His songs are immortal……………………………………
సిరివెన్నెల సీతారామశాస్త్రి పేరు వినగానే ఎన్నో పాటలు గుర్తుకొస్తాయి. సిరివెన్నెలను ఎవరితో పోల్చలేం. ఆయన శైలే వేరు. అలా ప్రత్యేకంగా ఒక శైలి ఏర్పర్చుకున్నారు కాబట్టే ఆయన పాటలు అజరామరంగా నిలిచే స్థాయిలో ఉన్నాయి. సినీ పరిశ్రమలోకి రాకముందు శాస్త్రి ‘భరణి’ అనే కలం పేరుతో కవిత్వం రాశారు.
సిరివెన్నెల మొదటి సినిమా జననీ జన్మ భూమి. బాలకృష్ణ హీరో గా విశ్వనాధ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అది. తర్వాత సిరి వెన్నెల తో పాపులర్ అయ్యారు..అప్పటి నుంచి ఆయన పేరు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గా స్థిరపడిపోయింది. ఆయన పాటలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యం. మొదట్లో ఆయన పాటల్లో ఎక్కువ సంస్కృత పదాలు ఉండేవి. కాలక్రమంలో సరళమైన పదాలతో పాటలు రాయడం అలవాటు చేసుకున్నారు.
నా ఉచ్ఛ్వాసం కవనం .. నా నిశ్వాసం గానం …. చందమామ రావే .. జాబిల్లి రావే … బూడిదిచ్చేవాడిని నేమి అడిగేది ? వంటి పాటలు ఇప్పటికి అక్కడక్కడ వినిపిస్తుంటాయి.స్వర్ణకమలంలో ‘శివపూజకు చిగురించిన..’ పాట రాసేందుకు పదిహేను రోజులు టైమ్ తీసుకున్నారట. విశ్వనాధ్ తో పనిచేయడమంటే అంత సులభం కాదు. పదాలు .. భావం ఆయనకు నచ్చాలి. ఆయనకు నచ్చేవరకు పల్లవులు .. చరణాలు మారుతుంటాయి అని ఒక ఇంటర్వ్యూ లో సిరివెన్నెల చెప్పారు.
విశ్వనాధ్ సానబట్టిన ఆ కలంతో ఎన్నో మధురమైన పాటలు అందించాడు. ఒకటా రెండా ? చెప్పుకుంటే పోతుంటే బోలెడు. “బలపం పట్టి భామ ఒడిలో అ ఆ ఇ ఈ నేర్చుకుంటా” అన్నాడు …”కొత్తగా రెక్కలొచ్చెనా “అని పాడాడు. “జాము రాతిరి జాబిలమ్మా .. జోలపాడనా” అని రాసిన కలంతోనే “నమ్మకు నమ్మకు ఈ రేయిని” అని ఆగ్రహం ప్రకటించాడు. “నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని లోకాన్ని”అని నిరసన కూడా వ్యక్తీకరించాడు.
“నేస్తమా ఇద్దరి లోకం ఒకటే లేవమ్మా” అంటూ మరో అద్భుత గీతాన్ని అందించాడు. “స్వప్నాల వెంట స్వర్గాల వేట “- అంటూనే “జగమంత కుటుంబం నాది “అన్నాడు. ఆయన రాసిన కొన్ని పాటల్లో ఫిలాసఫీ తొంగి చూస్తుంది. “నువ్వొస్తానంటే నేనొద్దంటానా ” వర్షాన్ని ఆహ్వానించే గీతం కూడా అప్పట్లో పెద్ద హిట్.
దర్శకుడు పాట ద్వారా ఏమి చెప్పాలనుకుంటున్నాడో సిరివెన్నెల కరెక్ట్ గా క్యాచ్ చేస్తాడు. అందుకు అనుగుణంగా పాటలు రాయడం లో దిట్ట. అలా రాసిన పాట ” గగనానికి ఉదయం ఒకటే, కెరటాలకు సంద్రం ఒకటే” ఇక “లలిత ప్రియ కమలం విరిసినదీ” అన్న సిరి వెన్నెల “రేపల్లె మళ్ళీ మురళి విన్నది, ఆ పల్లె కళే పలుకుతుంది” అని చాటాడు .అలాగే మనీ మనీ లో చక్రవర్తికి .. వీధి బిచ్చగత్తెకు అన్నపాట ఎంత గొప్పగా రాశాడో ? ఆయన ప్రతిభకు మచ్చుతునకలుగా ఇలా ఎన్నో పాటలను చెప్పుకోవచ్చు.
పరిశ్రమలో అందరి డైరెక్టర్లకు సిరివెన్నెలంటే ఇష్టమే. టాలీవుడ్ దిగ్గజ పాటల రచయితలలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఒకరు గా భాసిల్లారు. సిరివెన్నెల పాటలు మధురానుభూతిని కలిగించేలా ఉంటాయి. లోతైన భావంతో, అచ్చ తెలుగు పదాలతో పాటలు రాసి తనదైన శైలి తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు ఆయన. తెలుగు సినీ గీతాల వనంలో తన పాటలతో వెన్నెల వాన కురిపించి అర్ధాంతరంగా మాయమై పోయాడు.
———-KNMURTHY