Ramana Kontikarla ………………….
డానీ డెంజోగ్పా… హిందీ సినిమాలే కాదు.. తెలుగు లోనూ విలన్ గా అలరించిన నటుడు. అగ్నిపథ్, క్రాంతివీర్, ఘాతక్ వంటి సినిమాల్లో ప్రభావవంతమైన పాత్రలతో బాగా పేరు తెచ్చుకున్న యాక్టర్. అంతం, రోబో వంటి పలు తెలుగు సినిమాల్లోనూ నటించిన డ్యానీ విలన్ గా ఎంత సుపరిచితుడో… బీర్ల వ్యాపారిగా మాత్రం చాలామందికి అపరిచితుడు.
1987లో డానీ తన స్వస్థలమై యుక్సమ్ పేరుతోనే.. సిక్కింలో మొట్టమొదట యుక్సమ్ బ్రూవరీస్ ప్రారంభించాడు. జస్ట్ బీర్ ఫ్యాక్టరీ నెలకొల్పడమే కాదు.. దాన్ని ఇండియాలో నంబర్ 3 పొజిషన్ కు తీసుకొచ్చిన వ్యాపారి, నేర్పరి డానీ.
బాలీవుడ్ స్టార్ డమ్ నుంచి బ్రూవరీస్ వ్యాపారిగా….
1971లో జరూరత్ సినిమాతో బాలీవుడ్ రంగప్రవేశం చేసిన డానీ.. లవ్ స్టోరీ, ఖుదాగవా వంటి సినిమాల విజయాలతో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఓవైపు వెండితెరపై విలన్ గా అలరిస్తున్న సమయంలోనే… దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవానుకున్నాడు. అలా తాను మంచి బూమ్ లో ఉన్న కాలంలోనే బ్రూవరీస్ వైపు అడుగులేశాడు.
వ్యాపారిగా ఎదిగేందుకు 1987లో యుక్సమ్ బ్రూవరీస్ పరిశ్రమను నెలకొల్పి.. సిక్కిం స్థానిక అభిరుచులకు అనుగుణంగా బీర్లను తయారుచేశాడు.డాన్స్ బర్గ్ 16000, జూమ్, హిమాలయన్ బ్లూ వంటి 11 విభిన్న బ్రాండ్స్ తో బీర్ మార్కెట్ లోకి ఎంటరయ్యాడు. అనతికాలంలోనే ఈశాన్యరాష్ట్రాల్లోని మార్కెట్ ను శాసించే స్థాయికి ఎదిగాడు.
ఈశాన్య మార్కెట్ లో ఆధిపత్యం, విస్తరణ!
2005లో డానీ ఒడిశాలో డెంజాంగ్ బ్రూవరీస్ను స్థాపించాడు. అలా తన కార్యకలాపాలను విస్తరించాడు. 2009 నాటికి ఈశాన్య బీర్ మార్కెట్ ను తన యుక్సమ్ బ్రూవరీస్ వైపు పూర్తిగా ఆకర్షించి లాభదాయక వ్యాపారంగా మార్చేశాడు. అప్పటికే భారతదేశంలో విజయమాల్యా యునైటెడ్ బ్రూవరీస్ హవా నడుస్తున్న రోజులవి.
అస్సాంలోని రైనో ఏజన్సీని కూడా కొనుగోలు చేసి.. ఈశాన్య మార్కెట్ లోకి కూడా విజయ్ మాల్యా ప్రవేశించాలని ప్రయత్నించాడు.కానీ, సినిమాల్లో అప్పటికే తెలివైన విలన్ గా నటిస్తున్న డానీ… అంతకుముందే ఆ విషయాన్ని తెలుసుకుని విజయ్ మాల్యా ఒప్పందాల కంటే ముందే అప్రమత్తమయ్యాడు.
తానే రైనో ఏజెన్సీని కొని… ఈశాన్య రాష్ట్రాల్లో యునైటెడ్ బ్రూవరీస్ అడుగు పెట్టకుండా చేసి నిజ జీవితంలోనూ తన విలనీ చేష్టలతో బీర్ మార్కెట్ లో రారాజైనాడు. విలన్ కాస్తా ఏకఛత్రాధిపత్యం సాగించే హీరో అయిపోయి కూర్చున్నాడు.దాంతో ఈశాన్య రాష్ట్రాల్లో డానీ యుక్సమ్ బ్రూవరీస్ ఓ తిరుగులేని శక్తిగా ఎదిగింది. యుక్సమ్ బీర్స్ స్థానాన్ని సుస్ధిరం చేసింది. బీర్ల పరిశ్రమలో తనకెదురెవ్వరూ పోటీలో లేకుండా చేసింది.
