విదేశీ రుణాలతో పాక్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది. ఇమ్రాన్ పార్టీ సర్కార్ ఎక్కువగా రుణాలు చేయడంతో ఏదో ఒక రోజు అక్కడి ఆర్ధిక వ్యవస్థ బుడగలా పేలడం ఖాయమంటున్నారు. మొన్న శ్రీలంక , నిన్న నేపాల్ ఆర్ధిక సంక్షోభాలను చూసాం. ఇక పాక్ ఒకటే మిగిలింది. ఈ మూడు ఇండియా పొరుగు దేశాలు.
పాకిస్థాన్ మితి మీరి అప్పులు చేసి పతనానికి దగ్గరగా ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ విదేశీ రుణం 127 బిలియన్ డాలర్లు… అంటే రూ.9,51,642 కోట్లు దాటింది. ఆ దేశ చరిత్రలో ఇదే అత్యధిక స్థాయి రుణం అని కూడా చెప్పుకోవాలి.
ఐఎంఎఫ్ తో సహా ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, విదేశాల నుంచి తీసుకున్న రుణాలతో పాటు స్థానిక స్థాయిలో వాణిజ్య బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు కూడా ఇందులో కలిసాయి. ప్రభుత్వంతో పాటు దేశంలోని ఇతర సంస్థలు తీసుకున్న అప్పులను కూడా ఇందులో కలుపుతారు. ఈ రుణాలకు ప్రభుత్వం హామీ ఇస్తుంది.
ఇంతగా అప్పులు పెరిగిపోవడానికి గత ప్రభుత్వాలే కారణమని పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఇమ్రాన్ పెట్టిన పార్టీ ప్రభుత్వం అంటుంది. అయితే, పీటీఐ అధికారంలోకి వచ్చిన 39 నెలల్లో రుణాలు ఎక్కువ తీసుకున్నారు. గత ప్రభుత్వాలు తీసుకున్న రుణాలను వడ్డీతో సహా చెల్లించాల్సిన పరిస్థితి కారణంగా మళ్లీ రుణాలు తీసుకోవాల్సి వచ్చిందని ఇమ్రాన్ ప్రభుత్వం అప్పట్లో వాదించేది.
అయితే, అప్పులు తీర్చడానికే కాకుండా ద్రవ్య లోటును పూడ్చడానికి కూడా ప్రభుత్వం రుణాలు తీసుకుందని ఆర్ధిక నిపుణుల అభిప్రాయం. ఇమ్రాన్ ప్రభుత్వం బలహీనమైన విధానాల వల్ల దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది, అందుకే అప్పుల పైనే ఆధారపడాల్సి వస్తోందని వారంటున్నారు. పీటీఐ ప్రభుత్వం అప్పులు చేసిన రేటు గత రెండు ప్రభుత్వాల కన్నా ఎక్కువగా ఉందని నిపుణులు భావిస్తున్నారు.
2008లో పాకిస్తాన్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించినప్పటి నుంచి వరుసగా మూడు పార్టీలు అధికారంలోకి వచ్చాయి. అవి.. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ , పాకిస్తాన్ ముస్లిం లీగ్ , పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ ఈ మూడు పార్టీలు భారీగానే అప్పులు చేశాయి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ డేటా ప్రకారం, 2008లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అధికారంలోకి వచ్చిన సమయానికి మొత్తం విదేశీ రుణం 45 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ. 3,37,198 కోట్లు.2013లో వీరి పాలన ముగిసే సమయానికి ఇవి 61 బిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ.4,57,099 కోట్లకు చేరుకున్నాయి. తరువాత అధికారంలోకి వచ్చిన నవాజ్ లీగ్ పాలన 2018 లో ముగిసే సమయానికి విదేశీ రుణాలు 95 బిలియన్ డాలర్లకు అంటే సుమారు రూ.7,11,944 కోట్లుకు పెరిగాయి.
