దక్షిణాదిన దీదీ పోస్టర్లు … పీకే వ్యూహమేనా ?

Sharing is Caring...

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి,తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ పోస్టర్లు కేరళలో వెలిశాయి. మమతా దేశానికి నాయకత్వం వహించాలని కోరుతూ ఈ పోస్టర్లు కనిపించడం విశేషం. ‘దీదీని  పిలవండి .. భారతదేశాన్ని కాపాడండి,చలో ఢిల్లీ  ‘ అనే నినాదంతో ఈ పోస్టర్లు వెలిసాయి. కరడు కట్టిన కమ్యూనిస్టులున్న కేరళ లో దీదీ పోస్టర్లు కనిపించడం విచిత్రమే.

కొద్దీ రోజుల క్రితం ఇలాంటి పోస్టర్లే  తమిళనాడులోని  కొన్ని ప్రాంతాల్లో కనిపించాయి. ఈ పోస్టర్లు ఇంగ్లిష్, మలయాళం భాషల్లో ఉన్నాయి. కేరళ తృణమూల్ పార్టీ పేరిట ఈ పోస్టర్లను ప్రింట్ చేశారు.  1970 దశకంలో కూడా “ఇందిరను పిలవండి .. భారతదేశాన్ని కాపాడండి .. చలో ఢిల్లీ ” అంటూ ఇలాంటి పోస్టర్లే వెలిసాయి. తర్వాత కాలంలో స్థానిక నేతలు ఇందిర అనుకూల ప్రచారాన్ని చేపట్టారు. అదే తరహాలో ఇపుడు దీదీ కి అనుకూల ప్రచారం మొదలైంది. మమతా భారీ కటౌట్లు కేరళలోని కొచ్చిలో  కనిపిస్తున్నాయి.

పశ్చిమ బెంగాల్ లో విజయం తర్వాత బీజేపీ ని ఎదుర్కోగల సమర్ధురాలు మమతా బెనర్జీ ఒక్కరే అన్న ప్రచారం కొంత కాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఈ తరహా ప్రచారం ఒక వ్యూహం ప్రకారమే జరుగుతున్నదని …వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్ ఎత్తుగడల్లో ఇదంతా భాగమని విశ్లేషకులు అంటున్నారు. దక్షిణాదిన కూడ దీదీ ని పరిచయం చేసే ఉద్దేశ్యంతోనే తృణమూల్ పార్టీ శాఖలు పెడుతున్నారని అంటున్నారు. త్వరలో ఆంధ్రాలో .. తెలంగాణలో కూడా ఇలాంటి ప్రచారం జరుగుతుందని అంటున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా దీదీ ని మెల్ల మెల్లగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వెళతారు.

ఇక దీదీ మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయడం ఖాయమని తేలిపోయింది. పదిరోజుల క్రితం ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీ లను కూడా కలిశారు. త్వరలో ఇతర పార్టీల నేతలను కూడా కలిసే యత్నాల్లో ఉన్నారు. ప్రశాంత్ కిషోర్ తెర వెనుక నుంచి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!