డెబ్భైవ దశకం అవార్డుల సినిమా!!

Sharing is Caring...

Subramanyam Dogiparthi…………………….

ఊరుమ్మడి బతుకులు. సీరియస్ సినిమాలు చూసే ప్రేక్షకులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా ఎంపికైంది. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ చిత్రంగా కూడా అవార్డు గెల్చుకుంది. ఈ సినిమాలో హీరోగా నటించిన సత్యేంద్ర కుమార్  ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు.

ఊరుమ్మడి బతుకుల కష్టాల సినిమా . ఓ అరవై డెభ్భై ఏళ్ళ కిందట బాగా వెనుకబడ్డ ప్రాంతాలలోని గ్రామాల్లో పేదల్ని పీల్చిపిప్పి చేసిన పెత్తందార్లను నోరు లేనోడు చంపేసిన సినిమా. సినిమా పెద్దగా ఆడలేదు కానీ అవార్డులు సంపాదించింది.

ఈ సినిమా దర్శకుడు బి యస్ నారాయణ. వామపక్ష భావజాలం ఫుల్ గా ఉన్నవాడు . కరీంనగర్ జిల్లా వాసి. తర్వాత కాలంలో ‘నిమజ్జనం’ సినిమా కూడా తీశారు. ఈ సినిమా కొరకు ఈయనతో పాటు రాళ్లు ఎత్తిన తోటి నిర్మాత మరో వామ పక్ష భావజాల సినిమాలు తీసిన వేజెళ్ళ సత్యనారాయణ . వీరిద్దరితో పాటు కె వి చలం , జి వి ఆర్య .

ఈ సినిమా హీరో సత్యేంద్ర కుమార్ కూడా తెలంగాణా లోని ఖమ్మం జిల్లా వాసి. నాటకాల మీద , సినిమాల మీద ఆసక్తితో ఉద్యోగం వదులుకొని చిత్ర సీమ కొచ్చారు. అనుకున్న మేరకు ఆదరణ పొందలేక నిష్క్రమించాడు . చాలా సినిమాల్లో చిన్నాచితకా పాత్రల్లో కనిపించాడు . బాలయ్య సినిమాల్లో ఎక్కువగా కనిపించాడు . ఓ అయిదారు సినిమాల్లో హీరోగా నటించాడు. 

హీరోయిన్ మాధవి. తూర్పు పడమర సినిమా కన్నా ముందే ఈ సినిమా తో కెరీర్ ప్రారంభించింది. నూతన్ ప్రసాద్ పేరుని టైటిల్సులో వర ప్రసాద్ అనే వేసారు . బహుశా పూర్తి కావటం , రిలీజ్ కావటం ఆలస్యం అయి ఉండవచ్చని భావిస్తున్నాను. సినిమాలో మాధవి నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నూతన్ ప్రసాద్ సినిమాలో మోతుబరి విలన్ పాత్రను పోషించాడు. నాటకానుభవంతో పాత్రను పండించాడు.

ఇతనితో పాటు మరో పెత్తందారీ విలన్ . అచ్చోసిన ఆంబోతుల్లాగా ఆడామగా అందరి మీద పడుతుంటారు . ఆ క్రమంలో హీరో చేతిలో ఖతం అవుతారు. ఈ సినిమా ద్వారా బ్రేక్ వచ్చిన నటుడు రాళ్ళపల్లి . 1973 లో వచ్చిన స్త్రీ సినిమా మొదటిది అయినా సినిమాలోనే అతనికి బ్రేక్ వచ్చింది . సుమారు 800 సినిమాల్లో నటించాడు. 

ఈ సినిమాకు మాటల రచయిత సి యస్ రావు . దర్శకుడు సి యస్ రావు కాదు . చింతపెంట సత్యనారాయణరావు కథ కూడా ఆయనే అందించారు. యం బి శ్రీనివాస్ సంగీత దర్శకుడు. ఎర్ర కన్నీరు పాటలు. పాటల్ని శ్రీశ్రీ , కొంపెల్ల శివరాంలు వ్రాసారు . శ్రీ శ్రీ కవిత ‘శ్రమైక జీవనసౌందర్యానికి ‘ పాటగా వాడుకున్నారు. మంటలు రేగు రాముడే దేవుడైతే నీవు కూడా వంటివి ఓ మూడు పాటలు ఉన్నాయి. బాల సుబ్రమణ్యం పాడారు. ఫిమేల్ సింగర్ ఎవరూ లేరు. 

కళ , కళలు జనానికి వినోదం పంచిపెట్టి సంతోషాన్ని కలగచేయటానికా లేక సమాజంలో ఉన్న వివిధ రకాల రుగ్మతలను దిగంబరంగా ఎత్తి చూపి , సందేశాలను ఇచ్చి జాగృతపరచటానికా అనే చర్చ తెగేది కాదు. బి యస్ నారాయణ , తిలక్ , మాదాల రంగారావు , నారాయణమూర్తి  వంటి  అభ్యుదయ నిర్మాతలు కొన్ని విప్లవధోరణి గల రెండో కేటగిరి సినిమాలను అందించారు. 

రుగ్మతలను మెత్తగా , ఆలోచింప చేసే విధంగా మేధో విప్లవ సినిమాలను షుగర్ కోటేడ్ మాత్రల్లాగా గూడవల్లి రామబ్రహ్మం , కె విశ్వనాథ్ , వి మధుసూధనరావు , దాసరి నారాయణరావు , బాపు, టీ. కృష్ణ వంటి దర్శక నిర్మాతలు అందించారు. జనానికి సినిమాల ద్వారా వినోదాన్ని , ఆనందాన్ని అందించారు కె యస్ ప్రకాశరావు , ఆయన కుమారులు రాఘవేంద్రరావు , బాపయ్యలు .

సినిమాలను చూసి జనం మారుతారా ?! అనుమానమే . ఎక్కడో ఒకరో అరా . నాగయ్య గారి యోగి వేమన సినిమా చూసి ఓ బాలయోగి అవతరించాడని చెపుతారు . మనకు తెలియకుండా ఇలా ఎక్కడైనా మారారేమో తెలియదు .

ఉరుమ్మడి బతుకుల కష్టాల మీద చాలా సినిమాలు వచ్చాయి . వినోదం అనే షుగర్ కోటింగ్ లేకుండా ఆయుర్వేద ఆచార్యుల గారి కషాయం , విరేచన మాత్రల్లాంటి సినిమా ఇది . మస్తు సామాజిక స్పృహ లేకపోతే చూడలేరు. ఉందనుకున్న వారు యూట్యూబులో చూడవచ్చు.

Sharing is Caring...
Support Tharjani
error: Content is protected !!