శివుని కుమారుడా? పార్వతి తనయుడా?

Sharing is Caring...

డా. వంగల రామకృష్ణ…………………………..

“శివశివమూర్తివి గణనాథ నువ్వు శివుని కుమారుడవు గణనాథ” అన్నది జానపద గేయం! మనకు తెలిసిన వినాయకవ్రతకల్పకథ వినాయకుని పార్వతీ తనయుడు అని చెబుతోంది. పార్వతి తన మేని నలుగుపిండితో వినాయకుని తయారుచేసి ప్రాణం పోసిందని ఆ కథ సారాంశం.

ఆ కథ ప్రకారం వినాయకుడి పుట్టుకలో శివుడి ప్రమేయమున్నట్టే కనబడదు.. అలాంటప్పుడు ఆయనను శివుడికుమారుడని ఎలా అనడం? శివపార్వతులు భార్యాభర్తలైనపుడు వారి కొడుకు ఇద్దరికీ కొడుకవుతాడు కదా..! మరి వారి బిడ్డను ఎవరో ఒకరికి కొడుకని ఎలా తీర్మానిస్తారు?   జానపదులపాట తెచ్చిన ఈ వివాదానికి పరిష్కారమేమిటి?

వినాయకుడు శివుని కుమారుడా? పార్వతి తనయుడా?

వినాయకుడు అయోనిజుడు కావడం వల్లే ఈ సమస్యంతా! ఒక్క వినాయకుడేకాదు..కుమారస్వామి కూడా పార్వతి కన్నబిడ్డ కాడు.. ఆయనా అయోనిజుడే! లోకాలనేలే చల్లని తల్లి, జగదంబ, ముగురమ్మల మూలపుటమ్మ అయిన పార్వతీదేవికి సర్వశుభంకరుడైన శివుని ద్వారా గర్భంపొంది నొప్పులుపడి పిల్లలనుకనే అదృష్టం కలుగలేదు. ఎంత దురదృష్టం! పార్వతి ఎంత సరదాపడ్డా ఆమె కోరిక నెరవేరనే లేదు.

వరాహ పురాణం ప్రకారం వినాయకుడు శివుని నవ్వు నుంచి జన్మించాడు. నిర్జన నివాసమైన మంచుకొండలోనూ, అమంగళకరమైన స్మశానవాటికలోనూ నివాసమున్నా శివుడు తెల్లగా..గొప్ప అందంగా ఉంటాడు. శివుడి నవ్వు నుంచి ఉద్భవించిన వినాయకుడు కూడా శివుడి లాగే ఎంతో అందగాడు.

చందమామమ ఛాయ (శశివర్ణం). వ్రతకథలో కూడా వినాయకుడు నలుగుపిండితో తయారయ్యాడు అంటే పచ్చని మేని ఛాయతో వెలిగిపోయాడని కదా అర్థం. ఎలా చూసినా వినాయకుడు నయన మనోహర రూపుడని అర్థమవుతుంది. శివుని కుమారుడంటే ముల్లోకవాసులకూ ముద్దే కదా! ఏ కన్ను ఎలాంటిదో..ఎవరి దృష్టి ఎలాంటిదో అని తరచి చూసిన మూడుకళ్ళ శివుడు వినాయకుడి రూపం సవరించి పొట్టిగా, ఏనుగు తల, బాన పొట్ట ఉండేలా చేశాడు.

వినాయకుడి ఆకారం వికారంగామారడాన్ని చూసి పార్వతి నొచ్చుకుంది. అమ్మ మనసు తెలుసుకున్న విష్ణుమూర్తి అందం ఆకర్షణ కలిగించి చూడచక్కని వానిగా మలచాడు. ఎంతైనా జగన్మోహనాకారుడు కదా..! అనూహ్యంగా పుట్టుకొచ్చిన వినాయకుడికి పార్వతి సకల శక్తియుక్తులు కలిగిస్తే శివుడు గణాధిపత్యం,ఆదిపూజ్యత ఇచ్చి లోకారాధ్యుని చేశాడు. ఇందుకోసం వినాయక, సుబ్రహ్మణ్యేశ్వరులకు లోకం చుట్టే పోటీ పెట్టాడు. గెలిచిన వారికి గణాధిపత్యం అన్నాడు.

శరీర సౌకర్యం, వాహన సౌలభ్యం లేని వినాయకుడికి విజయం కలిగించేందుకు విశ్వనాథుడు విష్ణుమంత్రాన్ని ఉపదేశించాడు. మూడువంతులు నీటితో నిండి ఉండే ఈ ప్రపంచాన్ని దాటి రావడానికి జలాధిపతి అయిన నారాయణుడు ఎంతగానో ఉపయోగపడ్డాడు. ఆవిధంగా వినాయకుడు శ్రీహరి అనుగ్రహాన్ని చూరగొని శైవ, వైష్ణవ, శక్తి గణాలకు ఆరాధ్యుడయ్యాడు. గణపతిగా పేరుతెచ్చుకున్నాడు.

వినాయక తత్త్వం చూడగానే అర్థమయ్యేలా చేసేందుకు శివుడు గణపతికి ఉండే నరముఖాన్ని తొలగించి ఏనుగుతల తగిలించి తెలివి తేటలకు, విద్యాబుద్ధులకు, పరమ పట్టుదలకు నిలయునిగా మార్చివేశాడు. గణాధిపత్యం, ఆదిపూజ్యత కూడా చేకూరడంతో త్రిమూర్తులను మించిన దేవుడయ్యాడు. పార్వతి కూడా ఊహించని విధంగా వినాయకుడు వాసికెక్కాడు.

వినాయక వ్రత కథ ప్రకారం వినాయకుణ్ణి తయారుచేసేటప్పటికి పార్వతికి ఇంతటి దేవుణ్ణి సృష్టించాలన్న ఆలోచన లేదు. శివుని జోక్యంతోనే వినాయకుని స్థాయి, హోదా మారిపోయాయి. వినాయకుని అభ్యున్నతికి శివుడు అసామాన్యమైన తోడ్పాటు అందించడంతో వినాయకుని దశాదిశా మారిపోయింది. ఈ విధంగా చూసినా వినాయకుడు శివశివమూర్తే అవుతున్నాడు. కనుక జానపదుల పాట తప్పుకాదు.

గణపతి అంటే…?

గణపతి అంటే గణాలకు అధిపతి అని ప్రతిఒక్కరూ చెబుతారు. ఎవరా గణాలు అంటే విఘ్నగణాలు అంటారు. వినాయకుని కొలిచే భక్తగణాలను గాణాపత్యులు అంటారు. ఆధ్యాత్మిక కోణంలోంచి చూస్తే  “గ” అంటే జ్ఞానం, “ణ” అంటే బుద్ధి. బుద్ధి ఉంటే జ్ఞానసిద్ధి తప్పనిసరి. కనుకనే సిద్ధి, బుద్ధి ఆయనకు భార్యలు అన్నాయి పురాణాలు. సిద్ధి, బుద్ధులను భార్యలని ఎందుకు చెప్పారు? ఇవి ఎల్లప్పుడూ వినాయకుని అనుసరించి ఉంటాయి కనుక.. అనుసరించి ఉండే ధోరణి భార్యలది కనుక..!  పురాణాలు సిద్ధి, బుద్ధులను వినాయకుని భార్యలన్నాయి.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!