత ఆదిత్య 369 ఫైనల్ అయింది.ఇందులో కృష్ణదేవరాయలుగా బాలకృష్ణ నటన చూసి ఎన్టీఆర్‌ మురిసిపోయారు.

విలన్గా అమ్రేష్పురి, టిన్ను ఆనంద్‌, తెనాలి రామకృష్ణుడిగా చంద్రమోహన్ ,హీరోయిన్ గా మోహిని, సుత్తి వేలు ఇతర పాత్రధారులు తమ పాత్రలకు న్యాయం చేశారు.తొలుత  హీరోయిన్ గా విజయశాంతి ని అనుకున్నారు.డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో మోహిని ని తీసుకున్నారు.

ఈ సినిమాలో భువన విజయం సభా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రాయలు వారు, తెనాలి రామకృష్ణ సభలోకి ప్రవేశించే సీన్స్ బాగుంటాయి.బాలకృష్ణ నిర్మాత దర్శకుల అంచనాల మేరకు దేవరాయల పాత్రకు బాగా సూట్ అయ్యారు.తండ్రి ఎన్టీఆర్ చేసిన పాత్ర కాబట్టి బాలయ్య కూడా ప్రెస్టీజియస్ గా తీసుకుని నటించారు. ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో నటించారు.  

రాజనర్తకి గా సిల్క్ స్మిత బాగా చేసింది. సభలో సిల్క్ స్మిత,మోహినీ పోటీ పడే చేసే నృత్యం సీన్లను ఆకర్షణీయంగా తెరకెక్కించారు సింగీతం. బాలయ్య , మోహినీ చేసే రాకెన్ రోల్ డాన్సు సభను షేక్ చేసే సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. భువనవిజయం సన్నివేశాలలో రాయలు వారిగా బాలకృష్ణ నటన బాగుంటుంది. జంధ్యాల డైలాగులు సంగతి చెప్పనక్కర్లేదు.

“మేక తోక,తోక మేక” అంటూ నరస కవిని ఇబ్బంది పెట్టె సన్నివేశాలు బాగా వచ్చాయి. తెనాలి రామకృష్ణ తో పాటు బాలయ్య  కలసి నరస కవి ని టీజ్ చేసే నన్నివేశాలను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే రాయలు వారు ‘బలరాముడు సీతను చూసి నవ్వెన్ ‘ అంటూ సమస్యను ఇచ్చి పూరించమనడం.. రామకృష్ణుడు పూరించే సీన్ కూడా ఆకట్టుకుంటుంది.

రాసలీల వేళ రాయబారమేల, సురమోదము, సెంచురీలు కొట్టే వయస్సు మాది,జాణవులే నెరజాణవులే పాటలు బాగుంటాయి. ఇళయరాజా మంచి ట్యూన్స్ ఇచ్చారు. బాక్గౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ గా నిలుస్తుంది.

ఈ చిత్రాన్నితమిళంలోకి ‘అపూర్వ శక్తి 369’గా డబ్ చేసారు. తమిళనాట కూడా విజయాన్ని అందుకుంది.కాగా ‘ఆదిత్య 369’ కు సీక్వెల్గా ‘ఆదిత్య 999’ రాబోతోంది . మోక్షజ్ఞ తేజ హీరోగా యాక్ట్ చేయనున్నాడు.

దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.త్వరలోఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అన్నీ కుదిరితే 2025లో విడుదల చేసే అవకాశం ఉంది’ అని బాలయ్య కొద్దీ రోజుల క్రితం ప్రకటించారు.ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది.. చూడని వారు చూడవచ్చు.. చూసిన  వారు మళ్ళీ చూడవచ్చు.

———–KNM   

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!