బూతు పాటలు … సెన్సార్ ఇబ్బందులు !

Sharing is Caring...

Bharadwaja Rangavajhala ………………………………..
Erotic songs by atreya ………………………………………….

ఆ మధ్య బూతు పాట‌లు … సెన్సార్ ఇబ్బందుల మీద జ‌రిగిన ఒక చ‌ర్చ‌లో  “ఎక్కు ఎక్కు తెల్ల గుర్రం” అనే యుగ‌పురుషుడి గీతం ప్రస్తావన కొచ్చింది. ఆత్రేయ‌ను ఎవ‌రూ బూత్రేయ అన్లేదు … ఆయ‌న్ని ఆయ‌నే బూత్రేయ అనేసుకున్నారు. వ‌చ్చేది బూతు మ‌హ‌ర్ధ‌శ అని ముందే తెలుసుకున్న న‌ర‌సింహాచార్యులుగారు ఆత్రేయావ‌తారం చాలించి … బూత్రేయ‌గా అవ‌త‌రిస్తున్న విష‌యం చెప్పార‌న్న‌మాట‌.

ఆయ‌న దాగుడు మూత‌లు సినిమా కోసం రాసిన “అడ‌గ‌క ఇచ్చిన మ‌న‌సే ముద్దు” పాట చిట్ట‌చివ‌ర్లో “నువ్వు నేను ముద్దుకు ముద్దు” అని రాశారు. దాన్ని సెన్సార్ వారు అభ్యంత‌ర పెట్టారు. మార్చాల‌న్నారు. ఆత్రేయ కోసం వెతికితే ఆయ‌న దొర‌క‌లేదు. దీంతో ఆదుర్తి గారి సలహా మేరకు “నువ్వు నేను ఊఊఊఊ” అని హ‌మ్ చేయించి సెన్సార్ వారికి చూపిస్తే ఓకే చేశారు.

ఆ త‌ర్వాత ఆత్రేయ కు ఈ విష‌యం చెప్పి పాట చూపించార‌ట‌. పాట చూసినాయన నవ్వి నాకంటే సెన్సారోళ్లే పెద్ద బూత‌య్యా అన్నార‌ట‌.ఆ త‌ర్వాతా …. ఎన్టీఆర్ స్టెప్పుల‌కు అంకిత‌మై పోయిన రోజుల్లో వ‌చ్చిన యుగ‌పురుషుడు సినిమాలో కొమిల్లా విర్క్ అనే న‌ర్త‌కీమ‌ణితో రామారావుగారు ఓ ఐట‌మ్ సాంగ్ చేస్తారు. ఆ పాట చూసి కొందరు మర్యాదస్తులు హేవిఠీ దుర్మార్గం అనడం నేను విన్నాను … సాక్షాత్తు మా స్కూలు హెడ్మాస్టర్ గారే అన్నారు.

అయితే … ఆ పాట ప‌ల్ల‌వి “ఎక్కు ఎక్కు తెల్ల‌ గుర్రం” అంటూ మొద‌ల‌వుతుంది. రికార్టులు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. కాపీ హోట‌ళ్ల కాడ, టీ కొట్ల కాడా జ‌నం ఇప‌రీతంగా వినేసేవాళ్లా పాట … శానా దారుణమైన హిట్టా పాట. అయితేనేం … సెన్సారోళ్లు అభ్యంత‌రం పెట్టారు.

దీంతో సినిమా వాళ్లు ఒరే తొంద‌ర‌ప‌డ‌కండి రిపేరు చేపిత్తామని స‌ద‌రు క‌విగారిని సంప్ర‌దిస్తే … ఒరే .. దాన్ని “ఎంత వింత లేత సొగ‌సు” అని మార్చుకుని పని కానిచ్చేయండ్రా అన్నారు. సెన్సారోళ్లు ఈ వింత సొగసు బానే ఉందన్నారు. అలా ఆ సమస్య గట్టెక్కినప్పటికిన్నీ …రికార్డుల్లో మాత్రం తెల్లగుర్రమే మిగిలిపోయింది. సినిమాలో వింత సొగసుంటుంది. 

అలాగే మాయదారి మల్లిగాడు సినిమాలో  ” తలకు నీళ్లోసుకొని” … పాట కూడ అప్పట్లో శృంగార సంచలనమే .. ” దాగి దాగని అందం దాదా అంటుంటే…”అనే చరణం ..” నాకు ముందేమో కన్నెతనం .. వెనుకేమో కుర్రతనం ఎటుపోతే ఏమౌనో ..మామో ” అన్నచరణాలు ఉంటాయి. వీటిపై సెన్సార్ దృష్టి పెట్టలేదు.

అలాగే ‘బడిపంతులు’ లో ” పరికిణీలు కట్టినపుడు లేని సొగసులు నీ పైట కొంగు చాటున దోబూచులాడెను ” వంటి చరణాలు కూడా సెన్సార్ వారికి అభ్యంతరం అనిపించలేదు. ఇక డ్రైవ‌రు రాముడు సినిమాలో కూడా మహానుభావుడు ఆత్రేయ‌గారే “గుగుగు గుడిసుంది మ‌మ‌మ‌మ మంచ‌ముంది”  అని రాస్తే సెన్సారోళ్లు ఠాఠ్ అన్నారు.

వెంట‌నే మాస్టారు మంచాన్ని మ‌న‌సుగా మార్చారు. సినిమాలో మ‌న‌సు … రికార్టుల్లో మంచం స‌ర్దుబాటు చేసుకున్నాయి.ఛాలెంజ్ రాముడు సినిమాలో “చ‌ల్ల‌గాలేస్తోంది” అన్రాశారు గురువుగారు … కాస్త క్లారిటీ కావాల‌న్నారు సెన్సారోల్లు… దీంతో ” చ‌ల్ల‌గాలి వీస్తోంది ” అని మార్చారు. రికార్టుల్లో క్లారిటీ లేకుండానే కొన‌సాగింది.

అయితే … ఆ మ‌ధ్య జూ. ఎన్టీఆర్ బాద్షా సినిమాలో “గుగుగు గుడిసుంది” పాట వాడారు. వారు రికార్టు నుంచే తీసుకోవ‌డంతో మ‌న‌సు కాకుండా మంచ‌మే వ‌చ్చేసింది. అయితే ఈ కొత్త సెన్సారోళ్ల‌కు మంచం పెద్ద‌గా అభ్యంత‌ర‌మ‌నిపించ‌లేదు… వ‌దిలేశారు. మరిలా చెప్పుకుంటూ పోతే … ఎన్నో బూతు ముచ్చట్లున్నాయి నాయనా … ప్రస్తుతానికి స్వస్తి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!