ఎందరో అపార్ధ సారథులు!

Sharing is Caring...

Mangu Rajagopal …………………………………………….

సినిమా హీరో విజయ్ దేవరకొండకీ, రాజకీయనాయకుడు బండారు దత్తాత్రేయకీ ఏమిటి సంబంధం అనుకుంటున్నారా? ఇద్దరూ హైదరాబాదీలే అన్న పాయింటు తప్పితే మరే సంబంధం లేదు కాని వీరిద్దరి ఫోటోలు పెట్టడం వెనక ఒక కథా కమామీషు ఉంది. అదేమిటంటే..

ఇవాళ యథాలాపంగా ఫేసు బుక్కు తిరగేస్తుంటే విజయ్ దేవరకొండ (పేరు కట్ చేసి రాస్తానిక) దర్జాగా రెండు కాళ్లూ ఎత్తి టీపాయ్ మీద పెట్టుకుని నవ్వుతున్న ఫోటో నా కంటపడింది. తన సినిమా ప్రమోషన్ కోసం పెట్టిన ప్రెస్ మీట్ లో విజయ్ ఇలా కూర్చుని ఉండగా తీసిన ఫోటో ఇది. ఈ ఫోటో చూసి చాలామంది రెచ్చిపోయి విజయ్ మీద విరుచుకుపడుతూ చేసిన కామెంట్లు కూడా నా కంట పడ్డాయి.

“విజయ్ కింత పొగరేమిటి..ఇంత బలుపేమిటి..ప్రెస్ మీట్ లో అలా కాళ్లు ఎత్తి కూర్చుంటాడా..హన్నా” అంటూ కొంతమంది చెడామడా వాయించేశారు. “విజయ్ ప్రెస్ మీట్లని బాయ్ కాట్ చెయ్యండి” అంటూ ఒకాయన ఉత్సాహపడ్డాడు కూడాను.

నాకెందుకో ఆ ఫోటో చూడగానే చిన్న తేడా కొట్టింది. సాధారణంగా ఏ హీరో కూడా అలా మీడియాకి కాళ్లు చూపుతూ పోజివ్వడే, మరి ఇదెలా జరిగింది? అని ఆలోచిస్తుండగానే అసలు విషయం బయట పడింది.
అసలేం జరిగిందంటే….

విజయ్ తన లేటెస్టు పాన్ ఇండియా సినిమా ప్రమోషన్ కోసం దేశంలోని ప్రధాన నగరాలన్నీ తిరిగొచ్చి హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టాడు. కాసేపు మాటా మంతీ అయ్యాక ఒక జర్నలిస్టు ” మీరిప్పుడు బాలీవుడ్ హీరో అయిపోతున్నారు. మీతో మాట్లాడాలంటే మాకు కాస్త సంకోచంగా ఉంది” అని కాస్త సరదాగానే అన్నాడు.

దానికి విజయ్ గలగలా నవ్వేసి ” అన్నా, అదేం లేదే. నేనిక్కడోడినే..మీవాడినే.. ఇదిగో, ఇలా ఆరామ్ గా కూసోని ఏమన్న అడగండి” అంటూ రెండు కాళ్లూ ఎత్తి ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టాడు.
సరిగ్గా అప్పుడే ఒక ఫోటోగ్రాఫర్ కెమెరా క్లిక్ మనిపించాడు. ఆ ఫోటో ఇలా వేరే అర్ధంతో వైరల్ అయింది.

ప్రెస్ మీట్ కి వెళ్లిన సినీ జర్నలిస్టులు ఈ సరదా సంభాషణల ఫోటోనీ, దాని మీద వచ్చిన కామెంట్లనీ చూసి నెత్తీ నోరూ బాదుకుని అసలు విషయం చెప్పడం, ఆ వివరణ కూడా ఎఫ్ బీ లో రావడం జరిగింది. అయితే ఆ ఫోటో, దానిమీద నెగటివ్ కామెంట్లు వైరల్ అయినట్టు అసలు విషయం స్ప్రెడ్ కాకపోవడంతో జరగాల్సిన డ్యామేజీ జరగనే జరిగింది.

ఇప్పుడు బండారు దత్తాత్రేయ గారి దగ్గరికి వద్దాం.విజయ్ దేవరకొండ ఉదంతం చూడగానే నాకు బండారు దత్తాత్రేయగారికి జరిగిన ఒక చేదు అనుభవం గుర్తుకి వచ్చింది. ఇది జరిగి దాదాపు పదిహేనేళ్లవుతోంది. నేనప్పుడు ఆంధ్రజ్యోతిలో పని చేస్తున్నాను. అప్పుడాయన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడుగా ఉండేవారని గుర్తు.

ఉమ్మడి రాష్ట్రంలో విపరీతంగా రైతుల ఆత్మ హత్యలు జరుగుతున్న రోజులవి. ప్రతి రోజూ కనీసం ఆరుగురు రైతులు ఆకలి బాధ తాళలేక పురుగు మందు తాగి ప్రాణాలు తీసుకుంటున్నట్టు వార్తలు వస్తుండేవి. ఆ సందర్భంలో బండారు దత్తాత్రేయ గారు ఎక్కడో ఏదో సభలోనో, ప్రెస్ మీట్ లోనో మాట్లాడుతూ, “రైతులు తిన్నదరక్క ఆత్మహత్యలు చేసుకుంటున్నార”ని వ్యాఖ్యానించారు.

వెంటనే పేపర్లలో ఆ వార్త అలాగే వచ్చింది. “తిన్నదరక్క రైతుల ఆత్మహత్య: దత్తాత్రేయ” అని హెడ్డింగులు కూడా వచ్చాయి.బాంబు పేలినట్టు ఉలిక్కిపడ్డారందరూ. ఎంతో సౌమ్యంగా ఉండే దత్తాత్రేయ గారు ఇలాంటి పరుష వ్యాఖ్యలు చేయడమేమిటాని విస్తుపోయారు. ఇదే అదనుగా ప్రత్యర్ధులు యాగీ చెయ్యడం మొదలుపెట్టారు. దత్తాత్రేయ గారు నొచ్చుకుని వివరణ ఇచ్చారు.

జనరల్ గా “తిన్నదరక్క” అనే మాటని “ఒళ్లు పొగరెక్కి” అనే అర్ధంలో వాడతారు. కానీ దత్తాత్రేయ గారి ఉద్దేశం వేరట. సర్కారు పంపిణీ చేస్తున్న నాసి రకం బియ్యంతో వండిన అన్నం తిన్న రైతులకి ఆ తిన్నది అరగకపోవడం వల్లనే కడుపు నొప్పి వచ్చి ఆత్మహత్యలకి పాల్పడుతున్నారని దత్తాత్రేయ గారు చెప్పాలనుకున్నారు. “తిన్నదరక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు” అని ఆయన సింపుల్ గా చెప్పడంతో ఆ మాటకి ఇన్ని విపరీతార్ధాలు వచ్చాయి.

అయితే బండారు దత్తాత్రేయ గారి సాధు స్వభావం, నైజం, అమాయకత్వం అందరికీ తెలుసు కాబట్టి అర్ధం చేసుకుని నవ్వుకుని ఆ విషయాన్ని అక్కడితో వదిలేశారు.
ఒక్క ఫోటో ఎన్ని జ్ఞాపకాల తుట్టెని రేపిందీ?

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!