ఇమ్రాన్ ప్రభుత్వం పాలనలో 2021 సెప్టెంబర్ చివరి నాటికి ఈ రుణాలు 127 బిలియన్ డాలర్లకు అంటే రూ.9,51,642 కోట్లకు చేరుకున్నాయి. ఈ లెక్కల ప్రకారం పీపీపీ పాలనలో విదేశీ రుణం 16 బిలియన్ డాలర్లు పెరిగితే, నవాజ్ లీగ్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో 34 బిలియన్ డాలర్లు పెరిగింది. వీటితో పోల్చి చూస్తే పీటీఐ హయాంలో కేవలం 39 నెలల్లోనే విదేశీ రుణం 32 బిలియన్ డాలర్లు పెరిగింది.
1947 నుంచి 2008 వరకు దేశానికి కేవలం 60 బిలియన్ల అప్పులు మాత్రమే ఉన్నాయని, ఆ తరువాత కేవలం 13 ఏళ్లలోనే అవి 500 బిలియన్లు దాటాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఒక రోజుకు రుణాల లెక్క చూసినా గత రెండు ప్రభుత్వాల కన్నా పీటీఐ ప్రభుత్వం రుణాలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది నుంచే పాకిస్తాన్ సమస్యల సుడిగుండంలో ఇరుక్కోవడం మొదలైంది.
ఉగ్రవాదులకు మద్ధతు ఇస్తోందన్న కారణంతో ఎఫ్ఏటీఎఫ్ పాక్‌ను గ్రేలిస్టులో పెట్టింది. బ్లాక్ లిస్టులోకి వెళ్లేదే కానీ, ఆ దేశానికి టర్కీ, మలేషియా, చైనాలు మద్ధతుగా నిలబడడంతో తప్పించుకోగలిగింది. గ్రేలిస్టులో ఉండడం వలన ఆర్థిక సంస్థలు సహాయం చేయవు.
ఇదిలా ఉంటే పాక్ కు అండగా ఉన్న సౌదీ అరేబియాతో వైరం పెట్టుకోవడంతో ఆ దేశం ఇచ్చిన అప్పులను బలవంతంగా తిరిగి తీసుకుంది. ఇదే సమయంలో చైనా కూడా తన అప్పులను తీర్చమని అడగడంతో గతి లేక రుణాల్లో కొంత భాగం రీషెడ్యూల్ చేసింది.
ఈ క్రమంలో విదేశీ మారకపు నిల్వలు అడుగంటిపోయాయి. సౌదీ అరేబియా వద్ద అవమానకర రీతిలో తల తాకట్టు పెట్టి కొంత సొమ్మును అప్పుగా తీసుకుంది. ప్రపంచ బ్యాంకు వద్ద ఫండ్ కోసం అభ్యర్థించగా, వారు పెట్టిన షరతులతో దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇటు ఆర్ధికంగా సతమతమవుతుంటే ఇమ్రాన్ మాస్కో పర్యటన చేసి అమెరికా ఆగ్రహానికి గురయ్యారు.
పరిస్థితిని గమనించిన ఆ దేశ ఐఎస్ఐ, ఆర్మీ రెండూ కూడా ఇమ్రాన్‌కు మద్దతివ్వడం మానేశాయి. ఇదే అదనుగా ప్రతిపక్షాలు తమ బలం పెంచుకున్నాయి. అంతేకాక, ఇమ్రాన్ పీటీఐ పార్టీలోని 23 మంది జాతీయ అసెంబ్లీ సభ్యులను తమ వైపుకు తిప్పుకున్నాయి. దీంతో ఇమ్రాన్ చైనా వైపు చూశాడు. అక్కడినుంచి ఎలాంటి స్పందన లేదు.. చివరికి విపక్షాలు అవిశ్వాస తీర్మానానికి నోటీసులివ్వడంతో ప్రభుత్వాన్ని రద్దు చేశాడు.
ఇక అక్కడనుంచి కథ అందరికి తెలిసిందే .. ఏ ప్రభుత్వం వచ్చినా.. ఆర్ధిక సమస్యలు అలాగే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.