Will the party get out of the corruption allegations? …………….
కేజ్రీవాల్ అధికారిక నివాసం శీష్ మహల్ మరమ్మత్తులు .. లిక్కర్ స్కాం ఆరోపణలు ఆప్ పార్టీ కొంప ముంచాయి.అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన ఆప్ అవినీతి ఆరోపణలతో కూరుకుపోయింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అవినీతి వ్యవహారాలే ఆప్ కి షాక్ ఇచ్చాయి.
ఎన్నికలకు ముందు నుంచి కూడా కేజ్రివాల్ అధికార నివాసం “శీష్ మహల్..” అంతకు ముందు లిక్కర్ స్కాం రోజూ వార్తల్లో నిలిచి ‘ఆప్’ను ఇబ్బందుల్లోకి నెట్టాయి. శీష్ మహల్.. మర్మమత్తులకు 33 కోట్ల రూపాయల ప్రజాధనం కేటాయించారని ‘కాగ్’ నివేదిక లో ప్రస్తావించడం బీజేపీకి ప్రధాన అస్త్రంగా మారింది.
ప్రజల్లోకి ఈ విషయాన్నీ తీసుకెళ్లేలా బీజేపీ ప్రచారం చేసింది. ప్రధాని మోదీ సైతం ఈ విషయంలో గట్టి విమర్శలు గుప్పించారు.బీజేపీ,కాంగ్రెస్ పార్టీల ప్రచారం ఢిల్లీ ప్రజలను ఆలోచించేలా … ఆప్ కి వ్యతిరేకంగా ఓటు వేసేలా చేసింది.ఓటర్లలో ఎక్కువమంది విద్యాధికులు కావడంతో ఈ అంశం వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
ఇక కేజ్రీవాల్ అధికార నివాసం ‘శీష్‌మహల్’ లో ఖరీదైన టీవీలు, ఎయిర్ కండిషనర్లు, ఫ్రిజ్లు, బెడ్స్,విలాసవంతమైన వాష్‌రూమ్‌లు తదితర లక్జరి ఐటమ్స్అమర్చారు. వీటిలో 88 అంగుళాల ఓఎల్‌ఈడీ టీవీ (రూ.28.9 లక్షలు), పది 4కే సోనీ ఓఎల్‌ఈడీ టీవీలు (రూ.43.9 లక్షలు) సామ్‌సంగ్ మల్టీ-డోర్ రిఫ్రిజిరేటర్(రూ. 3.2 లక్షలు) రెండు స్టీమ్ ఓవెన్ లు (రూ. 6.5 లక్షలు) వాషింగ్ మెషీన్(రూ. 1.9 లక్షలు ) మైక్రోవేవ్ ( రూ. 1.8 లక్షలు ) బెడ్‌లు, సోఫాల కోసం రూ.13 లక్షలు ఖర్చు చేశారు.
ఆవిరి యంత్రాలు, అధునాతన పరికరాలతో కూడిన స్పాతో సహా అదనపు లగ్జరీ సదుపాయాలు సమకూర్చారు. ఇంకా జిమ్, వంటగది , టాయిలెట్లు వంటి ప్రదేశాలలో 75 బోస్ సీలింగ్ స్పీకర్లు, 50 ఇండోర్ ఎయిర్ కండీషనర్‌లు అమర్చారు. మరి కొన్ని వస్తువులపై రూ. 18 కోట్లు ఖర్చు చేశారు. ఈ వస్తువులన్నీ సరైన టెండరింగ్ లేకుండా సమకూర్చారు.
ఈ మరమ్మత్తులకు,పునర్నిర్మాణం కోసం ప్రాథమిక అంచనా రూ. 7.91 కోట్లు మాత్రమే. 2020లో పనులు అప్పగించినప్పుడు ఇది 8.62 కోట్లకు చేరుకుంది.పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ 2022లో పనులు పూర్తి చేసే సమయానికి ఖర్చు రూ.33.66 కోట్లకు పెరిగింది.
కాగ్ నివేదిక ప్రకారం 2022 వరకు రూ. 33.86 కోట్లను ఖర్చు అయింది. బిజెపి ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా వాస్తవ వ్యయం చాలా ఎక్కువ అని చెబుతున్నారు. 2023, 2024 ఖర్చులను నివేదికలో పొందుపరచలేదని ఆయన ఆరోపణ.
ANI నివేదిక ప్రకారం, బంగ్లాలోని వస్తువుల జాబితాను పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ ధర రూ. 75-80 కోట్ల వరకు ఉంటుంది. ఈ పనులపై సీబీఐ విచారణ కూడా జరుగుతోంది.
ఇక లిక్కర్ స్కాం లో ఆరోపణల గురించి తెలిసిందే. అవన్నీ ఇప్పటివరకు ఆరోపణలే. కానీ శీష్ మహల్ పునర్ నిర్మాణంలో జరిగిన అవకతవకలు .. కాగ్ అభ్యంతరాలు ఓటర్లపై ప్రభావం చూపాయి. కేజ్రీవాల్ ఇమేజ్ ని దెబ్బతీసి పార్టీ పరాభవానికి కారణమైనాయి.
————-KNM