లత వద్దంటే .. ఆమె వినలేదా ?

Sharing is Caring...

 Sweet singer…………………………..

ఆశా భోంస్లే స్వర మాధుర్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె కు పెద్ద ఫాలోయింగ్ ఉంది. ఇవాళ ఈ స్థాయికి ఎదగడానికి జీవితం లో ఆశా ఎన్నో కష్టాలను .. నష్టాలను ఎదుర్కొన్నది. చిన్నవయసులో తప్పటడుగులు వేసింది. తర్వాత సరిదిద్దుకుంది. ఆశా 16 ఏళ్ళ వయసులో ఉండగా .. లతా మంగేష్కర్ అప్పటికే గాయనిగా స్థిరపడింది.

ఆశా తనను తాను నిరూపించుకోవడానికి అప్పట్లో ఎన్నో ప్రయత్నాలు చేసింది..ఆ రోజుల్లోనే ఆశా ఎవరూ ఊహించని అడుగు వేసింది. ఆమె లతా మంగేష్కర్ కార్యదర్శి గణపతిరావు భోంస్లే తో ప్రేమలో పడింది. లతా మంగేష్కర్ హెచ్చరించినప్పటికీ వినిపించుకోలేదు. ఇంటినుంచి వెళ్ళిపోయి .. పెళ్లి చేసుకుంది.

దీంతో లతా కు కోపమొచ్చింది. ఇద్దరి మధ్య సంబంధాలు తెగిపోయాయి. ఆశా తన 31 ఏళ్ల భర్తతో కలిసి జీవించడానికి తన కుటుంబాన్ని విడిచి పెట్టాల్సి వచ్చింది. ఆశా కు హేమంత్ పుట్టిన తర్వాతనే మంగేష్కర్ కుటుంబం మళ్ళీ కల్సింది. కానీ గణపతిరావు భార్య లత తో సన్నిహితంగా ఉండటం సహించలేకపోయేవాడు. మరో ఇద్దరు పిల్లలు పుట్టారు. ఈ క్రమంలోనే వారి కుటుంబంలో కష్టాలు మొదలైనాయి.

గణపతిరావు డబ్బు కోసం ఆశను తరచుగా వేధించేవాడు. లతను కలవకుండా ఆమెను అడ్డుకునేవాడు. రోజూ ఇంట్లో గొడవలు అయ్యేవి. దీంతో ఆమె అతగాడిని వదిలేసి బయటకొచ్చి కెరీర్ పై దృష్టి సారించింది.వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంది. ఓపీ నయ్యర్ ఆశాను బాగా ఎంకరేజ్ చేసాడు. ఆ తర్వాత ఆమె కెరీర్ కొత్త శిఖరాలకు చేరుకుంది.ఆమెకు అభిమానుల ఫాలోయింగ్ పెరిగింది. ప్రముఖ సంగీత దర్శకుడు రాహుల్ దేవ్ బర్మన్ కూడా ఆమె అభిమానే.

అంతకు ముందే బర్మన్ రీటా పటేల్‌ను వివాహం చేసుకున్నాడు.తర్వాత విడాకులు తీసుకున్నాడు. అప్పటికే ట్రెండ్ సెట్టర్ గా ఎదిగాడు. సంగీతం పట్ల ఉన్న ప్రేమ వారిని మరింత దగ్గర చేసింది. బర్మన్ ఆశా కంటే ఆరేళ్లు చిన్నవాడు. ఒక రోజు బర్మన్ ఆమెకు ప్రపోజ్ చేశాడు. తొలుత ఆశా ఆ ప్రతిపాదనను అంగీకరించ లేదు. కొన్నాళ్ల తర్వాత ఆశా అతనిని వివాహం చేసు కోవడానికి అంగీకరించింది.1980 లో ఆ ఇద్దరూ వివాహం చేసుకున్నారు.

ఆశా బర్మన్ జంట సంగీత పరిశ్రమను కొన్నాళ్ళు ఏలారు. బర్మన్ 331 చిత్రాలకు సంగీతం అందించాడు. ఆశా భోంస్లే .. కిషోర్ కుమార్‌తో కలిసి ఎక్కువగా పని చేశాడు. కొన్ని హిట్ సాంగ్స్ కూడా పాడాడు. షోలే సినిమాలోని మెహబూబా మెహబూబా పాట ఆయన పాడిందే. ఆశా రెండవ వివాహం కొన్నాళ్ళు సజావుగానే సాగింది. బర్మన్ తాగుడికి అలవాటు పడిన క్రమంలో ఆ ఇద్దరూ విడిపోయారు.దూరంగా గా ఉంటున్నా వారు తరచుగా కలుసుకునే వారు. ఈ సమయంలోనే బర్మన్ గుండెపోటు తో మరణించాడు.

ఆర్ డి బర్మన్ మరణం తరువాత ఆశా మళ్ళీ కెరీర్ పై శ్రద్ధ పెట్టింది. ఆమె రంగీలాతో తిరిగి వచ్చింది, ఆమె చాలా చిన్న వయస్సులో ఉన్న ఊర్మిళ మటోండ్కర్‌కి తన గాత్రాన్ని అందించింది. ఆ తర్వాత, ఆమె అనేక ఇతర బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో పని చేసింది.ఒక దశలో లతా మంగేష్కర్ తో కూడా పోటీ పడే స్థాయికి చేరుకుంది. అందరు సంగీత దర్శకులతో పనిచేసింది.దక్షిణాది సంగీత దర్శకులు ఇళయరాజా, రహమాన్ లు కూడా ఆమె చే ఎన్నో పాటలు పాడించారు. ఇక అవార్డులు రివార్డులు గురించి చెప్పనక్కర్లేదు.

ఆమె ముగ్గురు పిల్లలలో పెద్దవాడు హేమంత్ భోంస్లే కొన్నాళ్ళు పైలట్‌గా చేసాడు.తర్వాత సంగీత రంగంలోకి వచ్చాడు. ఆశా కుమార్తె వర్ష 2012 లో ఆత్మహత్య చేసుకుంది.ఆమె ది సండే అబ్జర్వర్, రీడిఫ్‌లలో కాలమిస్ట్‌గా పనిచేశారు. ఇంకో కుమారుడు ఆనంద్ భోంస్లే బిజినెస్ లో సెటిల్ అయ్యారు.అది సింపుల్ గా ఆశా భోంస్లే కథ.

———KNM

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!