సిక్కిం ఆర్థిక వ్యవస్థకూ ఆలంబనగా!
సిక్కిం వంటి ఈశాన్య రాష్ట్రంలో అక్కడి ఆర్థిక వ్యవస్థకూ యుక్సమ్ బ్రూవరీస్ తోడ్పాటైంది. సిక్కిం ఎక్స్ ప్రెస్ 2022 నివేదిక ప్రకారం 250 మందికి ఉపాధి కల్పించడంతో పాటు, ఏటా వంద కోట్ల రూపాయల ఉత్పత్తితో ఆర్థికవ్యవస్థలో వెన్నుదన్నుగా నిల్చింది. కంపెనీ వ్యాపార నమూనా.. డానీ సంస్థ సంపద స్థిరంగా పెరగడానికీ.. అలాగే, స్థానిక సమాజానికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పనకు ఉపయోగపడింది.
వైవిధ్యమైన రకాలతో బ్రూవరీస్ లో విజయం!
యుక్సమ్ బ్రూవరీస్ తీసుకొచ్చిన బీర్లలో హీమ్యాన్ 9000, ఇండియా స్పెషల్ వంటి బీర్లతో స్థానికంగా మద్యం బాబుల అభిరుచి కనుగుణంగా మార్కెట్ లోకి విస్తరించింది. ధరల్లో కూడా ఇతర బ్రాండ్స్ తో పోలిస్తే కాస్త అందుబాటులో ఉండటం కూడా డానీ వ్యాపార విస్తరణకు మరింత కలిసివచ్చింది. 6 లక్షల 80 వేల హెక్టోలీటర్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో యూక్సమ్ బ్రూవరీస్ భారతీయ బీర్ కంపెనీల్లో మూడో స్థానంలో నిల్చింది. యుక్సమ్ కంటే ముందు ఉన్నవాటిలో నంబర్ వన్ గా కింగ్ ఫిషర్, రెండో స్థానంలో కిమయ బీర్లు నిల్చాయి.
అయితే, ఓవైపు బ్రూవరీస్ వ్యాపారం ఇంతింతై పెరుగుతూ తీరికలేని సమయంలో కూడా.. డానీ, నటనపై మాత్రం తన ఆసక్తిని కోల్పోలేదు. సినిమాతో సంబంధాన్ని మాత్రం కొనసాగిస్తూ వచ్చాడు. తను బాగా బిజీ ఉన్న సమయంలో కూడా థ్రిల్లర్ మూవీస్ నామ్ షబానా, బేబీ వంటి సినిమాల్లోనూ నటించాడు.
డానీ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఓవైపు నటుడిగా, ఇంకోవైపు వ్యాపారిగా కొనసాగుతూనే.. కిషోర్ కుమార్, లతా మంగేష్కర్ వంటి వారితో కలిసి పాటలు కూడా పాడాడు. బ్రాడ్ పిట్ తో కలిసి సెవెన్ ఈయర్స్ ఇన్ టిబెట్ వంటి హాలీవుడ్ సినిమాల్లోనూ నటించాడు. షోలే లో గబ్బర్ సింగ్ పాత్రకు ముందు డానీ నే ఎంపిక చేశారు. అయితే అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ లో ఒక సినిమా షూటింగ్ లో ఉన్నాడు.. డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమని చెప్పగా .. ఆ అవకాశం అంజాద్ ఖాన్ కి వెళ్ళింది.
తన ఊరంటే ఉన్న మమకారంతో తన ఊరు పేరే బ్రూవరీస్ కు యుక్సమ్ గా నామకరణం చేసిన డానీ జర్నీ క్వైట్ ఇంట్రెస్టింగ్. దృఢసంకల్పం, వ్యూహాత్మక దృష్టి ఉంటేగనుక బహుళ రంగాల్లో ఎలా రాణించవచ్చో డానీ ప్రయాణం మనకు చెబుతుంది.

